పాపం రోజా..నామినేషన్ ర్యాలీ వెలవెల!

రోజా.. రాజకీయ నాయకురాలిగా మారిన నటి.  ఏపీ పర్యాటకశాఖ మంత్రి. రెండు సార్లు ఎమ్మెల్యే. ఒకసారి ఏపీఐఐసీ చైర్ పర్సన్. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. ఆమె తెలుగుదేశంలో ఉన్నా.. వైసీపీలో ఉన్నా.. ప్రత్యర్థులపై విరుచుకుపడడంలో దిట్ట.  విశాఖ విమానాశ్రయంలో   మధ్య వేలు చూపించి జనసైనికులను రెచ్చగొట్టగలరు. అలాంటి రోజాకు ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే  సీన్ సితార అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ విషయాన్ని గతంలో రోజాయే స్వయంగా అంగీకరించారు. మంత్రినైన తనను నియోజకవర్గంలో బలహీనపరిచే విధంగా ప్రతిపక్షాల వాళ్లు నవ్వుకునేలా సొంత పార్టీ వారే వ్యవహరిస్తున్నారని రోజా దాదాపు ఏడాదిన్నర కిందటే కళ్లనీళ్లు పెట్టుకుని మరీ మీడియా ముందు చెప్పారు.   సొంత నియోజకవర్గంలోనే రోజాకు సొంత పార్టీ నుంచే మద్దతు కరవైందని అప్పట్లోనే  అందరికీ అవగతమైపోయింది.  దీంతో రోజా వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ లభించే అవకాశాలు లేవని కూడా అప్పట్లో బాగా  ప్రచారం అయ్యింది. అయితే ఈమె నగరి నుంచి పోటీ చేస్తున్నారు. పార్టీ టికెట్ దక్కించుకున్నారు. అంత వరకూ ఓకే కానీ తన విజయం కోసం నియోజకవర్గ నేతలు పని చేసేలా సమాయత్తం చేసుకోవడంలో  మాత్రం విఫలమయ్యారని ఆమె నామినేషన్ సందర్భంగా జరిగిన ర్యాలీని చూస్తే అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు. 

వాస్తవానికి ఆమె గెలిచిన రెండు సార్లూ కూడా నగరిలో రోజాకు స్వల్ప మెజారిటీయే వచ్చింది. 2014 ఎన్నికలలో రోజా తెలుగుదేశం సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడిపై 871 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఆ తరువాత 2019 ఎన్నికలలో గాలి ముద్దుకృష్ణమ తనయుడు గాలి భాను ప్రకాష్ పై 2,007 ఓట్లు తేడాతో గెలుపొందారు. జగన్ హవా నడిచిన ఆ ఎన్నికలలో ఆ మెజారిటీ స్వల్పమనే చెప్పాలి. 

 ఈసారి ఎన్నికల్లో  కూడా రోజాకు భాను ప్రకాశ్  ప్రత్యర్థి. గత ఎన్నికలలో  ఓడిపోయిన భాను ప్రకాశ్ పై నియోజకవర్గం ఓటర్లలో సానుభూతి కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  దీనికి తోడు నగరి నియోజకవర్గంలో రోజాకు సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.  ఈ నేపథ్యంలో ఆమె నగరి నుంచి హ్యాట్రిక్ సాధించాలన్న ఆశలు ఆవిరయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే రోజాను వ్యతిరేకించే వైసీపీలోని బలమైన వర్గం.. తెలుగుదేశం గూటికి చేరిపోయారు. అలా చేరకుండా వైసీపీలోనే ఉన్నవారు ఆమెకు సహాయ నిరాకరణ చేస్తూ లోపాయికారీగా తెలుగుదేశంకు సహకరిస్తున్నారని వైసీపీ వర్గాలే అంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రోజా విజయం కోసం సహకరించే ప్రసక్తే లేదని నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. రోజాకు నియోజకవర్గ పార్టీ నేతలతో ఉన్న విభేదాలకు ఆమె నామినేషన్ ర్యాలీ అద్దం పట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

సొంత నియోజకవర్గం నుంచి పార్టీకి చెందిన నేతలు ఎవరూ రోజా నామినేషన్ ర్యాలీలో పాల్గొనకపోవడంతో ఆమె బైరెడ్డి సిద్ధార్థరెడ్డి  ముఖ్యఅతిధిగా అహ్వానించి నామినేషన్  దాఖలు చేయాల్సి వచ్చింది.  గత ఎన్నికలలో రోజా విజయం కోసం కృషి చేసిన రెడ్డివారి చక్రపాణిరెడ్డి,   మురళీనాథరెడ్డి వంటి వారు రోజా ను గెలిపించడం కోసం పని చేసే ప్రసక్తే లేదని ప్రకటించి మరీ  పరోక్షంగా తెలుగుదేశం అభ్యర్థి గాలి భాను ప్రకాష్ కు సహకారం అందిస్తున్నారు. రోజా విషయంలో పార్టీ హైకమాండ్ కూడా లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. అసమ్మతిని బుజ్జగించే పని కూడా చేయడం లేదు. దీంతో రోజా హ్యాట్రిక్ డ్రీమ్ నెరవేరే అవకాశాలు అంతంత మాత్రమేనని అంటున్నారు.