ఏపీ రాజకీయాలను మలుపు తిప్పనున్న షర్మిల కుమారుడి వివాహం?!
posted on Dec 31, 2023 9:51AM
జనవరిలో ఏపీ రాకీయాలు కీలక మలుపు తిరగనున్నాయి. మార్చిలో ఏపీలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. దీంతో జనవరిలో ఏపీ రాజకీయాలు ఊహకందని మలుపులు తిరగనున్నాయి. అధికార వైసీపీ సహా విపక్షాలు జనవరిలో అభ్యర్థులను ప్రకటించనున్నాయి. దీంతో భారీ స్థాయిలో వలసలు కూడా ఉండనున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ నుండి పదుల సంఖ్యలో నేతల జంపింగుకు ఆస్కారం ఉంది. అసంతృప్త ఎమ్మెల్యేలు విపక్ష పార్టీల వైపు చూస్తుండగా.. ఇప్పుడు వీరికి కాంగ్రెస్ పార్టీ బెస్ట్ అప్షన్ గా కనిపిస్తున్నట్లు సూచనలున్నాయి. ఏపీ కాంగ్రెస్ పార్టీకి షర్మిల అధ్యక్షురాలిగా రాబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో తెలంగాణ ఎన్నికలకు ముందే షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఖరారు కాగా.. తెలంగాణ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ అందుకు కాస్త సమయం ఇచ్చారు. ఇక ఇప్పుడు ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో షర్మిల చేతికి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడం ఖరారైంది.
అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరి మొదటి వారంలోనే షర్మిల అధికారికంగా కాంగ్రెస్ లో చేరనుండగా.. అదే రోజున ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, ఆ తరువాత జనవరి మూడవ వారంలో జరగనున్న షర్మిల కుమారుడి వివాహం ఏపీ రాజకీయాలను మలుపు తిప్పనున్నట్లు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతున్నది. జనవరి 17న షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం జోధ్ పూర్ లోని ఉమైద్ ప్యాలెస్ లో జరగనుండగా.. ఆ తర్వాత హైదరాబాద్ లో భారీ స్థాయిలో రిసెప్షన్ వేడుక నిర్వహించనున్నారు. ఇక పెళ్లి వేడుకే అయినా ఒక రకంగా ఏపీ రాజకీయాలను మలుపు తిప్పే వేడుకగా భావిస్తున్నారు. ఈ రిసెప్షన్ వేడుకకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు మరికొందరు కాంగ్రెస్ పెద్దలు కూడా హాజరుకానుండగా.. ఇదే వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాలలోని నేతలను ఆహ్వానించనున్నట్లు తెలుస్తుంది. ఒక రకంగా ఈ వేడుక నేతల సమీకరణకు వేదికగా మారనున్నట్లు చెప్తున్నారు.
ముఖ్యంగా గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో సంబంధం ఉన్న నేతలను షర్మిల దగ్గర చేసుకొనేందుకు తన కుమారుడి పెళ్లి రిసెప్షన్ వేడుకను షర్మిల వేదికగా భావిస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు వైసీపీలో ఉన్న ఒకప్పటి కాంగ్రెస్ నేతలతో విజయమ్మ సంప్రదింపులకు ఈ రిస్పెప్షన్ బీజం వేయనున్నట్లు కనిపిస్తుంది. అదే విధంగా సోదరుడు సీఎం జగన్ మోహన్ రెడ్డితో షర్మిల విబేధాలు, తల్లి విజయమ్మ షర్మిల పక్షాన అండగా నిలబడం, వైఎస్ వివేకా హత్య అనంతరం దూరమైన మరో సోదరి డాక్టర్ సునీత న్యాయపోరాటం, ఇప్పుడు వైఎస్ కుటుంబంలో అగాధాలు ఈ పెళ్లితో మరోసారి చర్చకు రానుండగా.. అసలు జగన్ కు ఈ వేడుకకు ఆహ్వానం అందుతుందా? అందినా జగన్ ఈ వేడుకకు వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ పెళ్లి ఏపీలో వైఎస్ అభిమానులకు ఎలాంటి సంకేతం ఇవ్వనుందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఏది ఏమైనా షర్మిల కుమారుడి రిసెప్షన్ ఏపీ రాజకీయాలను మలుపు తిప్పడం ఖాయంగా కనిపిస్తున్నది.
షర్మిల ఏపీ రాజకీయాలకు వస్తారా? కాంగ్రెస్ పార్టీలో చేరతారా అనే దాగుడు మూతలు ఇకలేవు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక ఖరారైంది. ఆమె ఏపీ రాజకీయాలలో క్రియాశీలంగా పని చేయనున్నారని తేలిపోయింది. అన్న జగన్ తో షర్మిల ప్రత్యక్ష యుద్దానికి సిద్ధమేనని నిర్దారణ అయిపోయింది. అందులో భాగంగానే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు క్రిస్మస్ బహుమతులు పంపించారు. అది కూడా వైఎస్ కుటుంబం తరపున ఈ బహుమతులు పంపుతున్నట్లు షర్మిల శుభాకాంక్షలు తెలిపి.. వైఎస్ రాజకీయ వారసత్వంలో తనకు కూడా వాటా ఉన్నట్లు ఆమె పరోక్షంగా చెప్పేశారు. ఇప్పుడు ఆ వారసత్వాన్ని దక్కించుకునేందుకు అదే కుటుంబ వేడుకను వేదికగా మలచుకోనున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇది వైసీపీకి, జగన్ మోహన్ రెడ్డికి మింగుడుపడని వ్యవహారం అనడంలో ఎలాంటి అనుమానాలు లేవు. షర్మిల కుమారుడి వివాహ రిసెప్షన్ ఏపీ రాజకీయాలలో పెను మార్పులకు వేదిక అవ్వడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.