రేవంత్ రెడ్డిపై కేసు నమోదు..
posted on Jun 3, 2016 10:24AM
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. ఓయూ జన జాతరలో పాల్గొన్న ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన జన జాతర కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన కుటుంబ సభ్యులకు గంటల్లో రాజకీయ ఉద్యోగాలు కల్పించిన కేసీఆర్ విద్యార్థులకు ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేసేందుకు మాత్రం కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే లక్ష ఉద్యోగాలకు నోటీఫికేషన్లు జారీ చేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఓయుకు హెలికాప్టర్లో వచ్చిన కేసీఆర్‌కు విద్యార్థులు చెప్పులు చూపినందుకు కక్ష కట్టారన్నారు. ఓ వైపు ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయకుండా, మరోవైపు వర్సిటీకి వైస్ ఛాన్సులర్‌ను నియమించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు.
ఈ నేపథ్యంలో రాజకీయ సభలకు హాజరుకాకూడదని కోర్టు ఆదేశించినా... హైకోర్టు ఆదేశాల ధిక్కరణ కింద రేవంత్‌రెడ్డిపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా సభలో పాల్గొనేందుకు వస్తున్న తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి శ్రీధర్ బాబు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ యాదవ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.