చదవండి.. నిద్రపోండి!

 

ఈ పోటీ ప్రపంచంలో మిగతా విద్యార్థులకి దీటుగా ఉండాలంటే పాఠ్యపుస్తకాలను బట్టీపడితే సరిపోదు. చదివిన చదువు చక్కగా ఒంటబట్టాలి. ఎప్పుడు పడితే అప్పుడు తిరిగి వాటిని గుర్తుకుతెచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ఇందుకు సంబంధించిన ఒక చిత్రమైన పరిశోధన ఫ్రాన్స్‌లో జరిగింది. సైకలాజికల్‌ సైన్స్‌ అనే పత్రికలో ప్రచురించిన ఈ కథనం చదువుకి సంబంధించి ఒక కొత్త చిట్కాను అందిస్తోంది.

 

చదువు తరువాత నిద్ర

తమ పరిశోధనలో భాగంగా లియాన్ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు ఓ 40 మందిని ఎన్నుకొన్నారు. ఆ నలభైమందిని రెండు జట్లుగా విడదీసి... వాళ్లు అంతకు ముందు ఎప్పుడూ వినని కొన్ని పదాలనూ, వాటికి అర్థాలనూ నేర్పారు. ఉదయం పూట ఒక జట్టుకీ, సాయంత్రం వేళ ఒక జట్టుకీ ఈ శిక్షణ సాగింది. కొన్నాళ్ల తరువాత పరిశీలించి చూద్దురు కదా! సాయంత్రం వేళ నేర్చుకున్న విద్యార్థులు ఉదయంపూట అభ్యసించిన విద్యార్థులకంటే త్వరగా, సమర్థవంతంగా పదాలను నేర్చుకోవడాన్ని గమనించారు. 

 

కారణం!

‘మన మెదడుకి కాస్త విశ్రాంతిని ఇస్తే, అది అప్పటివరకూ నేర్చుకున్న విషయాలను జ్ఞాపకాల రూపంలోకి మలుచుకునే అవకాశాన్ని ఇచ్చినట్లు అవుతుంది’ అంటున్నారు- ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన స్టీఫెన్‌ మజ్జా అనే పరిశోధకులు. అందుకనే చదువు తరువాత నిద్రపోయినవారిని కొంతకాలం తరువాత ప్రశ్నించినా కూడా, తాము నేర్చుకున్న విషయాలను చక్కగా గుర్తుచేసుకోగలిగారట. అంటే వారి మెదడులో ఆ విషయం జ్ఞాపకాల రూపంలో శాశ్వతంగా, పదిలంగా ఉండిపోయిందన్నమాట!

 

ఉపయోగం

బాగా చదువుకోవాలనే తపనతో చాలామంది విద్యార్థులు సరిగా నిద్రపోరు. ఇలా సరైన నిద్ర లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎలాగూ వస్తాయని తెలుసు. కానీ నిద్ర మానేసి చదవడం వల్ల అసలుకే మోసం వస్తుందని ఈ పరిశోధనతో రుజువైపోతోంది. ఇక ఉదయాన్నంతా చదువుకున్న విషయాలను సాయంత్రం వేళల్లో ఒకసారి అలా పునశ్చరణ చేసుకుంటే మరింత ఉపయోగంగా ఉంటుందన్న చిట్కాని ఈ పరిశోధన అందిస్తోంది. ఏదన్నా క్లిష్టమైన పాఠాన్ని చదువుకున్న తరువాత ఓ చిన్న కునుకు తీసినా కూడా ఉపయోగంగా ఉండవచ్చునేమో! అటు శరీరానికి విశ్రాంతిని ఇచ్చినట్లూ అవుతుంది. మనం నేర్చుకున్న విషయాలు మెదడులో ఇంకిపోయేందుకు తగిన సమయమూ లభిస్తుంది! ఓసారి పాటించి చూస్తే పోలా!

 

 

- నిర్జర.