సకుటుంబ సపరివార సమేత!

అచ్చెన్నాయుడికే దక్కిన అధ్యక్ష పదవి

 

నారా-నందమూరి ఫ్యామిలీకి చెరో రెండు

 

బాబాయ్-అబ్బాయ్, తల్లీ కొడుకులకు చోటు

 

కళాకు ఒక న్యాయం, రమణకు మరో న్యాయం

 

కొత్త వారికి పదవులతో పార్టీ పరుగులు

 

టీడీపీ జాతీయ-రాష్ట్ర కమిటీల తీరిది

 

ఎట్టకేలకు చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ-రాష్ట్ర కమిటీలు ప్రకటించారు. ఇందులో నారా-నందమూరి కుటుంబాలకు చెరో రెండు పదవులు దక్కగా, బాబాయ్-అబ్ణాయ్, తల్లీ-కొడుకులకు రెండేసి పదవులు లభించాయి. అయితే ఏపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావును తొలగించిన నాయకత్వం, తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా మాత్రం ఎల్.రమణను కొనసాగించటం ఆశ్చర్యం. పైగా ఇతర కమిటీల్లో ఉన్న వారికి మరో కమిటీలో కూడా స్థానం కల్పించటం పార్టీ శ్రేణులకు విస్మయం కలిగించింది.

 

చంద్రబాబు ప్రకటించిన పార్టీ జాతీయ-రాష్ట్రాల కమిటీలలో కొత్త వారికి స్థానం కల్పించడం, ముఖ్యంగా యువతకు, బడుగు వర్గాలకు చోటివ్వడం ద్వారా, పార్టీని పరుగులు పెట్టించే వ్యూహం కనిపిస్తోంది. అయితే ఈ కమిటీలో అగ్ర కులానికి సంబంధించి వైశ్య కులానికి ఒకరికి చోటివ్వగా, బ్రాహ్మణ వర్గానికి ప్రాతినిధ్యం కనిపించలేదు. తెలంగాణ నుంచి ఒక మహిళా నేతకు బ్రాహ్మణ కోటా నుంచి ఇచ్చారని చెబుతున్నప్పటికీ, ఆమె ఆ సామాజికవర్గానికి చెందిన వారు కాదని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. గతంలో శిద్దా రాఘవరావుకు కోశాధికారి ఇవ్వగా, ఇప్పుడు అదే వైశ్య వర్గానికి చెందిన శ్రీరాం తాతయ్యకు ఆ పదవి ఇచ్చారు. రాష్ట్రంలో వైశ్య జనాభా ఎక్కువగానే ఉన్నా, ఒక్కటే ఇచ్చారు. నిజానికి అధ్యక్ష పదవి దక్కించుకున్న అచ్చెన్నాయుడు పోలినాటి వెలమ కంటే, వైశ్య వర్గం నాలుగింతల సంఖ్య ఎక్కువగా ఉండటం ప్రస్తావనార్హం. అయితే, రాష్ట్రంలో ప్రాబల్యం ఉన్న రెడ్డి వర్గానికి కేవలం మూడు పదవులే దక్కడం ప్రస్తావనార్హం. సోమిరెడ్డి, కోట్ల, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డికి మాత్రమే స్థానం లభించింది. కడప-కర్నూలు-నెల్లూరు-అనంతపురం-చిత్తూరులో రెడ్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆ వర్గం నుంచి ఈసారి పెద్దగా చోటు లభించలేదు. బహుశా రెడ్లు వైసీపీ వైపు ఉంటారన్న భావనతో, సంఖ్య తగ్గించి ఉండవచ్చంటున్నారు. జెసి కుటుంబానికి పదవి ఇస్తామని చెప్పినప్పటికీ, దివాకర్‌రెడ్డి వద్దని తిరస్కరించినట్లు చెబుతున్నారు. మొత్తంగా కమిటీలో, కమ్మ వర్గానికి 9 పదవులు లభించాయి. కేంద్ర కమిటీలోని 27 మందిలో ఓసీలకు 51, మిగిలిన వర్గాలకు 49 శాతం పదవులు దక్కాయి.

 

ఇక అంతా అనుకున్నట్లే, అచ్చెన్నాయుడుకు ఏపీ అధ్యక్ష పదవి దక్కింది. ఈఎస్‌ఐ అక్రమాల కేసులో ఆయన ఇటీవలే జైలుకు వెళ్లి వచ్చారు. బహుశా ఆ అర్హతతోనే ఆయనకు ఆ పదవి లభించి ఉండవచ్చు. అంటే పార్టీ కోసం జైలుకెళ్లిన వారికి, పార్టీ అండగా ఉంటుందన్న సంకేతాలిచ్చేందుకే, ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చి ఉండవచ్చు. జైలుకు వెళ్లి వచ్చిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రకూ పొలిట్‌బ్యూరో దక్కినందున, ఆవిధంగానే భావించాల్సి ఉంది. ఇక చంద్రబాబు ఎలాగూ జాతీయ అధ్యక్షుడు. లోకేష్‌కు మళ్లీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి లభించింది. అయితే, బాబు వియ్యంకుడయిన నందమూరి బాలకృష్ణకు పొలిట్‌బ్యూరో, నందమూరి హరికృష్ణ కమార్తె సుహాసినీకి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవులు దక్కడం ద్వారా, నారా-నందమూరి కోటాలు భర్తీ చేసినట్టయింది.

 

అయితే, జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో నరా లోకేష్, వర్ల రామయ్య, రామ్మోహన్‌నాయుడు, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర, కొత్తకోట దయాకర్‌రెడ్డిలలో.. ఒక్క నారా లోకేష్‌కు మాత్రమే, సెంట్రల్ కమిటీ నుంచి పొలిట్‌బ్యూరో ఎక్స్‌అఫిషియో సభ్యుడి అయ్యే అవకాశం లభించింది. జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరైన రామయ్యకు పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పించి, మళ్లీ అదే పోలిట్‌బ్యూరోలో లోకేష్‌కు ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా అవకాశం లభించడం ప్రస్తావనార్హం. గల్లా అరుణకు జాతీయ ఉపాధ్యక్ష పదవి, ఆమె కుమారుడు గల్లా జయదేవ్‌కు పొలిట్‌బ్యూరో పదవి లభించింది.

 

ఇక ఈసారి కొత్తగా రాజకీయ కార్యదర్శి పదవి సృష్టించి, దానిని టిడి జనార్దన్‌కు ఇవ్వగా, కార్యాలయ కార్యదర్శి పదవి అశోక్‌బాబుకు లభించింది. దానిని గతంలో ఏవి రమణ నిర్వహించేవారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డికి జాతీయ ఉపాధ్యక్షుడు, సీనియర్ నేత బుచ్చయ్యచౌదరికి పొలిట్‌బ్యూరో, ఇటీవలి కాలంలో దూకుడుగా వెళతూ సర్కారుకు చెమటలు పట్టిస్తున్న పట్టాభికి జాతీయ అధికార ప్రతినిధి పదవులు దక్కడం విశేషం. కొత్త కమిటీలో ప్రధానంగా పట్టాభికి కీలక స్థానం ఇవ్వడంపై హర్షం వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటికే తెలంగాణ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న జోత్స్నకు మళ్లీ జాతీయ అధికార ప్రతినిధి, ఏపీ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న అనితకు పొలిట్‌బ్యూరోలో, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వర్ల రామయ్యకు మళ్లీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా అవకాశం లభించడం ప్రస్తావనార్హం. ఇది జాబితా కూర్పులో పొరపాటు జరిగిందా లేక, జాబితానే ఆవిధంగా రూపొందించారో తెలియదని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.  

 

ఇక తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఎల్.రమణను మళ్లీ  కొనసాగించడం చర్చనీయాంశమయింది. విఫల నాయకుడిగా పార్టీలో ఇబ్బంది పడుతున్న ఆయనను కొనసాగించడంపై పార్టీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. రమణ స్థాయిలో చెప్పింది వినే నాయకుడు లేకపోవడమే బహుశా ఆయన కొనసాగింపునకు కారణం కావచ్చంటున్నారు. మరి ఏపీలో కళా వెంకట్రావును ఏ ప్రాతిపదిక తొలగించి, తెలంగాణలో ఏ ప్రాతిపదికన రమణను కొనసాగించారో అర్ధం కావడం లేదంటున్నారు. ఇంకా కనీసం వెంకట్రావు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. టీడీపీకి 23 స్థానాలయినా వచ్చాయని, కానీ రమణ సారథ్యంలో పార్టీ మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని గుర్తు చేస్తున్నారు. పైగా రమణపై తెలంగాణ పార్టీ  నేతలంతా తిరుగుబాటు చేసినా, బాబు ఆయననే కొనసాగించడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

 

అయితే, తెలంగాణ నుంచి సీనియర్ నేత అరవిందకుమార్ గౌడ్‌కు పొలిట్‌బ్యూరో, జాతీయ అధికార ప్రతినిధిగా నర్శిరెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డి- బక్కని నర్శింహులుకు జాతీయ ప్రధాన కార్యదర్శి, మెచ్చా నాగేశ్వరరావుకు జాతీయ ఉపాధ్యక్ష పదవులివ్వడం ద్వారా, తెలంగాణకు పెద్దపీట వేసినట్టయింది. ఎలాగూ రావుల పోలిట్‌బ్యూరోలోనే కొనసాగుతున్నారు. కానీ, రమణను అధ్యక్ష పదవి తొలగించకుండా, కొసాగించడం ద్వారా.. తెలంగాణలో పార్టీకి ఆయన తప్ప మరో దిక్కు, సమర్ధులు లేరన్న సంకేతం పంపినట్టయింది.

 

అయితే ఏపీలో అచ్చెన్నాయుడు, తెలంగాణలో రమణ అధ్యక్షులుగా ఉన్నప్పటికీ.. వారికెవరికీ సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదన్నది బహిరంగ రహస్యమే. కాబట్టి అధ్యక్షులుగా ఎవరున్నా పెద్దగా ఒరిగేదేమీ లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు-లోకేష్ దిశానిర్దేశంలోనే పనిచేయాలి కాబట్టి.. ఎవరికి ఏ పదవి ఇచ్చినా ఒకటేనని స్పష్టం చేస్తున్నారు. ఈసారి పితాని, కొల్లు రవీంద్ర, బీద రవిచంద్ర, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, బచ్చుల అర్జునుడు, శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, నక్కా ఆనందబాబు వంటి వారికి స్ధానం కల్పించడం అభినందనీయమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కానీ, దూకుడుగా వెళ్లే ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్‌కు ఎక్కడా చోటు లభించకపోవడం చర్చనీయాంశమయింది. ఒకవేళ పయ్యావుల కేశవ్‌కు పీఏసీ చైర్మన్ ఇచ్చినందున ఆయనకు పదవి ఇవ్వలేదనుకున్నా.. మరి టీడీఎల్పీ ఉపనేతగా ఉన్న అచ్చెన్నాయుడికి, అధ్యక్ష పదవి ఎలా ఇచ్చారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 

-మార్తి సుబ్రహ్మణ్యం