చిన్న‌మ్మ ఫైర్‌.. జ‌గ‌న‌న్న సైలెంట్‌.. వైసీపీలో వణుకు?

ఏపీ సీఎం జ‌గ‌న్మోహన్ రెడ్డికి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుందా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌న్న నిర్ణయానికి వచ్చేశారా? అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఔననే అనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. అధికార ద‌ర్పంతో పైకి దీమాను వ్య‌క్తం చేస్తున్న‌ప్ప‌టికీ మంత్రులు, ఎమ్మెల్యేలు లోలోప‌ల ఓట‌మి భ‌యంతో వ‌ణికిపోతున్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతున్నది. నాలుగేళ్ల వైసీపీ పాల‌న‌పై ఇటీవ‌ల స‌ర్వేలు నిర్వ‌హించ‌గా ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నార‌ని తేలిందని చెబుతున్నారు‌. జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి క‌క్ష‌పూరిత రాజ‌కీయాలు , రాజ‌ధాని విష‌యంలో , అలాగే   రాష్ట్రం నుంచి పెద్ద‌ పెద్ద కంపెనీలు త‌ర‌లిపోవ‌టంలోనూ జ‌గ‌న్ త‌ప్పుడు నిర్ణ‌యాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌ని, ఈ క్ర‌మంలో ఏపీలోని ప‌లు వ‌ర్గాల ప్ర‌జ‌లు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నార‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

గ‌తంలో చంద్ర‌బాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలో అమ‌రావ‌తిలో రాజ‌ధాని నిర్మాణం ప‌నులు, పోల‌వ‌రం ప‌నుల‌తో పాటు ప‌లు అభివృద్ధి ప‌నులు చేప‌ట్టారు. అయితే, 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక్క చాన్స్  అంటూ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. దీంతో సానుభూతి ఓట్లు, బీజేపీ కేంద్ర పెద్ద‌ల అండ‌దండ‌లు తోడ‌వ్వ‌డంతో భారీ మెజార్టీతో విజయం సాధించి అధికారంలోకి వచ్చారు.  అయితే ప్రజలు తనపై పెట్టుకున్న  న‌మ్మ‌కాన్ని జగన్ వ‌మ్ము చేశారనీ, , చంద్ర‌బాబు హ‌యాంలో రాష్ట్రంలో జ‌రిగిన అభివృద్ధి సైతం నిర్వీర్య‌మైంద‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారని ఇటీవలి సర్వేలలో వెల్లడైందంటున్నారు. దీంతో చంద్ర‌బాబుతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్య‌మ‌న్న భావ‌న‌కు ప‌లు వ‌ర్గాల ప్ర‌జ‌లు వ‌చ్చారని చెబుతున్నారు.  వైసీపీ ప్ర‌భుత్వం నిర్వ‌హించిన అంత‌ర్గ‌త స‌ర్వేల్లో సైతం ఇదే విషయం వెల్లడైనట్లు పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  

ఈ క్ర‌మంలో లోలోప‌ల వైసీపీ నేత‌లను ఓట‌మి భ‌యం వెంటాడుతున్నా అధికార ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ఆ పార్టీలోని నేత‌లే గుస‌గుస‌లాడుకుంటున్నారు. ఇదిలాఉంటే జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి వైసీపీ నేత‌లు టీడీపీ, జ‌న‌సేన నేత‌లే టార్గెట్‌గా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఎదురు ప్ర‌శ్నించిన వారిపై అక్ర‌మ కేసులు బ‌నాయిస్తున్నార‌న్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. అయితే వైసీపీ సర్కార్ పై ఎంతగా విమర్శలు చేసినా బీజేపీ నేత‌లకు  కౌంట‌ర్ ఇచ్చేందుకు మాత్రం వైసీపీ నేత‌లు వెనుక‌డుగు వేస్తున్నారు. జ‌గ‌న్ భారీ మెజార్టీతో అధికారంలోకి రావ‌డానికి బీజేపీకూడా ఒక కార‌ణ‌మ‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. దీంతో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి కేంద్రంలో బీజేపీ పెద్ద‌ల‌కు ట‌చ్‌లో ఉంటూ వ‌స్తున్నారు. 

