మౌనమేలనోయీ.. విజయసాయీ!?
posted on Feb 24, 2023 3:38PM
వైసీపీలో కీలక నేత విజయసాయి. అందులో సందేహం లేదు. పార్టీ ఆవిర్బావం నుంచి.. పార్టీ నిర్మాణం వరకూ, 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సహా అన్నిటా అత్యంత కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. అందుకే విజయసాయిని జగన్ వరుసగా రెండు సార్లు రాజ్యసభకు పంపించారు. ఢిల్లీ స్థాయిలో పార్టీ వ్యవహారాలు, ప్రధాని, హోంమంత్రి అప్పాయింట్ మెంట్ సహా ప్రతి విషయాన్నీ స్వయంగా పర్యవేక్షించే వ్యక్తి విజయసాయి.
అలాగే అధినేత మనసెరిగి విపక్షంపై మాటల దాడి చేయడంలోనూ, విమర్శలతో విపక్షాల నాయకులను చెరిగేయడంలోనూ విజసాయి స్టైలే వేరు.. రూటే సెపరేటు. ట్విట్టర్ వేదికగా ఆయన తెలుగుదేశం పార్టీనీ, ఆ పార్టీ నాయకులనూ ఉద్దేశించి చేసే వ్యాఖ్యలు పలుమార్లు వివాదాస్పదం అయ్యాయి కూడా. అయితే ఆయన ఎప్పుడూ తగ్గేదేలే అన్నట్లుగా ముందుకే సాగారు తప్ప వెనుకడుగు వేసిన సందర్బం కనిపించలేదు. అయితే ఇటీవలి కాలంలో విజయసాయికి పార్టీలో ప్రాధాన్యత తగ్గిందా అన్న అనుమానం వైసీపీ శ్రేణులలోనే వ్యక్తమౌతోంది. గత కొంత కాలంగా ప్రభుత్వ సలహాదారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల పార్టీ వ్యవహారాలన్నీ తానై చక్కబెడుతున్నారు.
ఈ పరిస్థితి చాలా కాలంగా కొనసాగుతున్నప్పటికీ విజయసాయి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఆయనదే అన్నట్లుగా పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే సోషల్ మీడియా బాధ్యతల నుంచి విజయసాయిని తప్పించి.. సజ్జల కుమారుడికి ఆ బాధ్యతలు కట్టబెట్టారో.. అప్పటి నుంచీ విజయసాయి ప్రతి కదలికపైనా జగన్ నిఘా పెట్టారా అన్న అనుమానాలు వ్యక్తమౌతూ వస్తున్నాయి. అన్నిటి కంటే ముఖ్యంగా గత నెలలో సీబీఐ అవినాష్ రెడ్డిని విచారణకు పిలిచిన సందర్భంగా... ఆ విచారణ తేదీ కంటే ముందు జగన్ హస్తిన వెళ్లి మోడీతో భేటీ కావాలని భావించారు.
అయితే.. మోడీ అప్పాయింట్ కన్ ఫర్మ్ చేయడంలో విజయసాయి విఫలం కావడంతో జగన్ కినుక వహించారని కూడా పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సరే ఆ విషయం పక్కన పెడితే.. రీసెంట్ పాస్ట్ నుంచి విజయసాయి తీరు కూడా పార్టీ వర్గాల్లో పలు అనుమానాలకు తావిస్తోంది. అన్నిటికీ మించి రాజ్యసభ వేదికగా అమరావతిపై ఆయన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం వైసీపీకి శరాఘాతంగా తగిలింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారమే అమరావతిని ఏపీ రాజధానిగా నిర్ణయించినట్లు కేంద్రం స్పష్టం చేయడమూ, మూడు రాజధానుల విషయంలో జగన్ ప్రభుత్వం తమను సంప్రదించ లేదని కుండబద్దలు కొట్టడంతో ఇంత కాలం అమరావతి విషయంలో జగన్ సర్కార్ చెబుతున్న మాటలన్నీ అవాస్తవాలని తేలిపోయింది. దీంతో వైసీపీ సర్కార్ డిఫెన్స్ లో పడింది. ఇది కూడా పార్టీలో విజయసాయి ప్రాధాన్యత తగ్గడానికి కారణమైందని చెప్పవచ్చు. ఇక లోకేష్ పాదయాత్ర ప్రారంభమైన రోజు.. ఆ కార్యక్రమంలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురై మూడు వారాల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో ఆసుపత్రికి వెళ్లి తారకరత్న ను విజయసాయి పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తారకరత్న విజయసాయికి బంధువు కావడంతో ఆయన ఆస్పత్రికి వెళ్లారు. అయితే అక్కడ ఆయన తారకరత్న ఆరోగ్యం గురించి మాట్లాడిన మాటలు, ఆ తరువాత తారకరత్న మరణించిన అనంతరం మీడియా ఎదుట విజయసాయి మాట్లాడిన మాటలూ, వైసీపీ నేతల విమర్శలను ఖండించే విధంగా ఉన్నాయి. అన్నిటికీ మించి విజయసాయి ఆ సందర్భంగా చంద్రబాబుతో ముచ్చటించడం, బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురిపించడం అప్పట్లోనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదలా ఉంచితే.. ఇటీవలి కాలంలో విజయసాయి తెలుగుదేశం, ఆ పార్టీ నేతలపై విమర్శల జోలికి పోవడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా అనూహ్య మౌనం పాటించడమో లేదా, సౌమ్యంగా మాట్లాడడమో చేస్తున్నారు.
విజయసాయి అంటే భగ్గుమనే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు సైతం విజయసాయిలో వచ్చిన ఈ మార్పును గుర్తించి.. ఇది మంచి పరిణామమంటూ కితాబునిచ్చారు. వైసీపీ పట్ల ప్రజలలో పెల్లుబుకుతున్న వ్యతిరేకతను గమనించడం వల్లే విజయసాయిలో మార్పు వచ్చిందని రఘురామరాజు భాష్యం చెప్పారనుకోండి.. అది పక్కన పెడితే.. ఇటీవల గన్నవరంలో జరిగిన సంఘటనలపై తెలుగుదేశం.. వైసీపీల మధ్య మాటలయుద్ధమే జరుగుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సైతం పరుషంగా విమర్శలు చేస్తూ.. పోలీసుల అండ లేకుండా ఎంత మంది వచ్చినా ఎదుర్కొనడానికి సై అంటూ సవాల్ విసిరారు.
ఇక తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అయితే చెప్పనే అక్కర్లేదు. వైసీపీకి అండగా నిలుస్తున్న పోలీసు అదికారుల సంగతి అధికారంలోకి వచ్చాకా తేలుస్తామంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. అదే సమయంలో జగన్ పైనా, వైసీసీ నేతలపైనా విమర్శల దాడి తీవ్రం చేశారు. ఇన్ని జరుగుతున్నా విజయసాయి నోరు మెదపడం లేదు. గతంలో జగన్ మీద ఈగ వాలితే.. అందుకు తెలుగుదేశం అధినేతే కారణమంటూ విరుచుకుపడే విజయసాయి.. ఇప్పుడు నోరెత్తడం లేదు. వివేకా హత్య కేసులో తాజా పరిణామాలపైనా ఆయన మాట్లాడటం లేదు. తాజాగా ఏపీ కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విజయసాయి వైసీపీ మంత్రులకు దూరంగా కూర్చోవడం కూడా ఏపీ రాజకీయ సర్కిళ్లలో చర్చకు తెరలేపింది. అంతే కాకుండా ప్రమాణ స్వీకారానికి ముందు గవర్నర్ ను హస్తినలో కలిసినది వైసీపీ నుంచి ఇద్దరు మాత్రమే.. వారిలో ఒకరు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కాగా రెండో వ్యక్తి విజయసాయి మాత్రమే.
ఈ నేపథ్యంలోనే గవర్నర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా విజయసాయి వైసీపీ నాయకులతో కలివిడిగా కనిపించకపోవడం రాజకీయ వర్గాలలో పలు అనుమానాలకు తావిచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏ2గా ఉన్న విజయసాయిని దూరం చేసుకుంటే భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవన్న ఆందోళన ఇప్పుడు వైసీపీ లో కనిపిస్తోందని అంటున్నారు. అసలు విజయసాయి నిజంగా పార్టీ కార్యక్రమాలకు తనంత తానుగా దూరం జరుగుతున్నారా? లేక పార్టీయే దూరం పెడుతోందా అన్న అనుమానాలకు తోడు.. ఈ మౌనం వెనుక కూడా ఏదైనా వ్యూహం ఉందా అన్న సందేహాలు కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.