సంక్రాంతి వంటకాలు – ఆరోగ్యానికి సూత్రాలు
posted on Jan 13, 2017 11:34AM
సంక్రాంతి అంటేనే ఆరోగ్యం. రేగుపండ్లని భోగిపండ్లగా మార్చుకున్నా, బంతిపూలతో ఇల్లిల్లూ అలంకరించుకున్నా... ఇంటిముందు గొబ్బెమ్మలని పేర్చినా, ఆ గొబ్బెమ్మలని భోగిమంటలలో వేసినా.. ఏ పని చేసినా దాని వెనక అధ్మాత్మిక అర్థంతో పాటుగా లౌకకమైన పరమార్థం కూడా గోచరిస్తాయి. ఇక సంక్రాంతినాడు చేసుకునే పిండివంటల సంగతైతే చెప్పనే అక్కర్లేదు. అనాదిగా సంక్రాంతి సమయాలలో ఫలానా పదార్థాలను తినాలంటూ పెద్దలు సూచించిన వంటకాలను కనుక గమనిస్తే ఆరోగ్యపరమైన రహస్యాలు ఎన్నో గోచరిస్తాయి.
నువ్వులు
సంక్రాంతినాడు నువ్వులు తినాలని పెద్దలు చెబుతుంటారు. మనవైపు ఎలాగూ నువ్వులతో అరిసెలూ, సకినాలు చేసుకుంటాం కాబట్టి ఫర్వాలేదు. ఇతర రాష్ట్రాలలో అయితే కేవలం నువ్వులతోనే పిండివంటలు చేసుకునే సంప్రదాయం ఉంది. బీహార్లో తిల్‌వా, గుజరాత్‌లో నువ్వుల చిక్కీలు, మహారాష్ట్రలో తిల్‌గుల్, రాజస్థాన్‌లో తిల్గుడ్... ఇలా దేశమంతటా ఏదో ఒక పేరుతో నువ్వులతో చేసిన తీపిపదార్థాన్ని తింటారు. ఇక కర్ణాటకలో అయితే ఏకంగా నువ్వుల ఉండలని ఇచ్చిపుచ్చుకుంటారు.
నువ్వులు నిజంగా గొప్ప బలవర్థకాలు. 100 గ్రాముల నువ్వులు తింటే 500కి పైగా కెలోరీల శక్తి శరీరానికి అందుతుంది. నువ్వుల నుంచి నూనెని తీసేసిన పిండిలో కూడా 50 శాతం వరకూ ప్రొటీన్లు, మాంసకృత్తులు మిగులుతాయి. అందుకనే ఈ పిండిని పారేయకుండా పశువులకి అందిస్తారు. ఇంత శక్తిమంతమైన ఆహారం కనుక నువ్వులు వేడి చేస్తాయి. అందుకని ఉత్తరాయనం నుంచి దక్షిణాయనాకి మళ్లే సంక్రాంతి సందర్భంలో వీటిని తీసుకోమని చెబుతారు. ఆ కాలంలో తీవ్రంగా ఉండే చలిబారి నుంచి ఈ నువ్వులు కాపాడటమే కాకుండా, వాతావరణంలో మొదలవబోతున్న అధిక ఉష్ణోగ్రతలకి అనుగుణంగా శరీరాన్ని సిద్ధం చేస్తాయి.
మినుములు
కనుమనాడు మినుములు తినాలని ఓ సామెత. అందుకే వీటితో గారెలు చేసుకుని తింటుంటారు. నువ్వులలాగానే మినుములు కూడా వేడి చేస్తాయి. అధిక శక్తినీ అందిస్తాయి. మినుములలో కూడా ప్రొటీన్లు, మాంసకృత్తులు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటుగా మినుములలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు అత్యధికంగా కనిపించడం ఓ విశేషం. ఇవి కండరాల బలానికీ, ధాతుపుష్టికీ ఉపయోగపడతాయి. అందుకే స్త్రీలు జరుపుకునే అట్టతద్ది పండుగలో కూడా మినపరొట్లెని తినమని సూచిస్తుంటారు. ఆడవారైనా, మగవారైనా మినుములు తినడం వల్ల సంతానలేమి వంటి సమస్యలు ఉండవు. సంక్రాంతి తర్వాత వచ్చే మాఘమాసం కళ్యాణసమయం. ఆ కాలంనాటికి ఇంటి పిల్లలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా మినుములు ఉపయోగమే! మగవారు రాబోయే పొలం పనులకు సిద్ధంగా ఉండాలన్నా, ఆడవారు ఇంటిపనులను చకచకా నిర్వహించుకోవాలన్నా తగిన సత్తువని అందించేది మినుములే.
కొత్తబియ్యం
సంక్రాంతికి కొత్త బియ్యం, కొత్త బెల్లాలతో అరిసెలు, పరమాన్నం చేసుకోమని సూచిస్తుంటారు. ఈ సంప్రదాయం కేవలం తెలుగు, తమిళురలోనే కాదు పశ్చిమబెంగాల్ వంటి ఉత్తరాది రాష్ట్రాలలో కూడా కనిపిస్తుంది. కాకపోతే బెంగాల్లో చేసుకునే పిండివంటని ఖజూర్‌గుర్ అంటారు. కొత్త బియ్యంతో అన్నం వండుకుంటే కడుపులో నొప్పి వస్తుంది. అందుకని దీనికి బెల్లాన్ని జోడించి అరిసెలనో, పాలని జోడించి పరమాన్నమో, కారాన్ని జోడించి సకినాలనో, చింతపండుని జోడించి పులిహోరనో చేసుకుంటారు. ఈ పదార్థాలన్నీ శరీరానికి బలాన్నిస్తాయే కానీ అజీర్ణం చేయవు.
సంక్రాంతి అనగానే ఇవి కాకుండా వేరే సంప్రదాయ వంటకాలేమన్నా గుర్తుకువస్తున్నాయా! మరేం ఫర్వాలేదు. వాటన్నింటి వెనుకా ఏదో ఒక ఆరోగ్య రహస్యం ఇమిడి ఉంటుంది.
- నిర్జర.