అయితే ఇటీవలి కాలంలో  బీజేపీ ఏపీలో త‌న పొలిటిక‌ల్ స్ట్రాట‌జీని మార్చేసింది. నాలుగేళ్ల వైసీపీ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌ని బీజేపీ అంత‌ర్గ‌త స‌ర్వేల ద్వారా తేలడంతో  ఆ పార్టీ నేత‌లు వైసీపీపై ఎటాక్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాలు రాష్ట్రానికి వ‌చ్చి జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. జ‌గ‌న్ అవినీతి ప‌రుడు అంటూ విమ‌ర్శించారు. దీనికితోడు బీజేపీ అగ్ర‌నేత‌లు చంద్ర‌బాబును ఢిల్లీకి పిలిపించుకొని భేటీ కావ‌టం ఏపీ రాజ‌కీయాల్లో అల‌జ‌డి రేపింది.  ఇదే స‌మ‌యంలో బీజేపీ రాష్ట్ర ప‌గ్గాలు దగ్గుబాటి పురంధ‌రేశ్వ‌రికి అప్ప‌గించ‌డం ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పురంధ‌రేశ్వ‌రికి రాష్ట్ర పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డం వెనుక బీజేపీ పెద్ద వ్యూహాన్నే అమ‌లు చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

 ద‌గ్గుబాటి పురంధ‌రేశ్వ‌రి   ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన  అనంత‌రం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో వైసీపీ ప్ర‌భుత్వంపై ఆమె నిప్పులు చెరిగారు. కేంద్ర ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చిన నిధుల‌ను వైసీపీ త‌మ నిధులుగా ప్ర‌చారం చేసుకుంటున్నద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో వైసీపీ ప్ర‌భుత్వానికి ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. మామూలుగా, ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తే.. మ‌రుస‌టిరోజే కౌంట‌ర్ ఇచ్చేందుకు వైసీపీ నేత‌లు క్యూ క‌డ‌తారు. పురంధ‌రేశ్వ‌రి విష‌యంలో అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు. ఆమె వ్యాఖ్య‌ల‌ను ఖండించేందుకు, కౌంట‌ర్ ఇచ్చేందుకు వైసీపీ నేత‌లు సాహ‌సం చేయ‌లేక‌పోయారు. దీని వెనుక పెద్ద‌కార‌ణ‌మే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌వ‌న్ దూకుడుతో బెంబేలెత్తిపోతున్న త‌రుణంలో బీజేపీ నేత‌ల‌కు కూడా కౌంటర్ ఇచ్చి ఇబ్బంది ప‌డ‌టం ఎందుకనే భావ‌న‌కు వైసీపీ అధిష్టానం వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. పురంధ‌రేశ్వ‌రి వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చి కేంద్ర బీజేపీ పెద్ద‌ల‌కు ఆగ్ర‌హం తెప్పించే బ‌దులు సైలెంట్‌గా ఉండ‌ట‌మే మేల‌న్న భావ‌న‌కు జ‌గ‌న్ వ‌చ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్నది.

ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో బీజేపీతో పెట్టుకొని ఇబ్బందులు ప‌డేకంటే సైలెంట్‌గా ఉండి వారి మెప్పును పొంద‌ట‌మే మేల‌న్న భావ‌న‌లో సీఎం జ‌గ‌న్  ఉన్నార‌ని, ఈ క్ర‌మంలోనే పురంధ‌రేశ్వ‌రి వ్యాఖ్య‌ల‌కు వైసీపీ నేత‌లు కౌంట‌ర్ ఇచ్చేందుకు ఆస‌క్తి చూప‌డం లేద‌ని ఏపీ రాజ‌కీయాల్లో విస్తృత ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే వైసీపీ ఎంపీ విజయసాయి మాత్రం ప్రత్యేక హోదా, విభజన హామీలను ప్రస్తావిస్తూ పురంధేశ్వరికి కౌంటర్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ అధినేత సహా ఎవరూ పురంధేశ్వరి విమర్శలకు స్పందించకుండా మౌనంగా ఉంటే.. ఇటీవల పార్టీలో ప్రాధాన్యత కరవైందని అంతా భావిస్తున్న విజయసాయి గళమెత్తడంపై పార్టీ వర్గాల్లోనే ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. విజయసాయి కౌంటర్ పార్టీకి మేలు చేయడం అటుంచి మరింత నష్టం జరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu