శ్రీవారి ఆలయంపై దుష్ప్రచారాల వెనుక రహస్యం...
posted on Apr 9, 2020 8:03PM
తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్య కైంకర్యాలు కూడా జరగడంలేదు.. శ్రీవారి అఖండ దీపం కొండెక్కిపోయింది..2 వేల అయిదు వందల ఏళ్ళ తర్వాత శ్రీవారి ఆలయం మూసివేశారు..వసంతోత్సవాల సందర్భంగా నైవేద్యాలు వెంటవెంటనే పెట్టి తీరని అపచారం చేశారు..కరోనా మహమ్మారి కారణంగా శ్రీవారి భక్తులకు దర్శనాలు నిలిపివేసిన నాటినుంచి ఇలాంటి ఎన్నో వదంతులు, దుష్ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం గురించి మనం చూస్తూనే, వింటూనే ఉన్నాం.
ఇవన్నీ కేవలం వదంతులేనని భక్తులెవరూ వీటిని నమ్మవద్దని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, పెదజీయర్ స్వామీజీలు కూడా ఎన్నడూ లేని విధంగా మీడియా ముఖంగా వివరణలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు కూడా తెలిసినవే.
పెద్ద జీయర్ స్వామి ఆధ్వర్యంలో స్వామికి అన్ని సేవలు జరుగుతున్నాయని, కొన్ని వేల సంవత్సరాల అనంతరం తిరుమల ఆలయాన్ని మూసివేశారంటూ వస్తున్న వదంతులను, జరుగుతున్న దుష్ప్రచారాన్నినమ్మొద్దని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పెద్ద జీయర్ స్వామి ఆధ్వర్యంలో స్వామి వారికి ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు అన్ని కైంకర్యాలు ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతున్నాయని, వసంతోత్సవాల సందర్భంగా మొదటి గంట నైవేద్యం, రెండో గంట నైవేద్యం వెంటవెంటనే పెట్టారని, ‘ఇది అపచారం’ అంటూ సామాజిక మాధ్యమాల్లో వదంతులు సృష్టిస్తున్నారని, ఇలాంటివి నమ్మొద్దని సూచించారు. ఇలా దుష్ప్రచారం చేసే వారు చట్ట రీత్యా శిక్షార్హులు అని హెచ్చరించారు. శ్రీవారి ఆలయంలోని అఖండ దీపం కొండెక్కిపోయింది అని పుట్టిన వదంతులపై పెదజీయర్ స్వామీజీ కూడా స్వయంగా మీడియాలో వివరణ ఇచ్చారు. ఆగమ శాస్త్ర ప్రకారం స్వామివారికి జరగాల్సిన నిత్య కైంకర్యాలకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడే ప్రశ్న తలెత్తే ప్రశక్తి లేదని స్పష్టం చేశారు.
.jpg)
ఇదిలా ఉండగా ఇన్ని వదంతులు, దుష్ప్రచారాలు జరుగుతున్నా, అందరికన్నా ముందుగా వీటిని అరికట్టాల్సిన టీటీడీ అధికారిక చానల్ ఎస్వీబీసీ మాత్రం మొద్దు నిద్ర పోతోందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. కొందరైతే అసలు ఈ వదంతుల వెనుక సదరు ఛానల్ ‘పెద్ద’ హస్తం కూడా లేకపోలేదనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో శ్రీవారి ఆలయంపై ఈ స్థాయిలో దుష్ప్రచారాలు రావడం వెనుక ఎస్వీబీసీ సిఈఓ యలమంచలి వెంకట నగేష్ పాత్ర ఉందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్త పరుస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్వీబీసీ సిఈఓగా నియమితులైన సదరు వ్యక్తికి గత ఏడాది మే నెలతోనే పదవీ కాలం ముగిసిందనీ తన పదవీ కాలాన్ని మరి కొంత కాలం పొడిగించాలని అయన చేసుకున్న విన్నపాలు, నడిపిన లాబీయింగ్ పని చెయ్యకపోవడం వల్ల జగన్ ప్రభుత్వాన్ని హిందూ వ్యతిరేకిగా చూపే ప్రయత్నం జరిగి ఉండవచ్చన్న అనుమానాలు కూడా తీసివేయలేమని అభిప్రాయపడుతున్నారు.