రేవంత్ దూకుడు.. 14లోక్ సభ స్థానాల్లో గెలుపే టార్గెట్!

 తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల హీట్ తార స్థాయికి చేరింది.  నామినేష‌న్ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్నది. పార్టీల అధిష్టానాల నుంచి బీఫారంలు అందుకున్న అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 17 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌గా.. అధికార కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు నియోజకవర్గాలలో అభ్యర్థులను ఇంకా  ప్ర‌క‌టించాల్సి ఉంది. ముఖ్యంగా ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గంలో అభ్య‌ర్థి ఎంపిక‌పై కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. మ‌రోవైపు తెలంగాణ‌లో 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర‌వేసేలా సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌త్యేక దృష్టి కేంద్రీక‌రించారు. అందుకు త‌గ్గట్లుగా వ్యూహాల‌ను అమ‌లు చేస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా సీఎం రేవంత్ రెడ్డి అమ‌లు చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని అమలు కాలేదు. అయితే హామీల అమలు విషయంలో రేవంత్ చిత్తశుద్ధి కారణంగా   ప్ర‌జ‌ల్లో కాంగ్రెస్  గ్రాఫ్ పెరిగింది. మూడు నెల‌ల కాలంలో ఇచ్చిన హామీల‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు ప‌రిష్క‌రించామ‌ని, ఎన్నిక‌ల కోడ్ తొల‌గించిన వెంట‌నే మిగిలిన హామీల‌ను అమ‌లు చేస్తామ‌ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డం ద్వారా వారి నుంచి మ‌రింత మ‌ద్ద‌తు పొందేలా కాంగ్రెస్ పార్టీ దృష్టి కేంద్రీక‌రించింది. 

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల గెలుపు బాధ్య‌త‌ల‌ను సీఎం రేవంత్ రెడ్డి భుజానికెత్తుకున్నారు. దీంతో రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేయ‌నున్నారు. తమ ప్రభుత్వ పాలనకు పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండమ్ అని ఇప్పటికే  ప్రపకటించిన రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్ర‌చారానికి శ్రీకారం చుట్టారు.   మే 11వ తేదీ వరకు 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 50 సభలు, ర్యాలీలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. శుక్ర‌వారం (ఏప్రిల్ 19) మహబూబ్ నగర్ లో పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌.. సాయంత్రం మహబూబాబాద్ లో జరిగే బహిరంగ సభ లో పాల్గొంటారు. ఈనెల 20న మెదక్ అభ్యర్థి నీలం మధు మద్దతుగా ర్యాలీ, సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. 21న భువనగిరి లో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. 22న మధ్యాహ్నం ఆదిలాబాద్ లో నిర్వహించే సభ లో పాల్గోనున్న రేవంత్‌.. 23న నాగర్ కర్నూల్, 24న ఉదయం జహిరాబాద్, సాయంత్రం వరంగల్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో నిర్వ‌హించే స‌భ‌ల్లో పాల్గొంటారు. 25న చేవెళ్ల అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి మద్దతుగా ర్యాలీలో పాల్గొని అనంత‌రం జ‌రిగే సభలో రేవంత్ రెడ్డి ప్ర‌సంగిస్తారు. ఇలా మే 11వ తేదీ వ‌ర‌కు  రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సుడిగాలి ప‌ర్య‌టన‌లు చేయ‌నున్నారు.

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి పార్టీలో చేరిక‌ల జోరు రోజురోజుకు పెరుగుతోంది. బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నేత‌లు క్యూ క‌డుతున్నారు. ఇప్ప‌టికే బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేంద‌ర్, క‌డియం శ్రీ‌హ‌రి, తెల్లం వెంక‌ట్రావులు కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. తాజాగా రాజేంద్ర‌న‌గ‌ర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని క‌లిశారు. రెండు రోజుల్లో ఆయ‌న‌సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవ‌కాశం ఉంది. గ్రేట‌ర్‌లో మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మీ, డిప్యూటీ మేయ‌ర్ తో పాటు కొంద‌రు కార్పొరేట‌ర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ ఎస్ నుంచి ముఖ్య‌నేత‌లు, ద్వితీయ శ్రేణి నేత‌లు కాంగ్రెస్ లోకి క్యూ క‌డుతుండ‌టంతో పార్టీ బ‌లం రోజురోజుకు పెరుగుతున్నది.   దీంతో రాష్ట్రంలో 17 లోక్‌స‌భ స్థానాల్లో 14  నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ నేత‌లు ధీమాతో ఉన్నారు. 

కాంగ్రెస్ పార్టీ మూడు నెల‌ల పాల‌నకు పార్ల‌మెంట్ ఎన్నిక‌లు రెఫ‌రెండమ్ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బ‌కొట్ట‌డం ద్వారా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీది గాలివాటం గెలుపేన‌ని నిరూపించేందుకు బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  మ‌రోవైపు బీజేపీ అధిష్టానంసైతం కాంగ్రెస్ కు షాకిచ్చేందుకు సిద్ధ‌మ‌వుతుంది. ఇప్ప‌టికే బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీల నేత‌లు రేవంత్ రెడ్డి మూడు నెల‌ల పాల‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇచ్చిన హామీల‌ను అమలు చేయ‌డంలో రేవంత్ స‌ర్కార్ పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని, కేవ‌లం ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్ట‌డానికే అధికారాన్ని వినియోగిస్తున్నార‌ని మాజీ సీఎం కేసీఆర్ విమ‌ర్శించారు. ప్ర‌జ‌ల్లోకి వెళ్లి కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీరును ఎండ‌గ‌తామ‌ని అన్నారు. అయితే,  బీజేపీ, బీఆర్ ఎస్   నేత‌ల నుంచి ఎదుర‌య్యే విమ‌ర్శ‌ల‌కు రేవంత్ రెడ్డి  ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాధానం ఇస్తూ తిప్పికొడుతున్నారు. తాజాగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌ల‌కు సిద్ధ‌మ‌య్యారు. ఈ ప‌ర్య‌ట‌న‌ల్లో ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్ట‌డంతోపాటు.. రాబోయే కాలంలో ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అండ‌గా ఉంటుందో స్ప‌ష్టం చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ అధిష్టానం టార్గెట్ ను రేవంత్ ఏమేర‌కు రీచ్ అవుతాడ‌నే అంశం తెలంగాణ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.