అయోధ్య విషయంలో సయోధ్యకి సమయమైందా?

ఎప్పుడో బాబార్ దండెత్తి వచ్చినప్పడు మొదలైన వివాదం. వందల ఏళ్ల గాయం. ఇంకా ఇప్పటికీ మన దేశ హిందూ, ముస్లిమ్ ల మధ్య అత్యంత సున్నితమైన అంశం. కాని, త్వరలో పరిష్కారం కాబోతోందా? పరిస్థితులు చూస్తుంటే అలానే అనిపిస్తోంది! అయోధ్య రామ మందిర అంశం తేలిపోవాలని సుప్రీమ్ కూడా కోరుకుంటున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి!
సుప్రీమ్ కోర్టులో తుది తీర్పు కోసం ఎదురు చూస్తోంది బాబ్రీ వివాదం. 1992లో కరసేవకులు ఆ కట్టడాన్ని నేలమట్టం చేశారు. అప్పటి నుంచీ రాముడి జన్మస్థానంగా భావింపబడుతోన్న చోట రామ లల్లా పేరుతో శ్రీరాముడే పూజలందుకుంటున్నాడు. అయితే, అదే స్థానంలో భవ్యమైన రామ మందిర నిర్మాణం చేయాలన్నది హిందూ సంస్థల ఆశయం. కాగా బాబ్రీ కూల్చిన చోటనే తిరిగి మసీదు నిర్మాణం చేయాలని సుప్రీమ్ లో కేసు వేసిన ముస్లిమ్ వర్గాల ఆకాంక్ష. అయితే, దీనిపై ఎలాంటి తీర్పునిచ్చినా మతాల మధ్య సంఘర్షణకు దారి తీస్తుందని చీఫ్ జస్టిస్ ఖేహర్ అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పు వల్ల ఏదో ఒక వర్గం అసంతృప్తికి లోనయ్యే అవకాశాలే ఎక్కువ. అందుకే, కోర్టు బయట సామరస్య పూర్వకంగా వివాదం పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. అవసరమైతే స్వయంగా తానే మధ్యవర్తిత్వం జరుపుతాననీ కూడా అన్నారు!

 

కోర్టులో కొనసాగే చాలా కేసుల్లో అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ సూచించటం జరుగుతూనే వుంటుంది. మరీ ముఖ్యంగా, ఇటు హిందూ సమాజం, అటు ముస్లిమ్ సమాజం రెండిటి మనోభావాలతో ముడిపడ్డ అయోధ్య కేసు లాంటి వాటిలో ఇరు వర్గాల మధ్య సయోధ్యకే కోర్టు ప్రయత్నిస్తుంది. అలా కాకుండా ఒక వర్గాన్ని సమర్థించే తీర్పునిస్తే రాజకీయంగా సమస్య మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం కూడా వుంటుంది. 

 

కోర్టులో అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం పోరాడుతున్న సుబ్రమణియం స్వామీ ఆవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ కి ఒప్పుకోలేదు. గతంలో అలాంటి ప్రయత్నాలు చాలా జరిగాయని ఆయన గుర్తు చేశారు. కాని, వాటి వల్ల ఫలితం లేదని అన్నారు. అయితే, అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో సమూలమైన మార్పులు వచ్చాయి. మోదీ పూర్తి స్థాయి స్వంత మెజార్జీతో ప్రధాని కావటమే అయోధ్య రామ మందిర నిర్మాణంపై ఆశలు రేకెత్తించింది. ఇక తాజాగా యోగీ ఆదిత్యనాథ్ యూపీ పీఠంపై ఆసీనులు కావటం బాబ్రీ వివాదానికి అంతం పలుకుతుందని గట్టి నమ్మకం కలిగించింది అందరికీ! ఈ సమయంలో సుప్రీమ్ చీఫ్ జస్టిస్ కూడా ఇరు వర్గాలు కోర్టు బయట సమస్య పరిష్కరించుకోవాలని సూచించటం ఆసక్తికర పరిణామమే! 

 

ఇప్పటికే అలహాబాద్ హై కోర్టు 2010లో సామరస్య పూర్వక తీర్పునిచ్చింది. హిందూ, ముస్లిమ్ వర్గాలు రెండూ సంతృప్తి పొందేలా అప్పటి న్యాయమూర్తి వివాదాస్పద భూభాగాన్ని మూడు భాగాలు చేసి గుడి, మసీద్ నిర్మాణాలు చేసుకోమని చెప్పారు. ఇంచుమించూ ఇలాంటి పరిష్కారమే ఇప్పుడు కూడా కోర్టు బయటి చర్చల ద్వారా సాధించవచ్చు. కాని, అలా విజయవంతంగా జరగాలంటే... అందరూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందకు పోవాలి. ఆ విషయం కూడా అత్యున్నత న్యాయస్థానం పిటీషనర్లుకు చెప్పటం గమనార్హం!