లోకేష్ డిక్లరేషన్ కు సీమ ఫిదా!
posted on Jun 8, 2023 12:22PM
విశ్వాసం పట్టుదల కలగలిసి సాగుతున్న నారాలోకేష్ యువగళం పాదయాత్ర రాయలసీమ నాలుగు జిల్లాలనూ చుట్టేసింది. మరో మూడు నాలుగు రోజులలో సీమలో లోకేష్ పాదయాత్ర పూర్తి అవుతుంది. అధికార వైసీపీకి పెట్టని కోటగా చెప్పుకునే సీమలో జనం లోకేష్ కు బ్రహ్మరథం పట్టడం చూస్తుంటే.. సీమలో రాజకీయం మారుతోందన్నది స్పష్టంగా గోచరిస్తోందని పరిశీలకులు అంటున్నారు.
తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేష్ విశ్వాసం ఊపిరిగా పట్టుదల శ్వాసగా సాగిస్తున్న యువగళం పాదయాత్ర బుధవారం ( జూన్ 7) 119 రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఆయన సీమ జిల్లాల్లో 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1516 కి.మీ. పాదయాత్ర చేశారు. ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి మొదలైన యువగళం పాదయాత్ర, అప్రతిహాతంగా, అశేష జనాదరణతో సాగుతోందనడంలో సందేహం లేదు. యాత్రను అడ్డుకోవడానికి జగన్ సర్కార్ జీవో 1 సహా అనేకానేక అడ్డంకులు సృష్టించింది. ప్రచార రథాలను సీజ్ చేసింది. మాట్లేడేందుకు మైకు లేకుండా లాగేసుకుంది. నిలుచున్న స్టూల్ ను సైతం లాగేసింది. దాడులయత్నాలు జరిగాయి. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా వైసీపీ శ్రేణులు వ్యవహరించాయి. ఇక పోలీసుల ఓవరేక్షన్ గురించి చెప్పనే అవసరం లేదు. అయితే ఎక్కడా లోకేష్ ఆగలేదు.. వెనకడుగు వేయలేదు.
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న అరాచక, దుర్మార్గ పాలన, ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు ముఖ్యంగా యువతకు వివరిస్తూ, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, తమ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందో.. గత తెలుగుదేశం ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పోలిస్తే జగన్ చెబుతున్న సంక్షేమంలోని డొల్ల తనాన్ని వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. అలా జనం బలంతో, జనం ఆదరణతో సాగుతున్న లోకేష్ పాదయాత్ర సీమ జిల్లాలను చుట్టేసింది. కడపలో అయితే జగన్ పునాదులు కదిలిపోతున్నాయా అన్నట్లుగా జనం లోకేష్ కు స్వాగతం పలికేందుకు, ఆయన ప్రసంగాలు వినేందుకు పోటెత్తారు. పాదయాత్రలో లోకేష్ తొలి అడుగు పడక ముందే చిత్తూరు జిల్లాలో ప్రచార రథం. మైకు, సౌండ్ సిస్టం ఇతర ప్రసార సాధనాలు, ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నారు. కుప్పం నుంచి తంబళ్ళపల్లి మధ్యలో సగటున ప్రతి 20 కిలోమీటర్లకు ఒక కేసు పెట్టారు. అయినా లోకేష్ ముందడుగేశారు. వేస్తూనే ఉన్నారు.
అంతే కాదు, పాద యాత్రతో పాటుగా లోకేష్ ఎక్కడి కక్కడ వివిద వర్గాల ప్రజలతో ప్రత్యేకంగా సమావేశ మవుతున్నారు. సమస్యలు అడిగి తెలుసు కుంటున్నారు. వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. తెలుగు దేశం అధికారంలోకి వస్తే, ప్రజలు తమ ముందుంచిన సమస్యలను ఎలా పరిష్కరిస్తామో వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. అలాగే, ప్రతి నియోజక వర్గంలో బహిరంగ సభలు నిర్వహించి ఆ నియోజక వర్గం వైసీపీ ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా సహా ప్రజల ముందుంచుతున్నారు. చర్చకు సిద్దమని సవాలు విసురుతున్నారు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో మూతపడిన సంస్థలు, అన్న కాంటీన్ల ముందు సెల్ఫీలు దిగుతూ ...జగన్ రెడ్డి సర్కార్ కు సెల్ఫి సవాళ్ళు విసురుతున్నారు. దీంతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. అందుకే యాత్ర ప్రారంభంలో అవహేళన చేసిన వైసేపీ నాయకులు, ఎమ్మెల్యేలు జాగ్రత్త పడుతున్నారు.జన ప్రభంజనమై సాగుతున్న యువగళం గర్జనలకు భీతిల్లి పోతున్నారు. అన్నిటికీ మించి కడప నడిబొడ్డున కడప రాజరాజేశ్వరి కళ్యాణ మండపం వద్ద మిషన్ రాయలసీమపై నిర్వహించిన సదస్సు నిజంగా చాలా చాలా ప్రత్యేకం అని చెప్పాలి.
ఈ సదస్సుకు రాయలసీమ నలుమూలల నుంచి మేధావులు, రాజకీయ నాయకులు, ప్రజలు తరలివచ్చారు. అందరి సమక్షంలో రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించిన లోకేష్ మేధావుల మన్నన పొందారు. సీమ ప్రగతి కోసం లోకేష్ ప్రకటించిన డిక్లరేషన్ చిత్తశుద్ధితో అమలు చేస్తే సీమ అభివృద్ధి ఖాయమని, వెనకబాటు తనం మటుమాయమౌతుందని వారు అంటున్నారు. అమలు విషయంలో సందేహాలు అనవసరమనీ, తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఐదేళ్లలో సీమ రూపురేఖలు మార్చేస్తామని చెప్పిన లోకేష్.. ఇందు కోసం అవసరమైతే తెలుగుదేశం ప్రభుత్వంతో పోరాడేందుకైనా తను సిద్ధమని ప్రకటించారు.
కర్నూలు జిల్లాలో వ్యవసాయ పరికరాల తయారీ హబ్, బెంగళూరు – హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో కేంద్ర బిందువుగా కర్నూలును మార్చి పరిశ్రమల్ని ఆకర్షించడం అలాగే వ్యవసాయ పరిశోధనలకు కేంద్ర బిందువుగా కర్నూలును మార్చడం, జాతీయ, అంతర్జాకీయ క్రీడాకారులను తీర్చి దిద్దే స్పోర్ట్స్ యూనివర్శిటీ హబ్‌గా కడప , ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా చిత్తూరు, అనంతపురం నుంచి ఆటోమోబైల్ తయారీ రంగం హబ్ వంటివి లోకేష్ ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ లో ఉన్నాయి. అలాగే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి, ప్రతి ఎకరానికి సాగునీరు, వాటర్ గ్రిడ్ ద్వారా 24/7 ఇంటింటికీ సురక్షితమైన మంచినీరు, ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్ పరిశ్రమల ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, శ్రీశైలం కేంద్రంగా రాయలసీమను పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేయడం వంటివి కూడా లోకేష్ డిక్లరేషన్ లో ఉన్నాయి.