మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య ఘటన.. వారికి తాయత్తులు కట్టింది నేనే!!

మదనపల్లె జంట హత్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. మూఢనమ్మకాల మాయలో పడి కన్నవారే తమ ఇద్దరు కూతుళ్ళ మరణానికి కారణమయ్యారు. ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్యల గురించే చర్చించుకుంటున్నారు. విద్యావంతులైన మూర్ఖులు చేసిన పని ఇదంటూ ఆ తల్లిదండ్రుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా.. మరోవైపు కోట్ల ఆస్తి కోసం ఎవరో ఆ కుటుంబాన్ని హిప్నటైజ్ చేసుంటారని కొందరు అనుమానిస్తున్నారు. ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. 

 

అయితే తాజాగా అసలు ఆ ఇంట్లో హత్యలకు ముందు ఏం జరిగిందన్న విషయాన్ని ఓ మంత్రగాడు మీడియాకు తెలిపారు. ప్రతిరోజూ ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి గుడికి వెళ్లే అలవాటున్న ఆయన వద్దకు.. పురుషోత్తమ నాయుడు స్నేహితులు వచ్చి.. తెలిసిన వాళ్ళ అమ్మాయికి బాలేదు వచ్చి చూడాలని కోరారు. దీంతో ఆయన పురుషోత్తమ నాయుడు ఇంటికి వెళ్లారు. గేటు దగ్గరకు రాగానే ఇంటి లోపల నుండి బయటకు పెద్దపెద్దగా అమ్మాయి అరుపులు వినిపించాయి. లోపలికెళ్లి చూడగా.. చిన్న కూతురు సాయి దివ్య వింతవింతగా ప్రవర్తిస్తూ కనిపించింది. గట్టిగట్టిగా కేకలు వేస్తూ, అక్కకి ముందు పెడుతూ వింతగా ప్రవర్తించింది. ఇక పెద్దమ్మాయి అలేఖ్య అయితే అసలు స్పృహలో లేదు. ఆమెని లే అమ్మా అంటూ తట్టి లేపితే కాసేపటికి స్పృహలోకి వచ్చింది. అలా కాసేపు వారితో మాట్లాడి, ధైర్యం చెప్పి.. పూజారి బయలుదేరుతుండగా.. అమ్మాయిలు ఎందుకో బాగా భయపడ్డారు, వారికి తాయత్తులు కట్టమని పురుషోత్తమ నాయుడు స్నేహితులు కోరారు. దీంతో ఆయన తన ఇంటికెళ్లి తాయత్తులు సిద్ధం చేసి, అలాగే గుడి దగ్గర నుండి పూజాసామాగ్రి తీసుకొని మళ్ళీ పురుషోత్తమ నాయుడు ఇంటికొచ్చారు. ఇద్దరు యువతులకు తాయత్తులు కట్టి, దేవుడి ముందు కొబ్బరికాయ కొట్టి, పూజ చేసి వచ్చేశారు. మళ్లీ మరుసటి కూడా రావాలని ఆయనను కోరగా.. తాను బిజీగా ఉన్నానని, తర్వాత వస్తానని చెప్పారు. కానీ ఆ తరువాత ఆయనకి పిలుపు రాలేదు. ఇంతలోనే యువతుల హత్య ఘటన వెలుగులోకి వచ్చింది.