శభాష్ తోటకూర!

అంతరిక్షానికి వెళ్ళడం అంటే ఆషామాషీ విషయం కాదు.  అంతరిక్షానికి వెళ్ళాక తిరిగి వచ్చినా, రాకపోయినా కీర్తి మాత్రం  చరిత్రలో నిలిచిపోతుంది. అయితే అంతరిక్షానికి వెళ్ళే అవకాశం  మాత్రం చాలా చాలా చాలా కొద్ది మందికి మాత్రమే వస్తుంది.  భారతీయులకైతే ఆ అవకాశం చాలా తక్కువ. గతంలో  కొంతమంది భారత మూలాలున్న అమెరికా పౌరులు  అంతరిక్షానికి వెళ్ళారు.

అయితే, ఇప్పుడు నూటికి నూరు శాతం  భారతీయుడు.. అందులోనూ మన తెలుగు కుర్రాడు.. ఇంకా  చెప్పాలంటే విజయవాడ కుర్రాడు అంతరిక్షంలోకి  వెళ్ళబోతున్నాడు. అతని పేరు గోపీచంద్ తోటకూర. గోపీచంద్  వయసు మూడు పదులు. అట్లాంటాలో వున్న ప్రిజెర్వ్ లైఫ్  కార్న్ అనే ఒక వెల్‌నెస్ సంస్థకి గోపీచంద్ సహ  వ్యవస్థాపకుడిగా వున్నారు. ఇప్పుడు ఆయనకి అమెజాన్  వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కి చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ  అంతరిక్షానికి వెళ్ళే అవకాశాన్ని కల్పించింది.

ఈ సంస్థ చేపట్టిన  ఎస్.ఎస్.25 మిషన్ అనే పేరుతో చేపట్టిన అంతరిక్ష యాత్రకు  ఆరుగురిని ఎంపిక చేసింది. వారిలో మన తెలుగు కుర్రాడు గోపీచంద్ తోటకూర ఒకడు. విజయవాడలో పుట్టి పెరిగిన గోపీచంద్ అమెరికాలో ఏరోనాటికల్ సైన్స్ లో బ్యాచ్‌లర్ డిగ్రీ  కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత కమర్షియల్ జెట్ పైలెట్‌గా  పనిచేశాడు. ఫ్లైట్లు మాత్రమేనా... బుష్ ప్లేన్లు, ఏరోబాటిక్ ప్లేన్లు,  సీ ప్లేన్లు, గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లకు కూడా గోపీచంద్  పైలట్‌గా వ్యవహరించాడు. ఇంత టాలెంటెడ్ కాబట్టే గోపీచంద్‌కి  ఇప్పుడు అంతరిక్షానికి వెళ్ళే ఛాన్స్ దక్కింది. గోపీచంద్ అండ్  టీమ్ అంతరిక్షానికి ఎప్పుడు వెళ్తారనే తేదీ మాత్రం ఇంకా  కన్ఫమ్ కాలేదు. మొత్తానికి శభాషోయ్ తోటకూర!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu