ఖమ్మంలో తెలుగుదేశం సభ.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్

టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు తెలంగాణపై దృష్టి కేంద్రీక‌రించారు. ఒక వైపు ఏపీలో రాబోయే ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తూనే.. మరో వైపు తెలంగాణ‌లోని టీడీపీ క్యాడ‌ర్‌లోనూ జోష్ నింపి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లో టీడీపీకి కంచుకోట‌గా చెప్పుకొనే ఖ‌మ్మం జిల్లా నుంచి చంద్ర‌బాబు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చే కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.  ఖ‌మ్మం  స‌ర్దార్ ప‌టేల్ స్టేడియంలో బుధవారం (డిసెంబర్ 21) బ‌హిరంగ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే తెలంగాణ టీడీపీ నేత‌లు బ‌హిరంగ స‌భ ఏర్పాట్ల‌ను పూర్తి చేశారు. చంద్ర‌బాబు భారీ కాన్వాయ్ తో హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరి రోడ్డు మార్గం ద్వారా ఖ‌మ్మం వెళ్తారు. ఖ‌మ్మం జిల్లా సరిహద్దులో  కూసుమంచి వ‌ద్ద టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్య‌లో చంద్ర‌బాబుకు ఘ‌న స్వాగ‌తం ప‌ల‌క‌నున్నారు.

ఖ‌మ్మం జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల‌ను బ‌హిరంగ స‌భ‌కు త‌ర‌లించేలా ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖ‌మ్మంలో బ‌హిరంగ స‌భ‌ను విజ‌య‌వంతం చేయడం ద్వారా తెలంగాణ టీడీపీలో జ‌వ‌స‌త్వాలు నింపేందుకు చంద్ర‌బాబు త‌న తొలి అడుగు వేయ‌నున్నారు. చంద్ర‌బాబు స‌భ విజ‌య‌వంతం అయితే తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క మార్పులు చోటుచేసుకోవడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా చంద్ర‌బాబు బ‌హిరంగస‌భ‌లో చేయ‌బోయే ప్ర‌సంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.  చంద్ర‌బాబు త‌న స్పీచ్‌లో తెలంగాణలోని టీడీపీ శ్రేణుల‌కు ఎలాంటి దిశానిర్దేశం చేస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

చంద్ర‌బాబు బ‌హిరంగ స‌భ‌పై ఇప్ప‌టికే బీఆర్ఎస్ ఓ క‌న్నేసి ఉంచిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రోవైపు బీజేపీ కూడా  ఖ‌మ్మంలో జ‌రిగే చంద్ర‌బాబు స‌భ‌పై ఫోక‌స్ పెట్టింది. తెలంగాణ‌లో బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య రాజకీయ పోరు రసతవ్తరంగా ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తుంటే కేసీఆర్ ముచ్చటగా మూడో సారి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న పట్టుదలతో పావులు కదుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో తెలుగుదేశం బలోపేతం కావడం, రాజకీయంగా క్రియాశీలం కావడం కేసీఆర్ కు ఒకింత ఇబ్బందే.

ఇంత వరకూ తెలంగాణ సెంటిమెంట్ పేరుతో కేసీఆర్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలం కాకుండా అడ్డుకోగలిగారు. కానీ ఇప్పుడు తెరాస పేరు మార్చి బీఆర్ఎస్ గా నామకరణం చేసి జాతీయ రాజకీయాలు అనడంతో ఆయన తెలంగాణ సెంటిమెంట్ అంటూ మాట్లాడే అవకాశం కోల్పోయారు. ఎందుకంటే పార్టీ పేరు నుంచే తెలంగాణను తీసేసిన కేసీఆర్ ఇక తెలుగుదేశం పార్టీని నిందించడానికి ఆంధ్రాపార్టీ, వలస పాలన అన్న మాటలు అనే అవకాశం లేకుండా పోయింది. ఇక టీఆర్ఎస్ కాదు కాదు.. బీఆర్ఎస్‌ విషయానికి వస్తే ఆ పార్టీలో  స‌గానికిపైగా క్యాడ‌ర్ టీడీపీ నుంచి వెళ్లిందే.

ఇక ప్రస్తుతం కీలకంగా ఉన్న నేతలలో కూడా అత్యధికులు తెలుగుదేశం నుంచి వచ్చిన వారే. అందుకే ఇప్పుడు తెలుగుదేశం కనుక తెలంగాణలో బలపడితే భారీగా నష్టపోయేది బీఆర్ఎస్ మాత్రమే.  ఇక బీజేపీ అయితే ఖమ్మం సభ విజయవంతమైతే.. బీజేపీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు చేయి చాస్తుంది. అందుకు ప్రతిగా ఏపీలో కూడా తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం కలిగే విధగా పొత్తుకు సై అనే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే ఏపీలో జనసేన, బీజేపీలు తెలుగుదేశం పార్టీతో కలిసి నడిచే అవకాశాల కనిపిస్తున్నాయి.

ఖమ్మంలో తెలుగుదేశం సభ విజయవంతం అయితే  ఆ అవకాశాలు మరింత మెరుగౌతాయి. దీంతో తెలుగుదేశం పార్టీకి ఏపీలో, బీజేపీకి తెలంగాణలో బాగా కలిసివస్తుందన్న అంచనాలు ఉన్నాయి.  అంటే ఇక్కడ తెలంగాణ‌లో బీజేపీ బ‌లం పెర‌గ‌డంతో పాటు, ఆంధ్రాలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ   టీడీపీకి అనుకూలంగా మార‌డం ద్వారా టీడీపీకి ప్రయోజనం చేకూరుతుందన్న మాట. ఈ వ్యూహంతోనే చంద్రబాబు ఖ‌మ్మం సభను విజయవంతం చేసి తెలుగుదేశం సత్తా చాటాలన్న పట్టుదలతో ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu