రా౦సింగ్ ది ఆత్మహత్య: పోస్టుమార్టం రిపోర్ట్
posted on Mar 12, 2013 2:35PM
.jpg)
ఢిల్లీలో వైద్య విద్యార్ధిని పై సాముహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు రా౦సింగ్ మృతుదేహానికి ఎయిమ్స్ లో శవపరీక్ష నిర్వహించారు. రా౦సింగ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఉరి వేసుకోవడం వల్లనే అతను మృతి చెందాడని వైద్యుల పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
'నిర్భయ' పై సాముహిక అత్యాచారం కేసులో నిందితుడు రా౦సింగ్ జైల్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రాంసింగ్ ఆత్మహత్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాంసింగ్ మృతిపై అతని తల్లిదండ్రులు, న్యాయవాది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడిని చంపేశారని, తన కుమారుడిని మృతిని హత్యగా పరిగణించాలని రాంసింగ్ తండ్రి అన్నారు. ఆరు రోజుల క్రితం తాను కోర్టులో తన కుమారుడిని కలిశానని, తన ప్రాణాలకు ముప్పు ఉందని అతను తనకు చెప్పాడని, తన సహచర ఖైదీలు తన పట్ల అసహజంగా ప్రవర్తించారని తన కుమారుడు తనతో చెప్పినట్లు రాంసింగ్ తండ్రి మాంగే లాల్ సింగ్ చెప్పారు.
23 ఏళ్ల నిర్భయపై నిరుడు డిసెంబర్ 16వ తేదీన బస్సులో అతి కిరాతకంగా అత్యాచారం జరిగింది. బాధితురాలు సింగపూర్ ఆస్పత్రిలో డిసెంబర్ 29వ తేదీన ప్రాణాలు విడిచింది. ఢిల్లీ గ్యాంగ్ రేప్ వ్యవహారంపై ఢిల్లీ అట్టుడికింది. తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఢిల్లీలో మహిళల రక్షణపై చర్చకు ఈ సంఘటన దారి తీసింది. మహిళ రక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారికి విధించాల్సిన శిక్షలు వంటి పలు అంశాలు చర్చకు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం నిర్భయ పేరు మీద మహిళల కోసం ఓ నిధిని కూడా ఏర్పాటు చేసింది.