ఉగ్రవాదం తగ్గడానికి ఆ సంస్థే కారణం

గత మూడేళ్ల కాలంలో కశ్మీర్‌లో ఉగ్రవాదం తగ్గిందన్నారు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్. లక్నోలో నూతనంగా నిర్మించిన ఎన్ఐఏ కార్యాలయం, నివాస సముదాయాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ నిత్యం అశాంతి వాతావరణం ఉండే జమ్ముకశ్మీర్ లాంటి చోట్ల గత కొంతకాలంగా రాళ్లు రువ్వే ఘటనలు తగ్గాయని అన్నారు. దీనికంతటికి కారణం జాతీయ దర్యాప్తు సంస్థేనన్నారు. నకలీ కరెన్సీ, ఉగ్రవాదులకు నగదు అందించే మూలాలను అరికడితే ఉగ్రవాదానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందన్నారు. ఆ పనిని ఎన్ఐఏ విజయవంతంగా నిర్వహిస్తోందన్నారు. ముష్కరులకు నగదు సహకారం అందించే వారికి ఎన్ఐఏ పేరు వింటేనే వణుకు పుడుతోందని రాజ్‌నాథ్ ప్రశంసించారు.