ఇక తెలుగుదేశం, జనసేన ఉమ్మడి కార్యాచరణ.. వైసీపీకి దబిడిదిబిడే!

తెలుగుదేశం, జనసేన కూటమి ఇక ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలని నిర్ణయించింది.  జనసేనాని పవన్ కల్యాణ్.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో చర్చించారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న పవన్ కల్యాణ్ తో చంద్రబాబు ఇరు పార్టీల నేతల మధ్య సమన్వయంపై చర్చించినట్లు తెలుస్తోంది.  ఆంధ్రప్రదేశ్ లో  తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు, నేతలపై పోలీసు కేసులను ఎదుర్కొనే వ్యూహంపై ఇరువురి మధ్యా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

అరెస్టుల ముసుగులో వైసీపీ నేతలు తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తల ఓట్లు తొలగించే వ్యూహం రచించారని, దానిని గుర్తించి ఎన్నికల సంఘానికి ఎప్పటికప్పుడు చేస్తున్న ఫిర్యాదులపై ఇరువురూ చర్చించారు. దీనికి సంబంధించి లీగల్ సెల్‌తో సమావేశం నిర్వహించాలన్న నిర్ణయానికి ఇరువురు నేతలూ వచ్చినట్లు తెలిసింది. తమ  పార్టీల  కార్యకర్తలు, నాయకులపై అక్రమంగా కేసుల నమోదులో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసు అధికారులు, పోలీసులపై న్యాయనిపుణులతో  చర్చించి ప్రైవేటు కేసులు వేయాలని ఇరువురు నేతలూ ఒక నిర్ణయానికి వచ్చినట్లు  విశ్వసనీయంగా  తెలిసింది. అలా చేయడం ద్వారా  తమ  పార్టీల క్యాడర్ లో మనోస్థైర్యం నింపాలని ఇరువురు నేతలూ  ఒక నిర్ణయానికి వచ్చినట్లు  తెలుగుదేశం, జనసేన వర్గాలు  చెబుతున్నాయి.  ఇప్పటికే  క్షేత్రస్థాయిలో తెలుగుదేశం, జనసేన మధ్య సమన్వయం ఉందనీ, దానిని మరింత పటిష్టం  చేసేందుకు అవసరమైన విధంగా  ముందుకు సాగాలన్న దిశగా చర్చ జరిగిందని చెబుతున్నారు.

ఉమ్మడి  ఉభయ గోదావరి  జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలలో పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ రాయలసీమ జిల్లాలలో, ఇతర చోట్ల తెలుగుదేశం, జనసేన శ్రేణుల మధ్య మరింత  సమన్వయం  పెరగాల్సిన  అవసరం ఉందని గుర్తించినట్లు చెబుతున్నారు.  అలాగే ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా  జిల్లాలపై మరింత  దృష్టి సారించాల్సిన  అవసరాన్ని ఇరువురు నేతలూ గుర్తించి , ఆ దిశగా ఇరు పార్టీల నేతలనూ సమాయత్తం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఆ రెండు జిల్లాలలోనూ నియోజకవర్గాల  వారీగా  ఉమా ఉమ్మడి సమావేశాలు, నియోజకవర్గాల వారీగా నిర్వహించాలన్న అంశంపై చర్చించారు. అలాగే ఉమ్మ డి మేనిఫెస్టోతో పాటు.. ఇరు పార్టీల  నేతల ఉమ్మడి ప్రెస్ మీట్లు, ఉమ్మడి  సభలు నిర్వహించే దిశగా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. అందులో భాగంగా  ఈ నెలలోనూ తెలుగుదేశం జాతీయ  ప్రధాన  కార్యదర్శి లోకేష్, జనసేనాని  పవన్ కల్యాణ్ లు ఇరువురూ కలిసి  పాల్గొనేలా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.

అలాగే అధికార పార్టీ నేతల విమర్శలకు దీటుగా బదులిచ్చే విషయంలో ఇరు పార్టీల నేతలూ ఏ మాత్రం వెనుకాడకుండా, కలిసి ఎదురుదాడి చేసే విధంగా ఉమ్మడి వ్యూహం రచించేందుకు నిర్ణయం తీసుకున్నారు.  ఇక ఇప్పుడు తెలుగుదేశం, జనసేనల ఉమ్మడి కార్యాచరణతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి  కావడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu