రేవంత్ టార్గెట్‌గా తెరపైకి భూ-వివాదం... డిప్యూటీ కలెక్టర్ పై సస్పెన్షన్ వేటు
posted on Feb 26, 2020 9:46AM

రంగారెడ్డి జిల్లా గోపనపల్లిలో తప్పుడు డాక్యుమెంట్ల ఆధారంగా అక్రమ మ్యుటేషన్లు చేసిన శేరిలింగంపల్లి మాజీ తహశీల్దార్ శ్రీనివాస్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటుపడింది. గోపనపల్లి సర్వే నెంబర్ 127లో అత్యంత ఖరీదైన భూమిని అక్రమంగా తమ పేర రాయించుకున్నట్లు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, అతని సోదరుడు కొండల్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. మొత్తం 6.24 ఎకరాల భూమిని మ్యుటేషన్లు చేయించుకున్నట్లు ఆరోపణలు రావడంతో విచారణ జరిపిన అధికారులు.... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక ఇచ్చారు. అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా, శేరిలింగంపల్లి మాజీ తహశీల్దార్ శ్రీనివాస్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటేశారు.
హైదరాబాద్‌లో ఐటీ కారిడార్‌కు అత్యంత సమీపంలోని గోపనపల్లిలో అత్యంత విలువైన భూమికి రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారు ఎవరనే వివరాలు సక్రమంగా లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి భూదందాకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. రెవెన్యూ అధికారుల సహకారంతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అత్యంత విలువైన భూమిని తనతోపాటు, తన సోదరుడి పేరుమీద మ్యుటేషన్ చేయించుకున్నారన్న అభియోగాలపై ఉన్నతాధికారులు విచారణ జరిపారు. అయితే, శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలో ఏడెకరాల భూమిని రేవంత్‌రెడ్డి సోదరులు అక్రమమార్గంలో దక్కించుకున్నట్టు రంగారెడ్డి జిల్లా అధికారులు తమ విచారణలో తేల్చారు. దీనిపై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు నివేదికను అందజేశారు. దాంతో, నకిలీ డాక్యుమెంట్లతో మ్యుటేషన్ చేసిన అప్పటి తాసిల్దార్ శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేశారు.
గోపనపల్లి సర్వే నంబరు 127లో 10.21 ఎకరాల భూమి ఉన్నది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఈ భూమి క్రయవిక్రయాలు జరిగినట్టు కొందరు కోర్టును ఆశ్రయించారు. సర్వే నంబర్ 127లోని భూమిలో తమకు హక్కు ఉన్నదని, రేవంత్‌రెడ్డి ఆ భూములను అమ్ముకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కొల్లా అరుణ ...2017లో హైకోర్టులో 17542, 17637 నంబర్లతో రిట్‌పిటిషన్ వేశారు. అలాగే అనుముల కొండల్‌రెడ్డి ఈ భూములు అమ్ముకోకుండా ఆదేశాలు జారీచేయాలని అనిల్‌కుమార్ అనే వ్యక్తి 2015లో రంగారెడ్డి జిల్లా సివిల్ కోర్టులో 780/2015 నంబర్‌తో పిటిషన్ దాఖలుచేశారు. వీటిపై నిజానిజాలు తెలుసుకునేందుకు అధికారులు విచారణ చేపట్టారు. నకిలీ డాక్యుమెంట్ల ద్వారా ముందుగా ఈ భూమిని వేరేవారి పేరుమీద రాయించి... తర్వాత వారి నుంచి రేవంత్‌రెడ్డి, అతడి సోదరుడు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. 6 ఎకరాల 39.5 గుంటలను ఎంపీ రేవంత్‌రెడ్డి, సోదరుడు కొండల్‌రెడ్డి తమపేరు మీద రాయించుకున్నట్టు తేల్చారు.
రేవంత్‌రెడ్డి పేరు మీద రెవెన్యూ అధికారులు వివిధ మ్యుటేషన్ల ద్వారా బదిలీచేసి ప్రొసీడింగ్స్ ఇచ్చినట్టు విచారణలో తేలింది. నకిలీ డాక్యుమెంట్ల ద్వారానే ఈ మ్యుటేషన్లు జరిగినట్టు అధికారులు నిర్ధారించారు. 127 సర్వే నంబర్‌లోని భూమికి నకిలీ డాక్యుమెంట్లతో మ్యుటేషన్లు చేయడంతోపాటు, రికార్డుల్లో తప్పుగా నమోదు చేసిన నాటి శేరిలింగంపల్లి తాసిల్దార్ శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లాకలెక్టర్.. రాష్ట్ర ప్రభుత్వప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు నివేదిక పంపించారు. దీంతో డిప్యూటీ కలెక్టర్/తాసిల్దార్ డీ శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇక, వివాదంలో ఉన్న భూమి, ఎకరం విలువ పాతిక కోట్ల పైనే ఉంటుందని అంటున్నారు.