నరేంద్ర మోడీ మంచి అవకాశమే ఇచ్చారు
posted on Aug 18, 2015 9:12PM
.jpg)
ఈ నెల 20న ప్రధాని మోడీతో చంద్రబాబు నాయుడు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి ఇచ్చిన ఇతర హామీల అమలుతో బాటు ప్రత్యేక హోదా మంజూరు చేయడం గురించి ప్రధానంగా వారు చర్చించబోతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్, బీజేపీలు రెండూ హామీ ఇచ్చినప్పటికీ అందరికీ తెలిసున్న కొన్ని కారణాల వలన ఇంతవరకు ప్రత్యేక హోదా మంజూరు కాలేదు. కానీ రాష్ట్ర విభజన తరువాత తీవ్రంగా నష్టపోయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంటే ఎక్కువ లబ్ది కలిగించే ఆర్ధిక ప్యాకేజి ఇస్తామని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. కానీ అది ఇంచుమించు ఎంత ఉండవచ్చునో ఆయన చెప్పలేదు.
బీహార్ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఇంతకు ముందు ఎటువంటి హామీలు ఇవ్వలేదు. అదేవిధంగా బీహార్ పరిస్థితి మరీ ఆంద్రప్రదేశ్ అంత దారుణంగా లేదిప్పుడు. కానీ ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ రాష్ట్రానికి ఏకంగా రూ.1.65 లక్షల కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కనుక రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఇదే అంశం లేవనెత్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి ఇవ్వమని గట్టిగా అడగడానికి స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీయే ఒక మంచి అవకాశం కల్పించారు. కానీ ఆ సమావేశానికి తనతో బాటు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న కాంగ్రెస్, వైకాపా, సీపీఐ మరియు ప్రజా సంఘాలను కూడా వెంట తీసుకొని వెళ్ళి అందరూ కలిసి ఆయనపై ఒత్తిడి చేసినట్లయితే ప్రత్యేక హోదా విషయంలో తక్షణమే ఏదో ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేసినట్లయితే, ఇక తెదేపాను నిందించడానికి ప్రతిపక్షాలకు అవకాశం ఉండదు కూడా. కానీ అఖిలపక్షాన్ని కలవడానికి మోడీ ఇష్టపడతారా లేదా అనేది కూడా ముఖ్యమే. ఒకవేళ ఆయన అందుకు అంగీకరించరనుకొంటే చంద్రబాబు నాయుడు కనీసం తన పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలని వెంటపెట్టుకొని వెళ్లినా ఆయనపై ఎంతో కొంత ప్రభావం చూపవచ్చును.
ఏది ఏమయినప్పటికీ, ఈ సమావేశంలో ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం, వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు వంటి అనేక హామీలపై ప్రధాని నరేంద్ర మోడీ నుండి విస్పష్టమయిన ప్రకటన చేయించడం అత్యవసరం. లేకుంటే తెదేపా మీద మరింత ఒత్తిడి పెరగవచ్చును. ఆ ప్రభావం తెదేపా-బీజేపీల స్నేహంపై పడినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాకపోయినా ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ ప్రజలకు ఈరోజు ఇచ్చిన హామీవంటి భారీ నిధులనయినా రాబట్టుకోగలిగితే రాష్ట్రం ఒడ్డున పడుతుంది.