తెలుగు ప్రజలకు మళ్ళీ మంచి రోజులు

 

మళ్ళీ చాలా ఏళ్ల తరువాత తెదేపా, బీజేపీలు జత కట్టి, ఎన్నికలలో అఖండ విజయం సాధించి పూర్తి మెజార్టీతో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం చెప్పట్టబోతున్నాయి. ఆ రెండు పార్టీల మధ్య మంచి సఖ్యత కూడా ఏర్పడటంతో, ఎన్డీయే ప్రభుత్వంలో తెదేపా చేరేందుకు అంగీకరించింది. అయితే ఎంతమందికి ఏఏ పదవులు ఇస్తారనే విషయం ఇంకా బయటపెట్టలేదు. నిన్న డిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు సమావేశం అనంతరం ఈ విషయాన్నీ స్వయంగా ప్రకటించారు. అదేవిధంగా రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వంలో బీజేపీ చేరుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు ప్రకటించారు.

 

బీజేపీకి పూర్తి మెజార్టీ ఉన్నపటికీ, తన విజయానికి సహకరించిన అన్ని పార్టీలకు తన ప్రభుత్వంలో తగు ప్రాతినిధ్యం ఇవ్వాలని నరేంద్ర మోడీ పట్టుబట్టిన్నట్లు సమాచారం. తెదేపా-బీజేపీల మధ్య ప్రస్తుతం కనబడుతున్నసఖ్యత, సానుకూల వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభసూచికం. ఆ రెండు పార్టీలు తమ మైత్రిని ఇదే రీతిలో వచ్చే ఐదేళ్ళు కూడా కొనసాగించగలిగితే రాష్ట్రం ఊహించిన దానికంటే చాలా తక్కువ సమయంలో మంచి అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇంత చక్కటి సంబంధాలు ఏర్పడటమే కాక, కేంద్రంలో రాష్ట్రంలో రెండు చోట్ల కూడా మంచి సమర్ధులు, కార్యదక్షులు, దూరదృష్టికల మోడీ, చంద్రబాబులు అధికారం చెప్పట్టబోతున్నందున రాష్ట్రానికి మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయని భావించవచ్చును. తెలుగు ప్రజలు చక్కటి విజ్ఞతను కనబరుస్తూ కేంద్రంలో, రాష్ట్రంలో సుస్థిరమయిన ప్రభుత్వాలను నెలకొల్పి ఇటువంటి సానుకూల వాతావరణం కల్పించగలిగారు. అందుకు వారందరినీ అభినందించవలసిందే.

 

తెలంగాణాలో ప్రజలు కూడా తెరాసకు పూర్తి మెజార్టీతో అధికారం కట్టబెట్టినందున అక్కడ ముఖ్యమంత్రిగా చేపడుతున్న కేసీఆర్ ఇకనయినా ఆంద్ర ప్రజల పట్ల, ఆంధ్ర పాలకుల పట్ల తన విద్వేష ధోరణి విడనాడి, సఖ్యతతో మెలుగుతూ తెలంగాణా అభివృద్ధికి గట్టిగా కృషిచేసినట్లయితే, కేంద్రంలో మోడీ కూడా ఆయనకు సహకరించేందుకు సంసిద్దంగా ఉన్నారు.

 

నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, మంచి పరిపాలన అందిస్తున్న కారణంగానే ప్రధానమంత్రిగా ఎన్నికయిన విషయం ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రులు గుర్తుంచుకొని తమ తమ రాష్ట్రాలను పోటీపడి అభివృద్ధి చేసినట్లయితే, మళ్ళీ వచ్చే ఎన్నికల సమయంలో ప్రజలను ఓట్లకోసం దేబీరించవలసిన అవసరం ఉండదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu