ఉద్యోగాలు ఇవ్వం.. మాంసం అమ్మండి! జగనన్న కొత్త స్కీమ్ ఇదేనా..
posted on Sep 12, 2021 2:49PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాంసం దుకాణాల ఏర్పాటు ప్రతిపాదన వివాదాస్పమవుతోంది. జగన్ రెడ్డి సర్కార్ నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. పిచ్చి తుగ్లక్ లా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మాంసం దుకాణాల కాన్సెప్ట్ పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. జగనన్న మటన్ షాపులంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ఉపాధ్యాయులతో మద్యం అమ్మించిన సీఎం జగన్మోహన్ రెడ్డి, తాజాగా నిరుద్యోగులతో మాంసం అమ్మించబోతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బుద్దా వెంకన్న విమర్శించారు. డిగ్రీలు, పీజీలు చదివిన వారికి, తగిన ఉద్యోగాలు ఇవ్వలేని అసమర్థ ముఖ్యమంత్రి.. చివరకు వారికి మాంసం కొట్లలో కొలువులివ్వడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. మాంసం, చేపలు, రొయ్యలు అమ్మే బడుగు, బలహీనవర్గాల కడుపు కొట్టడానికే ముఖ్యమంత్రి ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారని విమర్శించారు. గతంలో ఇసుక అమ్మకాల పేరుతో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారని, ఇప్పుడు మాంసం విక్రయాల పేరుతో లక్షల మందికి తిండిలేకుండా చేయబోతున్నారన్నారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాంసం అమ్మడం మొదలెడితే, చెప్పిన ధరకే వినియోగదారుడు కొనాలని, లేకపోతే బెదిరించైనా మాంసాన్ని ప్రజలకు అంటగడతారని బుద్దా వెంకన్న అన్నారు. విజయసాయిరెడ్డి సలహాతోనే ముఖ్యమంత్రి మటన్ మార్టుల ఏర్పాటుకు సిద్ధమయ్యారనిపిస్తోందన్నారు. సీఎం, విజయసాయిరెడ్డిల ఆలోచనలన్నీ అంతిమంగా వారి ఖజానా నిండటానికే పనికొస్తాయి తప్ప, ప్రజలకు మేలుచేయవన్నారు. మాంసం అమ్మకాలు చేపట్టాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే బడుగు, బలహీనవర్గాల వారితో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతామని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.
ఏపీ ప్రభుత్వం మొబైల్ మాంసం దుకాణాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఎక్కడైనా మటన్ అమ్ముకునే విధంగా వ్యాన్లను సిద్దం చేస్తుంది. ఇందులోనే మేకలను గొర్రెలను విక్రయిస్తారు. ఆరోగ్యకరమైన మేక, గొర్రె మాంసం, తలకాయ, కాళ్ళు, బోటీవి అందుబాటు ధరల్లో అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఏపీ మీట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో యూనిట్ రూ.10 లక్షల అంచనా వ్యయంతో తొలిదశలో మహానగరాలు, నగరాలు, పట్టణ ప్రాంతాల్లో 112 యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. అయితే ప్రభుత్వ నిర్ణయంలో వేలాది మంది మటన్ విక్రేతలు రోడ్డున పడే అవకాశం ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఉపాధి ఎలాగూ కల్పించలేకపోతున్నాం.. ఏదో ఉపాధి చూసుకుంటూ జివిస్తున్న కుటుంబాల పొట్ట కొట్టడం ఎందుకనే వాదన వస్తోంది.