బియ్యం ఎవరివి? పేరు ఎవరిది ?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆదివారం (ఏప్రిల్ 6) ఓ పేదోడి ఇట్లో నేలపై కుర్చుని సహపంక్తి భోజనం చేశారు.ముఖ్యమంత్రితో పాటుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మరి కొందరు ప్రజా ప్రతినిధులు కూడా ఇంచక్కా కాళ్ళు మడిచి నేలపై కూర్చునే, భోజనం చేశారు. నిజానికి, ముఖ్యమంత్రి ఒక్కరే కాదు,మంత్రులు,అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు, గత వారం  పది రోజులుగా, ఇలా పేదల ఇళ్లలోనే చేతులు కడుగుతున్నారు. అంటే, పేదల ఇళ్ళలో,  నేల భోజనమే చేస్తున్నారు. రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డున్న కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన నాటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పేదలతో కలిసి, సన్న బియ్యం విందుల్లో పాల్గొంటున్నారు.

అవును, వారం పదిరోజుల క్రితం  ఉగాది పండగను పురస్కరించుకుని  కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి సొంత నియోజక వర్గం హుజూర్‌నగర్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  పేదల సంక్షేమమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని  స్పష్టం చేశారు. ఇక అక్కడి నుంచి, మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఇళ్ళకు వెళ్లి ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యం  అన్నం  వండించుకు తింటున్నారు. ఫోటోలు  దిగుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో  పోస్ట్ చేస్తున్నారు.  ప్రకటనల సంగతి అయితే చెప్పనే అక్కర లేదు.

అయితే సన్న బియ్యం పంపిణీకి ఇంత ప్రచారం  అవసరమా? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, చారణా కోడికి బారణా మసాలా  అన్నట్లు కూసింత చేసి కొండంత ప్రచారం చేసుకుంటోందని ఆరోపిస్తున్నాయి. నిజమే విపక్షాల ఆరోపణను పూర్తిగా కొట్టివేయడం కుదరదు. ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తూ  రాజకీయ ప్రచారం చేసుకోవడం అన్నది  అది ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా, గత కేసీఆర్ సర‘కార్’ అయినా సరి కాదు. అలా చేయడం ఆత్మ వంచన, కాదంటే ప్రజలను మోసం చేయడమే అవుతుంది.  

అవును దానే దానే పే లిఖా హై ఖానేవాలే కా నామ్  అనేది లోకోక్తి. అంటే, భగవంతుని సృష్టిలోని ప్రతి గింజ పైనా  తినే వాడి పేరు రాసే ఉంటుందని  అర్ధం.  కానీ  ఇప్పడు రాజకీయ పార్టీలు ప్రతి గింజ పైనా తమ పేరు రాసుకునే వికారాలకు పోతున్నాయి.  అందుకే ఇప్పడు రాష్ట్రంలో సన్న బియ్యం వివాదంగా మారింది. పేదల కడుపులు ప్రచార వేదికలు అవుతున్నాయి. ఓ వంక రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ దానే దానే పే లిఖా హై రేవంత్  కా నామ్  అంటూ సన్న బియ్యం క్రెడిట్  మొత్తం తమ ఖాతాలో వేసుకుంటే, రాష్ట్ర బీజేపీ నాయకులు, దానే దానే పే లిఖా హై మోదీ కా నామ్ అంటూ క్రెడిట్ మొత్తం కేంద్రం ఖాతాలో అంటే కమలం ఖాతాలో వేసుకుంటున్నారు.

నిజానికి  ఇప్పడు కొత్తగా ఉగాది నుంచి పేదలకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పథకంలో కానీ, ఇంతవరకు పంపిణీ చేసిన దొడ్డు బియ్యం పథకంలో కానీ  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెంటికీ వాటా వుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ  ఒక పైసా అటు ఒక పైసా ఇటుగా  ఖర్చును భరిస్తున్నాయి. ఆ వివరాలలోకి వెళ్ళవలసిన అవసం లేదు.  అయితే  కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వాలు ఖర్చు చేసేది చేస్తున్నది ప్రజల సొమ్మే కానీ, పార్టీల సొమ్ము కాదు. పజలు కట్టిన పన్నులతోనే ప్రభుత్వాలు పథకాలను అమలు చేస్తాయి. 

నిజానికి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందే  సంక్షేమ పథకాల అమలుకు  తను తన జేబులోంచి రూపాయి కూడా తీయనని కుండ బద్దలు కొట్టినంత స్పష్టంగా చెప్పారు. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు అమలు చేయడం సాధ్యం కాదని చెప్పే సందర్భంలో  రేవంత్ రెడ్డి ప్రజలు మోస పోవాలని కోరుకుంటున్నారు. మేము (రాజకీయ పార్టీలు) మోసం చేస్తున్నాం  అంటూ ఎలాంటి దాపరికం లేకుండా కెమెరా సాక్షిగా  తమ అమూల్య అభిప్రాయాన్ని  స్పష్టంగా చెప్పారు. ముందు ముందు అవసరం అయితే చూసుకోవడానికి వీలుగా రికార్డు చేసి మరీ వినిపించారు. సో ..సన్న బియ్యం, దొడ్డుబియ్యం..  బియ్యం ఏదైనా, ఏ గింజ పైన అయినా, ప్రజల పేరే గానీ, పార్టీల పేరు ఉండదు. సో.. బియ్యం ఎవరివి ? పేరు ఎవరిదీ ? అనే చర్చ.. ఎవరు చేసినా  అది ఆత్మ వంచనే అవుతుంది. మోసమే అవుతుంది.