తెలుగుదేశం మహిళా నేత గాయత్రి సస్పెన్షన్
posted on Apr 29, 2025 10:35AM
.webp)
తెలుగుదేశంమహిళా విభాగం నేత గాయత్రిని పార్టీ సస్పెండ్ చేసింది. భారత్, పాక్ మధ్య సంబంధాలు, ప్రస్తుత పరిస్థితులపై ఆమె ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు, ప్రసంగలే కారణమని చెబుతున్నారు. పార్టీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందున గాయత్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పరచూరి అశోక్ బాబు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. గాయత్రిపై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలే ఇందుకు కారణమని అంటున్నారు.
విజయవాడకు సందిరెడ్డి గాయత్రి గతంలో తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలోవైసీపీ నేతలు, కార్యకర్తల విమర్శలకు కౌంటరిస్తూ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. టీవీ చర్చా కార్యక్రమాల్లోనూ టీడీపీ వాదనను బలంగా వినిపించారు. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో ఆమెపై వెల్లువెత్తిన విమర్శల కారణంగానే గాయత్రి సస్పెండ్ కావడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పాకిస్థాన్, భారత్ సంబంధాలపై ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్, బీజేపీలు తీవ్ర అభ్యంతరం తెలపడమే గాయత్ని సస్పెన్షన్ కు కారణంగా చెబుతున్నారు. ముఖ్యంగా ఆమె భారత ఇతిహాసాలు మహాభారతం, రామాయణంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గాయత్రిని సస్పెండ్ చేయడమే కాకుండా దర్యాప్తునకు కూడా తెలుగుదేశం ఆదేశించింది.
గాయత్రిపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ హిందూ ఐటీ సెల్, బిజెపి ఆర్ఎస్ఎస్ ల డిమాండ్ మేరకే గాయత్రిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సస్పెన్షన్ పై గాయత్రి స్పందన ఏమిటన్నది తెలియాల్సి ఉంది.