ప్రేమించి పెళ్లి చేసుకుంటే చంపేస్తారా..

ప్రేమ,పెళ్లి ఎంతో పవిత్రమైనవి.ప్రేమించాం అని చెప్పి వెంటపడి వేధించేవారు కొందరు,ప్రేమ అంటే సరదాలు షికార్లు అనుకునే వారు కొందరు కానీ ఆ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లేది ఎందరు?..మనం ప్రేమిస్తే సరిపోతుందా మనల్ని నమ్ముకొని ఉన్న రెండు కుటుంబాలు ఏమైపోవాలి?..కులం,మతం,స్థాయి పేరుతో ఇప్పటికి పరువుకు హత్యలు జరుగుతున్నాయంటే తప్పు ఎవరిది?.. ప్రేమించటమే శాపమా?.. ఓ తండ్రి కుమార్తె తక్కువ కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందని పగపట్టాడు..

 

అల్లుడిని అతి కిరాతకంగా అంతమొందించాడు. సఖ్యతగానే ఉంటానని నమ్మించి.. కిరాయి హంతకులతో మెడ తెగనరికించాడు.ప్రణయ్,అమృత ప్రేమ వివాహం చేసుకున్నారు.దీంతో రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తి ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. అమృత తన భర్త దగ్గరే ఉంటానని పోలీసుల సమక్షంలో తల్లిదండ్రులకు తేల్చిచెప్పింది. అప్పటి నుంచి తన భర్త ఇంటి వద్దే ఉంటొంది. గొడవలు సద్దుమణిగిన తర్వాత ఇటీవలే  వరుడి తల్లిదండ్రులు మిర్యాలగూడలో వివాహ విందు ఏర్పాటు చేయగా... అమ్మాయి తరఫు బంధువులు హాజరుకాలేదు. ప్రస్తుతం అమృత గర్భిణి. దీంతో శుక్రవారం మధ్యాహ్నం వైద్య పరీక్షల నిమిత్తం అమృతను తీసుకుని ప్రణయ్‌, ఆయన తల్లి ఆసుపత్రికి వచ్చారు. అనంతరం తిరిగి వెళుతుండగా.. ప్రధాన ద్వారం వద్దకు ప్రణయ్‌ చేరుకోగానే ఆసుపత్రిలోనే మాటు వేసిన దుండగుడు వెనకనుంచి వచ్చి అతడి మెడపై కత్తితో వేటువేశాడు. దీంతో ప్రణయ్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దుండగుడు మరో వేటు వేయడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ హత్యకు అమ్మాయి తండ్రి మారుతిరావే కారణమని భావించిన పోలీసులు ఏ1గా అతడిని, ఏ2గా అమృత బాబాయి శ్రవణ్‌పై కేసు నమోదు చేశారు. నిందితులిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.