Rock Salt వాడి చూడండి – జీవితం మారిపోతుంది
posted on Aug 10, 2018 11:08AM

ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది అంటే పసిపిల్లవాడు కూడా సముద్రం నుంచి అని ఠక్కున చెప్పేస్తాడు. కానీ గనుల నుంచి కూడా ఉప్పు దొరుకుతుందని చాలామందికి తెలియదు. దీనినే రాతి ఉప్పు- రాక్ సాల్ట్ అని పిలుస్తారు. రాళ్ల ఉప్పులో చాలా ఖనిజాలు ఉంటాయి. వీటితో సాధారణ ఉప్పు వల్ల ఏర్పడే చెడు ఫలితాలు రావు సరికదా... ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవేంటో ఓసారి మీరే చూడండి...
- ఉప్పు అనగానే మనకి బీపీనే గుర్తుకి వస్తుంది. సాధారణ ఉప్పులో ఎక్కువగా ఉండే సోడియం వల్ల, మన రక్తపోటు పెరిగిపోతుంది. కానీ రాక్ సాల్ట్ అలా కాదు. సాధారణ ఉప్పుతో పోల్చుకుంటే- ఇందులో సోడియం క్లోరైడ్ తక్కువగా ఉండి, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఉప్పుని వాడితే రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది.
- రాతి ఉప్పులో 80కి పైగా ఖనిజాలు ఉంటాయని చెబుతున్నారు. అందుకని ఈ ఉప్పుని తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి, ఎలాంటి వ్యాధులూ మన దగ్గరకి రావని హామీ ఇస్తున్నారు.
- అజీర్ణానికి ఉపయోగించే చాలా ఎంటాసిడ్స్‌లో మెగ్నీషియం ఉంటుంది. రాతి ఉప్పులోనూ మెగ్నీషియం ఉంటుంది. కాబట్టి ఇది ఒక నేచురల్ ఎంటాసిడ్‌లా పనిచేస్తుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. గ్యాస్ ప్రాబ్లం మరీ ఎక్కువగా ఉంటే... కొంచెం రాతి ఉప్పుని, కాస్త జీలకర్రతో తీసుకుంటే సరి!
- ఒంట్లో ఉన్న కఫాన్ని కరిగించేందుకు రాక్ సాల్ట్ అమృతంలా పనిచేస్తుంది. రాతి ఉప్పుని నీళ్లలో వేసుకుని పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి, పొడి దగ్గు, టాన్సిల్స్ వాపు తగ్గుతాయి. రాతి ఉప్పు వేసిన నీటిని ఆవిరి పట్టడం వల్ల సైనస్, ఆస్తమా, చెవి పోటు లాంటి తీవ్రమైన వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి.
- రాతి ఉప్పుతో ఒళ్లు రుద్దుకోవడం వల్ల చర్మం మీద ఉన్న మలినాలన్నీ పోతాయి. ఇక ఒక చెంచాడు రాతి ఉప్పు నీళ్లో వేసుకుని స్నానం చేస్తే... ఎలాంటి ఒంటి నొప్పులైనా తగ్గిపోయి, హాయిగా నిద్ర పట్టేస్తుంది.
- ఇప్పటి కూరగాయల్లో పెస్టిసైడ్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయన్న విషయం తెలిసిందే! అందుకే వాటిని తరిగే ముందు రాతి ఉప్పు వేసిన నీటితో కడిగితే, కూరగాయల పై పొరల్లో ఉండే పెస్టిసైడ్స్ కొట్టుకుపోతాయని చెబుతున్నారు.
- రాతి ఉప్పుతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. రక్తప్రసరణ మెరుగ్గా ఉంటే ఒంట్లో మెటబాలిజం కూడా బాగుంటుంది. దాని వల్ల మనిషి ఆరోగ్యంగా, చురుగ్గా పనిచేయగలుగుతాడు. ఇలాంటి శరీరంలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువ అని పరిశోధనలు చెబుతున్నాయి.
- డయాబెటిస్ ఉన్నవారు సముద్రపు ఉప్పుకంటే రాతి ఉప్పుని వాడటం మంచిదని సూచిస్తున్నారు. రాతి ఉప్పుని వాడటం వల్ల ఒంట్లో షుగర్ లెవెల్స్ అదుపులో ఉండి, ఇన్సులిన్ అవసరం కూడా తగ్గుతుందట.
మన వంటల్లో రాతి ఉప్పు వాడటం వల్ల వాటి రుచి పెరుగుతుందే కానీ తగ్గదు. పైగా దీని ధర కూడా అందుబాటులోనే ఉంటుంది. మరి ఏ ఉప్పు వాడితే మంచిదో మీరే చెప్పండి!
- నిర్జర.