కాంగ్రెస్ కొత్త పథకం.. ఏడాదికి రూ.72,000

 

లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి కేంద్రంలో అధికారంలోకి వస్తే కనీస ఆదాయ భరోసా పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ సమావేశం (సీడబ్ల్యూసీ) జరిగింది. ఇందులో రాహుల్‌తో పాటు ఆ పార్టీ అగ్రనేతలందరూ పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం రాహుల్‌ మీడియాతో మాట్లాడారు. ‘దేశంలోని పేదలకు కనీస ఆదాయ భరోసా పథకం అమలు చేస్తాం. భారత్‌లోని 20 శాతం మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. అంటే ఐదు కోట్ల కుటుంబాల్లోని 25 కోట్ల మంది పేదలు దీని ప్రయోజనాలను పొందవచ్చు. వారి ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో నేరుగా ఏడాదికి రూ.72,000 వేస్తాం. దీని కోసం అన్ని గణాంకాలను సరిచూసుకున్నాం. ఇటువంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా అమలు కావట్లేదు’ అని తెలిపారు. 21వ శతాబ్దంలోనూ పేదరికం అధికంగా ఉందని, దానిపై చివరి అస్త్రం తాము సంధిస్తున్నామని రాహుల్‌ అన్నారు.

కనీస ఆదాయ భరోసా పథకం గురించి రాహుల్‌ గాంధీ రెండు నెలల క్రితం ప్రకటించారు. చత్తీస్‌ఘడ్‌లో జరిగిన ఓ ఎన్నికల ప్రచారసభలో ఈ పథకాన్ని తాము తెస్తామని హామీ ఇచ్చారు. తరవాత దీనిపై మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ కూలంకషంగా చర్చించి... సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. దేశంలో కనీసం 20 కోట్ల మంది నిరుపేదలుగా ఉన్నారని పార్టీ అంచనా వేసింది. వీరందరికి నెలకు రూ.6 వేలు చొప్పున ఏడాదికి రూ. 72,000 చెల్లించాలని పార్టీ నిర్ణయించింది. దీన్నే ప్రధాన నినాదంగా జనంలోకి తీసుకెళతామని పార్టీ పేర్కొంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News