పార్టీ పనులకే సజ్జల పరిమితం.. సలహాదారు పదవికి రాజీనామా?

జగన్ సర్కార్ లో ప్రభుత్వ అధికారుల పాత్ర కంటే సలహాదారుల ప్రాధాన్యతే ఎక్కువ అన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత మంది సలహాదారులున్నా.. వారందరిలోనూ సజ్జల పాత్ర, ప్రాధాన్యత ప్రత్యేకం. ఆయన కేవలం సలహాదారుగా మాత్రమే కాదు.. సకల శాఖల మంత్రి కూడా ఆయనే. అక్కడితో ఆగకుండా పార్టీ వ్యవహారాలన్నీ కూడా ఆయన కనుసన్నలలోనే నడుస్తాయి. అంతేనా సీఎం జగన్ విదేశీ పర్యటనలలో ఉన్న సమయంలో ఆయనే డిఫాక్టో సీఎం కూడా.  అంతే కాదు ప్రభుత్వం నుంచి లక్షల్లో వేతనం తీసుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ అధికార ప్రతినిథిగా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం తరఫునే కాదు, పార్టీ తరఫున మాట్లాడాలన్నా మీడియా ఎదుట సజ్జలే సాక్షాత్కరిస్తారు.  సజ్జల గారి అతి కారణంగా వైసీపీలోనే పలుమార్లు అసంతృప్తి వ్యక్తమైన సంగతి తెలిసిందే.  

అటువంటి సజ్జల నోటికి తాళం వేసుకోమని ఎన్నికల సంఘం హుకుం జారీ చేసింది. కోర్టుల తీర్పులనే లెక్క చేయని వైసీపీ నేతలకు ఈసీ హుకుంలు ఒక లెక్కా అని తీసిపారేయలేం. కోడ్ అమలులో ఉంది కనుక ఈసీ వాక్కు ను తుచ తప్పకుండా పాటించాల్సిన పరిస్థితి ఉంది.  వైసీపీ తరఫున రోజూ మీడియా ముందుకొచ్చే సజ్జల నోరుమూసుకోవలసిన పరిస్థితి వస్తే ఎలా?   ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ప్రభుత్వం నుంచి జీతభత్యాలు పొందుతున్న 40 మంది ఏపీ సలహాదారులు కోడ్ పరిధిలోనికి వస్తారని ఈసీ పేర్కొంది. నిర్దేశించిన విధులకు బదులుగా రాజకీయ జోక్యం చేసుకుంటున్నారని ఇకపై అది కూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.  

ఈ ఆదేశాలు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎలా తీసుకున్నారో కానీ సజ్జల మాత్రం ఇజ్జత్ కీ సవాల్ అన్నట్లుగా భావిస్తున్నారు. తనను నియంత్రించడానికి ఈసీ ఎవరు అన్న భావన వ్యక్తం చేస్తున్నారు. అవసరం అయితే ముఖ్య సలహాదారు పదవికి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో పార్టీ కోసం పని చేయడానికైనా రెడీ అంటున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ప్రస్తుతం పార్టీలో, ప్రభుత్వంలో సజ్జల ప్రభ వెలుగుతోంది. సజ్జల నోటి వెంట ఒక మాట వచ్చిందంటే అది జగన్ నోటి వెంట వచ్చినట్లేనని పార్టీ వర్గాలు భావిస్తుంటాయి.  

అలాంటి ఆయన ఇక మీడియాకు కనిపించకూడదు అంటే పార్టీ వాయిస్ వినిపింొచడం ఎలా? అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.  దీంతో సజ్జల ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవికి రాజీనామా యేసేయడానికి రెడీ అయిపోయారని  పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.  

అదీ కాక ఇప్పుడు ఎలాగూ ఎన్నికల కోడ్ ఉంది. జగన్ కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. దీంతో ప్రభుత్వ పరంగా నిర్వహించాల్సిన కార్యకలాపాలు కానీ, వ్యవహారాలు కానీ ఏవీ ఉండవు. అటువంటప్పుడు హోదా కోసం, వేతనం కోసం ముఖ్య సలహాదారుగా కొనసాగడం కంటే  పార్టీ నేతగా ఉండి వ్యవహారాలు చక్కబెట్టడమే బెటర్ అని సజ్జల భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే  కీలక స్థానాలను అస్మదీయులు, అనుకూలురతో నింపేశారు.  ఇప్పుడు ఇక అధికారులకు దిశా నిర్దేశం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలు వారికి అర్ధమైపోయాయి. సో పార్టీ నేతగా  ప్రచార కార్యక్రమాలు, మీడియాతో సమన్వయం వంటి పనులు చూడటమే బెటర్ అన్న అభిప్రాయంతో సజ్జల ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.