రోజా పోలింగ్ కొనసాగుతుండగానే.. ఓటమి ఒప్పేసుకున్నారు!
posted on May 13, 2024 4:22PM
వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ రోజా.. నగరి నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగారు. కానీ సోమవారం పోలింగ్ ప్రారంభం కాగానే ఆమె కాడె వదిలేశారు. మధ్యాహ్నం అయ్యేసరికి నేరుగా కాకపోయినా ఆమె తన ఓటమిని మీడియా ముందు అంగీకరించేశారు. నగరిలో వైసీపీ నాయకులే తెలుగుదేశం అభ్యర్థి విజయం కోసం పని చేశారని ఆమె మీడియా ముఖంగా చెప్పారు.
అసలు తొలి నుంచీ నగరి నియోజకవర్గాన్ని రాయలసీమలో కుప్పం తరువాత తెలుగుదేశం గ్యారంటీగా గెలిచే సీట్లలో ఒకటిగా ఆ పార్టీ భావిస్తోంది. ఎన్నికలకు ముందు వెలువడిన ప్రతి సర్వే కూడా నగరిలో తెలుగుదేశం విజయం నల్లేరు మీద బండినడకేనని తేల్చేశాయి. అయితే రోజా మాత్రం నగరిలో హ్యాట్రిక్ కొడతానని ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక్కడ ఆమెకు ప్రత్యర్థిగా మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు గాలి భాను ప్రకాశ్ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.
పోలింగ్ ప్రారంభమయ్యే వరకూ విజయంపై ధీమాగా ఉన్న రోజా.. ఆ తరువాత మాత్రం చేతెలెత్తేశారు. ఓటమిని అంగీకరించేసినట్లుగానే మీడియా ఎదుట మాట్లాడారు. కనీసం పోలింగ్ పూర్తయ్యే వరకూ కూడా ఆమె ఆగలేకపోయారు. సొంత పార్టీ నేతలే తెలుగుదేశం పార్టీ కోసం పని చేశారని చెప్పడం ద్వారా పరోక్షంగా తన ఓటమి ఖాయమని స్వయంగా ఆమె చెప్పేశారు. ఇంతకీ ఆమె మీడియాతో ఏం మాట్లాడారంటే.
నగరిలో స్థానిక తెలుగుదేశం కేడర్, నాయకులతో తనకు వచ్చిన సమస్యేమీ లేదన్నారు. సమస్యల్లా కొందరు వైసీపీ నేతలతోనేనని కుండబద్దలు కొట్టేశారు. వారు తన ఓటమే లక్ష్యంగా నగరిలో పని చేశారని ఆరోపించారు. వారు హాయిగా జగన్ ను కలిసి ఆశీర్వాదాలు తీసుకుంటారు. నగరికి వచ్చి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పని చేస్తారని రోజా విమర్శించారు.