పులివెందుల.. జగన్ కు ఇక దూరమేనా?

వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి  వైయస్ జగన్ కు ఇంత కాలం పెట్టని కోటగా ఉన్న పులివెందుల ఇక దూరమైనట్లేనా? తన సొంత నియోజకవర్గంలో జగన్ పట్టు కోల్పోతున్నారా? ఇంత కాలం బ్రహ్మరథం పట్టిన నియోజకవర్గ ప్రజలు ఇక ఆయనను దూరం పెట్టనున్నారా?   సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే జగన్ తన పట్టు, ప్రతిష్ట కోల్పోతున్నారా అంటే తాజా పరిణామాలను గమనిస్తే ఔననే అనాల్సి వస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.  మార్చి 15వ తేదీన.. పులివెందుల్లో చోటు చేసుకున్న పరిణామాలను ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.  

నాలుగేళ్ల కిందట.. సరిగ్గా చెప్పాలంటే మార్చి 15, 2019న జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలోని తన సొంత నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు.  ఆ దారుణ హత్య జరిగిన మార్చి 15, 2023 నాటికి నాలుగేళ్లు పూర్తయ్యింది.  ఈ  సందర్భంగా వైఎస్ వివేకా   కుమార్తె డాక్టర్ సునీత పులివెందుల్లోని తండ్రి సమాధిని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి హత్య వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారులెవరన్న దానిపై పలు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పులివెందులలో ఏర్పాటు చేసిన వివేకా వర్థంతి కార్యక్రమంలో ఆమెతో పాటు వైఎస్ ఫ్యామిలీకి చెందిన  కొద్ది మంది  హాజరయ్యారు. అదలా ఉంటే.. వైయస్ వివేకా వర్థంతి సందర్భంగా పులివెందుల్లోని     వివేకా అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఆ ఫ్లెక్సీల్లో వైఎస్ కుటుంబ సభ్యులు  దివంగత ముఖ్యమంత్రి,  డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన భార్య  విజయమ్మ, వారి కుమార్తె షర్మిల,  వివేకా కుమార్తె  సునీతతోపాటు వైయస్ రాజశేఖర్ రెడ్డి తల్లిదండ్రులు వైయస్ రాజారెడ్డి దంపతుల ఫొటోలు మాత్రమే ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటో కు ఆ ఫ్లెక్సీలలో స్థానం లేకుండా పోయింది. అలాగే కడప ఎంపీ వైఎస్ అవినాష్ ఫొటో కూడా ఆ ఫ్లెక్సీలలో కనిపించలేదు.  

వివేకా హత్య కేసులో   కడప ఎంపీ అవినాష్ రెడ్డి,  ఆయన తండ్రి  భాస్కరరెడ్డిలపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వైఎస్ వివేకా హత్య కేసు విచారణ తెలంగాణ రాష్ట్రానికి మారిన తరువాత సీబీఐ దర్యాప్తు వేగం పుంజుకుంది. దర్యాప్తులో వెల్లడౌతున్న అంశాల ఆధారంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  ఈ కేసులో సక్ష్యాలను మాయం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ అండ.. దండ మెండుగా ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  ఆ క్రమంలోనే  సునీత... తన తండ్రి హత్య లో పాత్రధారులు, సూత్రధారుల బండారం బయటకు రావాల్సిందే అంటూ ఒంటరి పోరాటం చేస్తున్నారని కూడా చర్చ జరుగుతోంది.    

ఆ క్రమంలో తండ్రి హత్య కేసు.. సీబీఐ చేపట్టడంతోపాటు ఈ కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయడం కోసం  సునీత చేసిన ప్రయత్నాలన్నీ తెలుగు సమాజం కళ్లారా చూసింది. అయితే ఇంటి ఆడపడుచు ఇంతగా పోరాటం చేస్తున్నా..  సోదరడు ప్లస్ ముఖ్యమంత్రి  జగన్ కానీ.. ఆయన ప్రభుత్వం కానీ వీసమెత్తు సహాయ సహకారాలు ఆమెకు అందించ లేదు.  

అదీకాక.. ఈ హత్య కేసులో వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారి చెప్పిన సంగతులన్నీ.. విని తెలుగు సమాజం తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. అలాంటి పరిస్థితుల్లో ఈ హత్య కేసులో దోషులు ఎవరో అధికారికంగా ప్రకటించకపోయినా.. సీబీఐ అధికారులకు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మనసా వాచా కర్మణ నిజమని నమ్ముతూ..   వివేకా అభిమానులు ఇలా ఫ్లెక్సీల ఏర్పాటు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదీ కాక పులివెందుల మొత్తం వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సానుభూతి వ్యక్తం చేస్తూ ఆమెకు అండగా నిలుస్తున్నారని కూడా అంటున్నారు. ఫ్లెక్సీలలో ఫొటోలే లేకపోవడమే కాకుండా, ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా అధికార వైసీపీ ఇక్కడ బాగా వెనుకబడటం కూడా ఇందుకు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.