68 వసంతాల 'ఘన'తంత్రం!

 

68 సంవత్సరాలు! ఒక మనిషి జీవితంలో సుదీర్ఘమైనవి కావచ్చు. కానీ ఒక దేశ చరిత్రలో ఇవి తొలి అడుగులే! ఆ తొలి అడుగులలోనే తనదైన ముద్రను వేసుకున్న దేశం మనది. సరిగ్గా 68 సంవత్సరాల క్రితమే మన దేశం అతి పెద్ద ప్రజాస్వామ్యంగా అవతరించింది. స్వేచ్ఛ, సమానత్వాలకు పెద్ద పీట వేస్తూనే ప్రభుత్వం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అన్న మౌలిక అంశాల మీద రాజ్యాంగాన్ని రూపొందించుకుంది. రాజ్యాంగాన్ని రూపొందించుకున్ననాటి నుంచీ ఇప్పటి వరకూ దేశం ఎన్నో ఆటుపోట్లను తట్టుకుంది. ఎన్నో వెన్నుపోట్లని ఎదుర్కొంది. అయినా దేశం చలించలేదు. దేశంలో పదుల కొద్దీ రాష్ట్రాలు ఉండవచ్చు, వందలకొద్దీ భాషలు ఉండవచ్చు, వేల కొద్దీ కులాలు ఉండవచ్చు… అయినా సందర్భం వస్తే అంతా ఒక్కటవుతామని నిరూపించేందుకు కార్గిల్‌ వంటి ఉదంతాలు చాలానే కనిపిస్తాయి.

 

ప్రతి గణతంత్రమూ మనకి ప్రత్యేకమే అయినా ఈ గణతంత్రపు సంబరాల్లో చీఫ్ గెస్ట్ గా పాల్గొంటోన్న అబుదాబీ యువరాజు మహ్మద్ బిన్ జాయేద్ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు. ఆయన రాక కేవలం ఫార్మాలిటీగా మాత్రమే చూడకూడదు. మధ్య ప్రాచ్యంలోని చమురు ఉత్పత్తి దేశాలతో దశబ్దాలుగా భారత్ సత్సంబంధాలు కొనసాగిస్తోంది. మోదీ వచ్చాక మరింత శ్రద్ధ తీసుకుంటున్నారు. పాకిస్తాన్ తో, చైనాతో మనకున్న విభేదాల కారణంగా చమురు ఉత్పత్తి చేసే అబుదాబి లాంటి దేశాల మైత్రి ఎంతో అవసరం. అందుకే, ఆ దేశపు కాబోయే రాజు మన దేశానికి రావటం ఎంతో ప్రత్యేకం. అంతే కాదు, ఒక రాచరిక వ్యవస్థకు ప్రతినిధి అయిన యువరాజు ప్రపంచపు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశపు గణతంత్ర ఉత్సవాల్లో పాల్గొనటం నిజంగా విశేషమే! 

 

ఒక్కసారి మనం గతంలోకి తొంగి చూస్తే ... భారతదేశం తన రాజ్యాంగాన్ని రాసుకునేనాటికి దేశంలో అయోమయం నెలకొని ఉంది. నిరంతరం వేధించే కరువులు, పరాయి పాలనలో దివాళా తీసిన పరిశ్రమలు, నిరుద్యోగం, నిరక్షరాస్యత… వీటన్నింటికీ తోడు సాంఘిక దురాచారాలు. ఇప్పటికీ ఈ సమస్యలు లేవని కావు! కానీ నెమ్మది నెమ్మదిగా వాటిని అధిగమిస్తూ దేశం సాధించిన పురోగతి కూడా ఏమంత సామాన్యమైనది కాదు.అగ్గిపెట్టి కోసం కూడా పరాయి దేశం మీద ఆధారపడే పరిస్థితి నుంచి అణువుని సైతం ఛేదించగలిగే సామర్థ్యాన్ని పొందగలిగాం. అణా కాసుల కోసం చేయి చాచే స్థితి నుంచి అమెరికాకే నిపుణులని అందించే స్థితికి ఎదిగాం. అంటరాని తనం నుంచి ఆనకట్టలను దేవాలయాలుగా భావించే ఔన్నత్యానికి చేరుకున్నాం. ప్రపంచమంతా అమెరికావైపా, రష్యావైపా అని కొట్టుకు చస్తుంటే అలీనోద్యమం పేరుతో లోకానికి ఒక కొత్త ఉనికినిచ్చాం.

 

నిజమే!ఇంకా మన దేశం సాధించాల్సింది చాలానే ఉంది. అసమానతలు ఉన్నాయి, అసహనమూ ఉంది. కులాల మౌఢ్యం, పేదరికపు జాడ్యం అలానే ఉన్నాయి. నిరక్షరాస్యత, నిరుద్యోగం మన తలరాతలను శాసిస్తేనే ఉన్నాయి. అయినా వెనుకడుగు వేసేది లేదు. ఇన్ని సాధించిన దేశం ఇప్పుడు బేలతనంతో ఊరుకునేదీ లేదు. ఒక్కో గణతంత్రం దినోత్సంతో మన దేశం మరో అడుగు ముందుకు వేస్తూనే ఉంటుంది. ఎప్పుడూ అడుగు ముందుకు వేస్తూనే ఉంటుంది. అందుకే ప్రపంచం చూపంతా ఇప్పుడు ఇండియా వైపే!