రాహుల్ భవిష్యత్ భరోసా కోసమే అధ్యక్ష పదవా?

 

సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. కానీ పార్టీ భవిష్యత్ కంటే తన కొడుకు భవిష్యత్తే చాలా ముఖ్యమన్నట్లు సోనియాగాంధీ వ్యవహరిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ దెబ్బ తింటే అందరి కంటే ఎక్కువ నష్టపోయేది రాహుల్ గాంధీయే.

 

ఒకవేళ ఆమె రాహుల్ భవిష్యత్ కి భద్రత కల్పించాలనుకొంటే అందుకోసం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవలసి ఉంటుంది. అది ఏవిధంగా అన్నది ఆమె ఇష్టం, కానీ అతనికి పార్టీ పగ్గాలు అప్పజెప్పడం ద్వారా మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఎందుకంటే నేటికీ అతను తల్లి చాటు బిడ్డగానే ఉండిపోయాడు తప్ప నాయకత్వ లక్షణాలు ప్రదర్శించుకొని తను పార్టీ అధ్యక్ష పదవిని చెప్పట్టడానికి అన్ని విధాల సమర్దుడినని నిరూపించుకోలేకపోయారు.

 

ఈ దుస్థితి నుండి పార్టీని బయటపడేయవలసిన వ్యక్తి భవిష్యత్ కి భద్రత కల్పించడానికే పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు కట్టబెట్టాలనే ఆలోచన వలన అతని భవిష్యత్ సంగతేమో కానీ ముందు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అంధకారంగా మారుతుంది. తనను తాను నిరూపించుకోలేని వాడు, తన భవిష్యత్ ను తాను తీర్చిదిద్దుకోలేని వ్యక్తి ఇక కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ని ఏవిధంగా తీర్చిదిద్దగలడు?

 

అలనాడు మహాభారతంలో దృతరాష్ట్రుడు, గాంధారీ దంపతులు ఇటువంటి పుత్ర వాత్సల్యంతో దుర్యోధనుడికి అధికారం కట్టబెట్టి తమ నూరు మంది సంతానాన్ని దానితో బాటే తమ సామ్రాజ్య కూడా కోల్పోయారు. కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇప్పుడు అచ్చం అలాగే ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలనదగ్గ నేతలు అనేక మంది ఉన్నారు. వారు కౌరవసభలో ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు మౌనం వహించినట్లు ఇప్పుడు కూడా మౌనం వహిస్తే జరిగేది కాంగ్రెస్ వస్త్రాపహరణమే. కనుక ఇప్పటికయినా వారు నోరు తెరిచి మాట్లాడి తమను తాము కాపాడుకోవడం చాలా అవసరం.

 

ఈరోజు డిల్లీలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరుగుతోంది. రాహుల్‌ గాంధీకి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పగించే విషయం చర్చించబోతున్నారు. పార్టీ ఉపాధ్యక్షుడుగా ఉన్న ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టడం అంటే అర్ధం సోనియాగాంధీ స్థానంలో అతనిని కూర్చోబెట్టడానికి సన్నాహమే తప్ప వేరొకటి కాదు. కనుక కాంగ్రెస్ నేతలు అందరూ తమ ముద్దుల రాకుమారుడి భవిష్యత్ ముఖ్యమో లేక పార్టీ భ్యవిష్యత్ ముఖ్యమో తేల్చుకోవలసిన సమయం ఇది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu