తెలుగు రాష్ట్రాల్లో  రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం

తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు, ఆంధ్ర ప్రదేశ్ నుంచి ముగ్గురు   ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రేణుకా చౌదరి, యువజన కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యులుగా తెలంగాణ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన ఈ మూడు స్థానాలకు మొత్తం ఆరు నామినేషన్లు దాఖలు కాగా, ముగ్గురిని ఎలక్షన్ కమిషన్ అనర్హులుగా ప్రకటించింది. ఉపసంహరణ గడువు నిన్నటితో ముగియడంతో బరిలో మిగిలిన రేణుకా చౌదరి, అనిల్ కుమార్, రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఖాళీ అయిన మూడు స్థానాల్లో రెండింటిని కాంగ్రెస్ దక్కించుకోగా, ఒక స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.  
రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన అనంతరం బీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర హైదరాబాద్ గన్‌పార్క్‌లోని అమలరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనను రెండోసారి రాజ్యసభకు పంపిన కేసీఆర్‌కు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. విభజన హామీలపై పార్లమెంటులో గళమెత్తుతానని, ఖమ్మంలో బీఆర్ఎస్‌కు పునర్వైభవం తీసుకొస్తానని తెలిపారు.
 ఇదిలా ఉంటే  ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్సార్‌సీపీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పోటీలేదని, వైసీపీ అభ్యర్థులవి మినహా ఇతరుల నామినేషన్లు దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారి, రాష్ట్ర శాసనసభ జాయింట్ సెక్రటరీ మంగళవారం ప్రకటించారు. ముగ్గురు అభ్యర్థులు గొల్ల బాబురావు, మేడా రఘునాథ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu