ధర్మాన దర్శనం లేక డైలమాలో సిక్కోలు వైసీపీయులు!

సుదీర్ఘమైన రాజకీయ అనుభవం,  ప్రసంగాలతో ప్రత్యర్ధులను కట్టిపడేసే పదునైన స్వరం,  రాష్ట్ర రాజకీయాలను సైతం శాశించిన ఆ ప్రస్థానం  ప్రస్తుతం సుషుప్తావస్థలో ఉంది. ఈ ఉప్పోద్గాతం అంతా.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ వైసిపి నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గురించి.  శ్రీకాకుళం జిల్లా వైసిపి నేతలకు పెద్ద దిక్కుగా, రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల నేతగా ఉన్న ధర్మాన ప్రసాదరావు దర్శనం లేక ప్రస్తుతం డైలమాలో ఉన్నారు సిక్కోలు నేతలు.  దిశా నిర్దేశం చెయ్యాల్సిన నేత.. కనిపించకుండా, వినిపించకుండా, వినిపించుకోకుండా  పోవడం ఇప్పుడు వారిలో అంటే సిక్కోలు నేతల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది. 

రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించే ప్రాంతంగా పేరు పొందిన శ్రీకాకుళం జిల్లా పేరు చెప్పగానే గుర్తొచ్చే రాజకీయ కుటుంబాలు రెండు.  ప్రస్తుత రాజకీయాల్లో మొదట వరుసలో ఉండేది కింజరాపు కుటుంబమైతే,  ఆ తరువాతి స్థానం ధర్మాన కుటుంబానిదే. వీటిలో కింజారపు కుటుంబం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండగా.. ధర్మాన కుటుంబం తొలుత కాంగ్రెస్.. ఆ తర్వాత వైసీపీలో కొనసాగుతూ వస్తున్నది. ఈ రెండింటిలో  కింజరాపు కుటుంబం..  గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ.. విజయాలు, మెజారిటీలలో తమ రికార్డును తామే తిరగరాస్తూ వస్తోంది.

 ఇప్పుడు వచ్చిన తిప్పలు సిక్కోలు వైసిపి నేతలకే.  శ్రీకాకుళం రాజకీయాల్లో సీనియర్ నాయకుల్లో ధర్మాన ప్రసాదరావు ఒకరు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఆయన మూడు దశాబ్ధాలకు పైగా రాజకీయాల్లో ఉన్నారు. రెండు సార్లు నరసన్నపేట నుంచి, మూడు సార్లు శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి పోటీచేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం అభ్యర్థి గొండు శంకర్ చేతిలో ఓడిపోయారు. ధర్మానతో పోలిస్తే గొండు శంకర్ రాజకీయాల్లో  చాలా చాలా జూనియర్. అంతటి జూనియర్ చేతిలో పరాజయాన్ని ధర్మాన ప్రసాదరావు జీర్ణించుకోలేకపోతున్నారు.  దీంతో ఇక రాజకీయాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓటమి పాలైన నాటి నుండి ధర్మాన కనిపించజకపోవడం.. అయన దర్శనం కూడా ఎవ్వరికీ లభించకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

వాస్తవానికి 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని  ధర్మాన ప్రసాదరావు గతంలోనే ప్రకటించారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని,   ఎన్నికల్లో తన కుమారుడికి శ్రీకాకుళం టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే వైసీపీ అధినేత జగన్ ససేమిరా అనడంతో అయిష్టంగా, అనివార్యంగా ధర్మాన ప్రసాదరావు పోటీచేయాల్సి వచ్చింది.  పోటీలో ధర్మాన ఘోరంగా ఓడిపోయారు. అంతే అతరువాత  తరువాత సుషుప్తావస్థలోకి చేరిపోయారు. చకచకా జరిగిన ఈ పరిణామాల ఈ నేపధ్యంలో  ఆయన ఇక రాజకీయాలకు గుడ్‌బై చెప్పేసి తన రాజకీయ వారసత్వాన్ని కుమారుడు రామ్ మనోహర్ నాయుడుకి అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తండ్రితో పాటు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నప్పటికీ.. పార్టీలో ఏ మాత్రం క్రీయాశీలంగా లేరు. ప్రస్తుతం తన స్థానాన్ని కుమారుడితో భర్తీ చేసే ప్లాన్‌లో ధర్మాన ప్రసాదరావు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే క్యాడర్ మాత్రం నడిపించే నాయకుడు లేక తికమకపడుతోంది. ధర్మాన దర్శనం క్యాడర్ కు లభిస్తుందా.. లేదా బయట ప్రచారంలో ఉన్న నూతన నాయకత్వంలో శ్రీకాకుళం వైసిపి ముందుకు వెళ్తుందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.