బీజేపీ, బీఆర్ఎస్ రహస్య ఒప్పందం.. రేవంత్ ఆరోపణలను నిజమేనా?

బీజేపీతో రహస్య బందంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ లు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ ఈ విమర్శల పర్వం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తరువాత ఈ ఆరోపణల పర్వం మరింత జోరందుకుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్, బీజేపీల రహస్య బంధం గురించిన ఆరోపణలు చేయడమే కాదు.. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే లోక్ సభ ఎన్నికల అనంతరం బీజేపీ గూటికి చేరిపోతారనీ, తనతో పాటుగా తన వర్గానికి చెందిన ముప్ఫై మందిని తీసుకుని మరీ కమలం గూటికి చేరుతారని ఆరోపిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయితే ఒక అడుగు ముందుకు వేసి వంద మంది పైగా ఎమ్మెల్యేలు ఉన్న సమయంలోనే బీజేపీ బీఆర్ఎస్ ను నానా ఇబ్బందులూ పెట్టిందనీ, ఇప్పుడు జస్ట్ 64 మంది ఎమ్మెల్యేలతో ఉన్న రేవంత్ సర్కార్ ను బీజేపీ బతకనీయదనీ అంటున్నారు. 

అయితే బీఆర్ఎస్ ఆరోపణలకు ముఖ్యమంత్రి రేవంత్ ఇచ్చిన కౌంటర్ బీఆర్ఎస్ నే కాదు.. బీజేపీని ముఖ్యంగా ఆ పార్టీ కీలక నేత అమిత్ షానే ఇరుకున పెట్టి డిఫెన్స్ లో పడేలా చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మద్యం కేసు నుంచి బయట పడేసేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  బీజేపీతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారనీ, బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉన్న స్థానాలలో బీఆర్ఎస్ బలహీనమైన అభ్యర్థులను రంగంలోకి దింపిందనీ ఆరోపించారు. అక్కడితో ఆగకుండా రెండు పార్టీల మధ్యా రహస్య ఒప్పందం లేకపోతే కేసీఆర్ కానీ, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు భువనగిరి, చేవెళ్లు, జహీరాబాద్, మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గాలలో ఎందుకు ప్రచారం చేయలేదని సూటిగా ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికలలో బీజేపీకి బీఆర్ఎస్ సహకారం అందిస్తోందనడానికి  ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని నిలదీస్తున్నారు. 

  రేవంత్ ఆరోపణలు విమర్శలకు ఆశ్చర్యకరంగా అటు బీఆర్ఎస్ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి కానీ గట్టిగా ఖండనలు రాలేదు.  రెండు పార్టీలూ కూడా అతి జాగ్రత్తకు పోయి రేవంత్ విమర్శలపై నోరెత్తకుండా ఉండటమే మేలని భావిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   దేశవ్యాప్తంగా 370 సీట్లు సాధించాలన్న లక్ష్యంతో  ఉన్న బీజేపీ   తెలంగాణలో అధమ పక్షం పది స్థానాలలో విజయం సాధించాలన్న లక్ష్యంతో వ్యూహాలు రచిస్తోంది.

ఈ సమయంలో రేవంత్ చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీల మధ్య రహస్య ఒప్పందం విమర్శలు ఆ పార్టీని ఒకింత చిక్కుల్లో పడేసినట్లే కనిపిస్తోందంటున్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్‌, మెదక్‌, మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజ కవర్గాలలో బీఆర్ఎస్ బలహీనతలు బీజేపీకే కలిసివస్తాయన్న అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రేవంత్ విమర్శలపై స్పందించి పరిస్థితిని కంగాళీ చేసుకోవడం కంటే మౌనమే మేలన్న వ్యూహంతో బీజేపీ ఉందని అంటున్నారు.