సీనియర్లకు శుభ సంకేతాలు!

తెలంగాణ కాంగ్రెస్లో సీన్ రివర్స్ అవుతోందా?

ఒకప్పుడు, సీనియర్లను పక్కన పెట్టి, జూనియర్ నాయకులకు, మరీ ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన, చిట్టి పొట్టి నాయకులకు ఎత్తు పీట వేసి పెద్ద చేసిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పడు, సీనియర్ల వైపు చూస్తోందా? అంటే, కాంగ్రెస్ వర్గాల నుచి అవుననే సమాధానమే వస్తోంది.  నిజానికి, సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది. అంతే  కాదు, యంగ్ లీడర్స్ టాలెంట్ గుర్తించక పోవడం, పదవులు పక్కదారి పట్టి సీనియర్ నాయకులకు చేరడంతో   యువ నాయకులు అనేక మంది వేరే దారులు వెతుకున్నారు. ఉదాహరణకు,   రాజస్థాన్, మధ్య ప్రదేశ్ విషయాన్నే తీసుకుంటే, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రాజస్థాన్ లో కాంగ్రెస్ అధిష్టానం యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సచిన్ పైలెట్ ను కాదని, వృద్ద నేత అశోక్ గెహ్లాట్ ను ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కించింది. మధ్య ప్రదేశ్ లోనూ అంతే, జ్యోతిరాదిత్య సింధియా ను కాదని కమల్ నాథ్ ను  సిఎంను చేసింది.  నిజానికి, పైలెట్, సింధియా ఇద్దరు కూడా రాహుల్ గాంధీకి సన్నిహితులు. రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన నాయకులు. సచిన్ పైలెట్ తండ్రి రాజేష్ పైలెట్  కాంగ్రెస్  పార్టీలో, ప్రభుత్వాలలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు. రాజీవ్ గాంధీ, పీవీ నరసింహ రావు మంత్రివర్గంలో పనిచేసారు.

జ్యోతిరాదిత్య సిందియా తండ్రి మాధవ  రావు   సిందియా విషయం అయితే చెప్పనే అక్కర లేదు. నాలుగైదు సార్లు ఎంపీగా గెలవడమే కాదు,   గ్వాలియర్ నుంచి పోటీ చేసిన అటల్ బిహారీ వాజ్ పేయిని ఓడించారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు.  పైలెట్, సింధియా ఇద్దరూ కూడా. వారసులుగా రాజకీయ ఎంట్రీ ఇచ్చినా, నాయకులుగా నిరుపించుకున్నారు. ఎంపీలుగా గెలిచారు, ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. మన్మోహన్ సింగ్   మంత్రి వర్గంలో మంత్రులుగా పనిచేసి, పరిపాలనా అనుభవం సంపాదించుకున్నారు. రెండు రాష్ట్రల్లోనూ 2018 ఎన్నికలలో  కాంగ్రెస్
గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆ ఇద్దరే కాంగ్రెస్ పార్టీని గెలిపించారు.  అయినా, కాంగ్రెస్ అధిష్టానం యువ నాయకులను కాదని, వృద్ధులకు పదవులు కట్టబెట్టింది. నిజానికి  ఆ ఇద్దరనే కాదు, కాంగ్రెస్ కుటుంబాల నుంచి వచ్చిన అనేక మంది యూత్ లీడర్స్ కు పార్టీలో  గుర్తింపు దక్కలేదు. అందుకే జితిన్  ప్రసాద, ఆర్పీ సింగ్ మొదలు నిన్న మొన్న కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన,  కేంద్ర మాజీ మంత్రి ఏకే అంటోనీ కుమారుడు అనిల్ అంటోనీ వరకు ఎంతో మంది యువ నేతలు ముఖ్యంగా రెండు మూడు తరాలుగా, కాంగ్రెస్ కుటుంబాలుగా ముద్ర వేసుకున్న  నేతల కుమారులు, కాంగ్రెస్ అధిష్టానం తమకు గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదని
బయటకు వెళ్లి పోయారు.

ఈ మధ్యనే  జీవితాంతం కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి సేవలు అందించిన, అహ్మద్ పటేల్ కుమారుడు, ఫైసల్  పటేల్   కాంగ్రెస్ పార్టీ తీరుతో విసిగిపోయి, ఇక చాలని తప్పుకున్నారు. అయినా  యంగ్ టాలెంట్ బయటకు వెళ్లి పోతున్నా చాలా వరకు రాష్ట్రాల్లో ఇప్పటికీ  సీనియర్ నాయకులకే కుర్చీలు వేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం, ఎదుకనో ఒక్క తెలంగాణ విషయంలో మాత్రం, ఆనవాయితీకి భిన్నంగా, రెండుమూడు పార్టీలు మారి, కాంగ్రెస్ గూటికి చేరిన రేవంత్ రెడ్డిని మాత్రం చేయి పట్టుకుని రాజకీయ వైకుంఠపాళిలో పాముల నోటిన పడకుండా నిచ్చెనలు ఎక్కించుకుంటూ   పైకి తీసుకు పోయింది. 2017లో  తెలుగు దేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన రేవంత్ రెడ్డి   అధిష్టానం అండదండలతో చకచకా  నిచ్చెన మెట్లు ఎక్కారు.   బహుశా కాంగ్రెస్ పార్టీలో ఇంత వేగంగా పదవుల మెట్లు ఎక్కినా నాయకుడు మరొకరు ఉండక పోవచ్చును. 2021 లో సీనియర్ నాయకుల నుంచి తీవ్ర  ప్రతిఘటన  ఎదుర్కుని కూడా ఆదిష్ఠానం   అండదండలతో  టీపీసీసీ  అధ్యక్షుడయ్యారు.

అదే క్రమంలో 2023లో కాంగ్రెస్ అధిష్టానం,సీనియర్ కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ని  ముఖ్యమంత్రిని చేసింది.  అయితే  ఇప్పడు అదే అధిష్టానం కారణాలు ఏమిటో ఖచ్చితంగా తెలియక పోయినా సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్  నియామకం జరిగిన తర్వాత, ఈ  మార్పు   స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.  అలాగే, ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక విషయంలో రేవంత్ రెడ్డిని  పక్కకు నెట్టి, జానా రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ అధిష్టాం సీనియర్ నాయకులకు  త్వరలోనే పూర్వ వైభవం వస్తుందనే సంకేతాలు ఇచ్చినట్లు, అయ్యిందని సీనియర్ నాయకులు సంతోషం వ్యక్త పరుస్తున్నారు. అలాగే మీనాక్షి నటరాజన్ రాకతో, అధిష్ఠానానికి సీనియర్ నాయకులకు మధ్య మాజీ రాష్ట్ర ఇన్ చార్జిలు, కోటరీ నేతలు కట్టిన అడ్డు గోడలు తొలిగి పోయాయి. సీనియర్ నాయకుడు జానా రెడ్డి వారధిగా రావడంతో కాంగ్రెస్ పార్టీలో  సీనియర్ నాయకులకు మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయనే విశ్వాసం వ్యక్తమవుతోంది  అంటున్నారు. అలాగే, ఇటీవల గుజరాత్ లో రాహుల్ గాంధీ, బీజేపీతో భూత, భవిష్యత్, వర్తమానాల్లో పత్యక్ష, పరోక్ష సంబంధాలున్న అందరికీ  ఉద్వాసన తప్పదని చేసిన హెచ్చరిక  నేపధ్యంగా రాష్రంలో చోటు చేసుకుంటున్న  పరిణామాలను సీనియర్ నాయకులు  శుభ సంకేతాలుగా తీసుకుంటున్నారు.