సికింద్రాబాద్ అస్తిత్వాన్ని ప్రభుత్వం దెబ్బ తీస్తోంది: కేటీఆర్

 

సికింద్రాబాద్ మున్సిపల్ సాధన కోసం బీఆర్‌ఎస్  చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు ర్యాలీని అడ్డుకొని పలువురిని అరెస్ట్ చేశారు. అటు నల్ల జెండాలు, కండువాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డులో గాంధీ విగ్రహం వరకు లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని అడ్డుకొని ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తునన్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోసం ర్యాలీ చేస్తామని తాము ఎప్పుడో దరఖాస్తు చేశామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 

నిన్న ఓకే చెప్పి రాత్రే అనుమతి లేదని పోలీసులు చెప్పారు. శాంతియుత ర్యాలీ చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని తలసాని ప్రశ్నించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోతే కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుని ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వాళ్లేమో ఇస్టానుసారంగా ర్యాలీలు చేసుకుంటున్నారని.. ప్రతిపక్షాలను మాత్రం అడ్డుకుంటున్నారని విమర్శించారు. ర్యాలీకి నిన్న ఓకే చెప్పి.. రాత్రికి రాత్రే అనుమతి లేదన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి పేర్లు మార్చడం తప్ప చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 

టీఎస్‌ను టీజీగా మార్చారని తెలిపారు. దానివల్ల ఎవరికి లాభం జరిగిందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సికింద్రాబాద్ ఐడెంటిటీని తొలగించాలని చూస్తున్నాడని మండిపడ్డారు. అందుకే అన్ని వర్గాల ప్రజలు ఒక్కటై ర్యాలీకి సిద్ధమయ్యారని తెలిపారు. పార్టీలకు అతీతంగా శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చారని అన్నారు. శాంతి ర్యాలీకి బీఆర్ఎస్ పార్టీని కూడా ఆహ్వానించారని తెలిపారు. బీఆర్‌ఎస్ నాయకులు సంఘీభావం తెలుపుదామని సిద్ధమయ్యామని పేర్కొన్నారు. కానీ వేలాది మందిని ఎక్కడికక్కడ అరెస్టులు చేశారని తెలిపారు. తమను కూడా తెలంగాణ భవన్‌లో నిర్బంధించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu