కేసీఆర్‌కు అసలు ఓటు అడిగే అర్హత లేదు

 

మహాకూటమి ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా  సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్, మోదీలపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ తమ ముందు తలవంచాల్సిందేనని అక్బరుద్దీన్‌ అన్నారని, అలాంటి ఎంఐఎంతో అంటకాగడానికి కేసీఆర్‌కు సిగ్గుందా? అని ప్రశ్నించారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులు, మైనార్టీలు, మేధావులపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. గోరక్ష పేరుతో చిత్రవధకు గురిచేస్తున్నారని, దళితులపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ బీజేపీపై పోరాడుతుంటే.. టీఆర్‌ఎస్‌ బీజేపీతో అంటకాగుతోందని విమర్శించారు. దళితులపై హత్యాకాండ కొనసాగుతుంటే కేసీఆర్‌ ఒక్కమాట మాట్లాడలేదని, బీజేపీకి కేసీఆర్‌ భయపడుతున్నారని విమర్శించారు. ఓ వైపు బీజేపీతో, మరోవైపు ఎంఐఎంతో కేసీఆర్‌ అంటకాగుతున్నారన్నారు. ఇచ్చిన హమీలు కేసీఆర్ నిలబెట్టుకోకపోగా ధర్నాచౌక్‌ను రద్దు చేశారని మండిపడ్డారు. కేసీఆర్‌కు అసలు ఓటు అడిగే అర్హత లేదన్నారు. గెలిస్తే సేవ చేస్తా, ఓడితే ఫామ్‌హౌస్‌కు వెళ్తానని కేసీఆర్‌ తన ఓటమిని ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ తొత్తు కేసీఆర్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని సురవరం సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.