కాయ్ రాజా కాయ్.. నిమ్మకాయ్.. మిరపకాయ్..

అయితే నువ్వు గెలవాలి.. లేకుంటే నేను గెలవాలి.. అంతే కానీ మరొకరు గెలువ కూడదనే ఓ స్పష్టమైన నిబంధన విధించుకొని.. బీఆర్ఎస్, బీజేపీలు  ఈ ఎన్నికల వేళ తెలంగాణలో కలిసి పని చేస్తున్నాయన్న ప్రచారం పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. అందుకు రాష్ట్రంలో చోటు చేసుకొన్న తాజా పరిణామాలనే ఉదాహరణగా చూపుతున్నాయి.

అక్టోబర్ 7వ తేదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లోని ఎల్ బీ స్టేడియంలో ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే ఈ సందర్బంగా కేసీఆర్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు చేశారు. అయితే ఆ విమర్శలు చాలా జాగ్రత్తగా బీఆర్ఎస్ కు నొప్పి కలగకుండా ఉండేలా ఆచి తూచి చేశారన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, కేసీఆర్ కుటుంబ పాలన, కుటుంబ అవినీతి అన్నారే తప్ప మేడిగడ్డ రిజర్వాయర్‌లో పిల్లర్లు కుంగడంపై ప్రధాని మోదీ ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు, అలాగే కేసీఆర్ పాలనపై  కూడా మోడీ తీవ్ర విమర్శలు చేయలేదని అంటున్నారు.  అదే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. నిజామాబాద్ వేదికగా జరిగిన సభలో ఇదే సీఎం కేసీఆర్‌పై ఇదే ప్రధాని మోదీ సెటైర్ల వర్షం కురిపించారని.. ఇంకా వివరంగా చెప్పాలంటే.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాలనలో ఆయన ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయలేదని..  మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి గోదావరి జలాలు అందిస్తానన్నారని.. అదీ పూర్తి కాలేదని..  అలాగే పాలన పక్కన పెట్టి... యజ్జాలు, యాగాలు చేస్తున్నారని.. కేసీఆర్‌కి నిమ్మకాయలు, మిరపకాయలే ముఖ్యమంటూ మోదీ సైటెర్లు సంధించారు.  

అటువంటిది ఇప్పుడు మాత్రం సీఎం కేసీఆర్ తన ఫ్యామిలీతో కలిసి ఏపీ సీఎం, ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్థాన స్వామిజీ స్వామి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో రాజ శ్యామలా యాగం చేసినా ఆ విషయాన్ని మోడీ    ప్రస్తావించనే లేదని అంటున్నారు.

అలాగే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్నారని.. రేపో మాపో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అవుతారనే ఓ ప్రచారం జరుగుతోందని... కానీ ఈ కేసులో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న తెలంగాణ సీఎం,  బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్  కుమార్తె  కల్వకుంట్ల కవిత మాత్రం నేటికి అరెస్ట్ కాలేదని గుర్తు చేస్తున్నారు. అయితే ఇదే కేసులో కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుతోపాటు ఈ మద్యం కుంభకోణంలో అన్ని తానై వ్యవహరించిన శరత్ చంద్రారెడ్డి తీహర్ జైలుకు వెళ్లి... బెయిల్‌పై విడుదలయ్యారని.. మరి ఈ కేసులో కవిత ఇప్పటి వరకు అరెస్ట్ కాకపోవడం వెనుక బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీల మధ్య కుదిరిన కెమిస్ట్రీయే కారణమా అని ప్రశ్నలు సంధిస్తున్నారు.  ఈ రెండు పార్టీల మధ్య వ్యవహారం పైన కుస్తీ లోన దోస్తీ అన్న చందంగా ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  తృతీయ ఫ్రెంట్ అంటూ టీఆర్ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన కేసీఆర్... దేశవ్యాప్తంగా కారు స్టీరింగ్ తిప్పకుండా.. బీజేపీ కోసం.. బీఆర్ఎస్ అనబడే తన జాతీయ పార్టీని  కేవలం తెలంగాణకే పరిమితం చేశారని చెబుతున్నారు.  

మరోవైపు తెలంగాణలో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ  బలంగా పుంజుకుని బీఆర్ఎస్ కు ఊహించని రీతిలో గట్టిపోటీని ఇస్తోంది. ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ హల్‌చల్ చేసి... అధికార పీఠాన్ని హస్తగతం చేసుకొంటుందంటూ సర్వేలు సైతం వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్ జోరు చూస్తుంటే ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందనీ, ఈ విజయం వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై   ప్రభావం చూపేలా ఉందనీ,  ఇప్పటికే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో  గెలుపుతో.. తెలంగాణ కాంగ్రెస్  శ్రేణుల్లో  కొత్త ఉత్సాహం ఉరకలేస్తోందని, ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారం చేపడితే.. హస్తినలో తన పీఠానికే ఎసరు వస్తుందన్న భావనతో  ప్రధాని మోదీ సైతం తెలంగాణలో  కాంగ్రెస్ ఓటమి కోసం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా  వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారన్న  ప్రచారం   పోలిటికల్ సర్కిల్స్ లో  జోరుగా సాగుతోంది.

ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ గెలవకూడదనే ఓ స్పష్టమైన ప్రణాళికలో భాగంగానే.. ఆ పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలు, ఫార్మ్ హౌసులపై వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయని.. ఎన్నికల ప్రచారం ముగిసే లోపు.. మరింత మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నివాసాలపై కూడా దాడులు జరిగే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.  అయితే బీఆర్ఎస్‌తో బీజేపీ బంధం బలపడిందని... అదే లేకుంటే.. కారు పార్టీ అభ్యర్థుల నివాసాలపై ఎందుకు ఐటీ దాడులు జరగడంలేదన్న భావన తెలంగాణ సమాజంలో వ్యక్తమౌతోంది. 

ఓ వేళ తెలంగాణలో   కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. కర్ణాటకతో మార్పు మొదలైందని.. అది తెలంగాణలో  స్పష్టమైందని.. ఇక లోక్‌సభ ఎన్నికల్లో సైతం ఇదే ఫలితాలు పునరావృతమవుతాయంటూ.. ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు.. ప్రజల్లోకి దూసుకు వెళ్లి.. వాళ్లకు అనుకూలంగా ప్రచార చేస్తారని.. ఆ క్రమంలో ఫలితాలు వాళ్లకు అనుకూలంగా వస్తే.. ఆ తర్వాత  బీజేపీ అధికార పీఠానికి దూరం కాక తప్పదని... అందుకే ప్రధాని మోదీ, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఓ స్పష్టమైన అవగాహనకు వచ్చారని.. దీంతో తెలంగాణలో కేసీఆర్ వస్తే.. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో మోదీ గెలిస్తే.. తెలంగాణ సీఎం పదవిని తనకు కుమారుడు కేటీఆర్‌కి కట్టబెట్టి.. ఉప ప్రదాని పోస్ట్‌లో కేసీఆర్ కూర్చోవచ్చుననే ఓ ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు ఓ చర్చ సైతం నడుస్తోంది. 

అదీకాక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఉన్నప్పుడు... తెలంగాణ సీఎం కేసీఆర్‌ను.. బిడ్డా కేసీఆర్ అంటూ నిప్పులు చెరిగే వారని.. కానీ తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా జి.కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య విమర్శల పదును దాదాపుగా తగ్గిపోయిందనే విషయం అవగతం అవుతుందని... ఏదీ ఏమైనా.. తెలంగాణలో హస్తం పార్టీ గెలుపును అడ్డుకోవడం కోసం.. బీఆర్ఎస్, బీజేపీలు తమదైన పంధాలో అడుగులు వేస్తున్నాయనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లోనే కాకుండా.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో సైతం రచ్చ రచ్చ అవుతోంది. ఇక మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై నోరెత్తవద్దంటూ.. పార్టీ శ్రేణులకు ఇప్పటికే సీఎం కేసీఆర్ హుకూం జారీ చేశారని... అందుకే మోదీ సైతం ఈ అంశంపై స్పందించలేదనే ఓ ప్రచారం సైతం పోలిటికల్ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu