ఐఫోన్ కోసం పసివాడిని చంపేశాడు

 

ఐఫోన్ కోసం ఓ దుర్మార్గుడు ఆరేళ్ళ చిన్నారిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని రజత్ నగర్‌కి చెందిన పళ్ళ వ్యాపారి కుమారుడు గణేష్ (6) ఆడుకోవడం కోసం ఇంట్లోంచి బయటకి వెళ్ళి తిరిగి రాలేదు. సాయంత్రానికి గణేష్‌ని కిడ్నాప్ చేశామని, గణేష్‌ని విడిచిపెట్టాలంటే లక్షన్నర ఇవ్వాలని ఒక వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. గణేష్ తండ్రి ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు. అయితే అదేరోజు సాయంత్రం ఆ ప్రాంతంలోని ఒక పార్క్‌లో గణేష్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. పోలీసులు జరిపిన దర్యాప్తులో గణేష్ అదే పార్క్‌లో అదే ప్రాంతానికి చెందిన ఒక యువకుడితో తమకు కనిపించాడని స్థానికులు చెప్పారు. పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ యువకుడు గణేష్‌ని హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. తనకు ఎప్పటి నుంచో ఐఫోన్ కొనుక్కోవాలని వుండేదని, ఆ కోరిక తీర్చుకోవడం కోసమే గణేష్‌ని కిడ్నాప్ చేశానని, లక్షన్నర కావాలని గణేస్ తండ్రికి కూడా ఫోన్ చేశానని, అయితే ఆ తర్వాత తన వ్యవహారం బయటపడిపోతుందన్న భయంతో గణేష్‌ని చంపేశానని వెల్లడించాడు.