రాహుల్ ఇచ్చిన స్వీట్లు స్టాలిన్ తినలేరు!

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అప్పుడప్పుడు తాను వీవీఐపీ అనే విషయాన్ని మరచిపోయి సాధారణ పౌరుడిలా ప్రవర్తిస్తూ వుంటారు. ప్రస్తుతం రాహుల్ తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో వున్నారు. శుక్రవారం (ఏప్రిల్ 13)  ముఖ్యమంత్రి స్టాలిన్‌తో కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఓ స్వీట్ షాప్‌కి వెళ్ళారు. రాహుల్‌ని చూసి స్వీట్ షాప్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. ‘ఏం ఇవ్వమంటారు సార్’ అని సిబ్బంది అడిగితే, ‘మా బ్రదర్ స్టాలిన్ కోసం మైసూర్ పాక్ కొనాలి’ అని రాహుల్ గాంధీ చెప్పారు. 

మైసూర్ పాక్ ప్యాక్ చేసేలోపు రాహుల్ గాంధీ షాపులోని స్వీట్స్.ని రుచి చూశారు. ఆ తర్వాత మైసూర్ పాక్ ప్యాక్ తీసుకుని, స్టాలిన్ ఇంటికి వెళ్ళి అందించారు. స్వీట్ అందుకున్న అనంతరం సీఎం స్టాలిన్ సంతోషంగా స్పందించారు. ‘నా సోదరుడు రాహుల్ గాంధీ ఇచ్చిన తియ్యటి కానుకతో నా హృదయం నిండిపోయింది.

జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే రోజున కూడా ఇండియా కూటమి తప్పకుండా ఇలాంటి తియ్యని విజయాన్నే అందుకుంటుంది’ అన్నారు. ఏది ఏమైనప్పటికీ రాహుల్ గాంధీ ప్రేమగా తీసుకెళ్ళిన స్వీట్‌ని స్టాలిన్ తినే అవకాశం లేదు. ఎందుకంటే, ఆ స్వీట్‌ పేరులో కర్నాటకకి సంబంధించిన ‘మైసూర్’ ఉందని కాదు... ఆల్రెడీ స్టాలిన్ బాడీలో కూడా  సుగర్ ఫ్యాక్టరీ వుంది కాబట్టి.