గులాబీకి గ్రేటర్ షాక్! కారుకు మూడో ప్లేసంటున్న సర్వే? 

గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ కు గ్రేటర్ షాక్ తగలబోతుందా? బల్దియా ఎన్నికల్లో అధికార పార్టీ ఆగమాగం కానుందా? రెండోసారి జెండా ఎగరేయాలనున్న కారు పార్టీ స్పీడుకు జీహెచ్ఎంసీలో బ్రేక్ పడనుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది ప్రీపోల్ సర్వేల్లో. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై తీన్మార్ మలన్నకు చెందిన క్యూ న్యూస్ యూట్యూబ్ చానెల్ నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో గులాబీ పార్టీకి గుబులు రేపే ఫలితాలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో  రికార్డ్ స్థాయిలో 99 డివిజన్లు గెలిచిన టీఆర్ఎస్ కు ఈసారి అందులో పదో వంతు సీట్లు మాత్రమే వచ్చే అవకాశాలుఉన్నాయని సర్వే ఫలిచాలను బట్టి అర్ధమవుతోంది. ఇప్పటికిప్పుడు గ్రేటర్ లో ఎన్నికల్లో జరిగితే టీఆర్ఎస్ పార్టీకి మూడో స్థానం వస్తుందని ప్రీపోల్ సర్వే స్పష్టం చేస్తోంది. అది కూడా నాలుగో స్థానంలో ఉన్న టీడీపీ కంటే కొంచెం మెరుగ్గానే ఉంది గులాబీ పార్టీ పరిస్థితి

 

గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండు డివిజన్లు మాత్రమే గెలుచుకున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈసారి భారీగా పుంజుకున్నట్లు క్యూ న్సూస్ సర్వేలో తేలింది. గ్రేటర్ లో మెజార్టీ సీట్లు హస్తం కైవసం చేసుకోబోతుందని తెలుస్తోంది. బీజేపీ కూడా కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు గ్రేటర్ పరిధిలోని 40 డివిజన్లలో క్యూ న్యూస్ ప్రీపోల్ సర్వే పూర్తైంది. ఇందులో కాంగ్రెస్ 18 డివిజన్లలో ఆధిక్య సాధించి టాప్ లో నిలిచింది. బీజేపీ 13 డివిజన్లలో ముందంజలో ఉంది. ఇక అధికార టీఆర్ఎస్ మాత్రం కేవలం ఐదు డివిజన్లలోనే లీడ్ పొందింది. టీడీపీ నాలుగు డివిజన్లలో సత్తా చాటుతూ టీఆర్ఎస్ కు దరిదాపుల్లోనే నిలిచింది. గ్రేటర్ పరిధిలో 150 డివిజన్లు ఉండగా... అందులో పాతబస్తిలోనే 50 డివిజన్లున్నాయి. ఓల్డ్ సిటీలో ఎంఐఎందే పూర్తి ఆదిపత్యం కాబట్టి.. ఆ సీట్లపై మిగితా పార్టీలు ఆశలు పెట్టుకోవు. మిగితా 100 డివిజన్లలోనే పోటీ పడతాయి. ఈ వందలోనే 40 డివిజన్లలో సర్వే జరిపింది క్యూ న్యూస్ సంస్థ. సో... దాదాపుగా ఇవే ఫలితాలు మిగితా డివిజన్లలో ఉంటాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 

ప్రీపోల్ సర్వేను పక్కాగా నిర్వహించింది క్యూ న్యూస్ సంస్థ. ఎన్నికల్లో మాదిరే బ్యాలెట్ పేపర్లతోనే సర్వే చేస్తోంది. సర్వే నిర్వహించిన డివిజన్ లోనే బాక్సులు పెట్టగా.. ఆసక్తి గల ఓటర్లు బ్యాలెట్ పేపరులో పార్టీ సింబల్ పై టిక్ చేస్తూ పెట్టేలో వేశారు. తర్వాత అందరి సమక్షంలోనే వాటిని లెక్కిస్తున్నారు. అచ్చం పోలింగ్ జరుగుతున్నట్లుగా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతి డివిజన్ లోని  2 వందల మంది నుంచి ఓటు తీసుకుంటున్నారు. ఇందులో అన్ని వర్గాల వారు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు క్యూ న్యూస్ సర్వే నిర్వాహకులు. పారదదర్శకంగా సర్వే ఉండటంతో ఫలితాలపై ప్రజలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. 

 

క్యూ న్యూస్ ఇప్పటివరకు నిర్వహించిన 40 డివిజన్లలో గ్రేటర్ లోని అన్ని ప్రాంతాలు దాదాపుగా కవరయ్యాయి. అయితే ప్రీ పోల్ సర్వేల్లో అధికార పార్టీకి నగరంలోని ఏ ప్రాంతంలోనూ సానుకూలత లభించడం లేదు. టీఆర్ఎస్ కు లీడ్ వచ్చిన ఐదు డివిజన్లలోనూ.. ఆ పార్టీకి ఇతర అభ్యర్థుల నుంచి   పోటీ  తీవ్రంగానే ఉంది. చాలా డివిజన్లలో అధికార పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. కాంగ్రెస్ ముందున్న స్థానాల్లో ఆ పార్టీకి భారీగా ఓట్లు వచ్చాయి. బీజేపీ కూడా మంచిగానే ఓట్లు సాధించింది. సరూర్ నగర్ లో అధికార పార్టీ ఏకంగా నాలుగో స్థానానికి దిగజారింది. సిటీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో ఆ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గ్రేటర్ శివారు ప్రాంతాల్లో అధికార పార్టీకి తీవ్ర వ్యతిరేకత వస్తుండగా.. ఆ ఏరియాల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి జనాల నుంచి ఊహించని సపోర్ట్ లభిస్తోంది. 

 

ఎంపీ రేవంత్ రెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న మేడ్చల్ మాల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో గ్రేటర్ లోని 50 డివిజన్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఎంపీ పరిధిలోని డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ హవా కనిపిస్తోంది. మల్కాజ్ గిరి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ , ఉప్పల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ స్వీప్ చేసేలా కనిపిస్తోంది. ఈ నాలుగు  నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా.. అధికార పార్టీ ప్రీపోల్ సర్వేల్లో బాగా వెనకబడి పోయింది. నాగోల్, కాప్రాలో  మాత్రమే కారుకు లీడ్ వచ్చింది. కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి షాకిచ్చేలా సర్వే ఫలితాలు వచ్చాయి. ఎల్బీనగర్ పరిధిలో 8 డివిజన్లు ఉండగా.. ఒక్క బీఎన్ రెడ్డి నగర్ లో మాత్రమే టీఆర్ఎస్ ముందుంది. మంత్రి సబితారెడ్డి నియోజకవర్గం మహేశ్వరం పరిధిలోని సరూర్ నగర్ డివిజన్ లో గులాబీ పార్టీ ఏకంగా నాలుగో స్థానానికి పడిపోవడం ఆశ్చర్యం కల్గిస్తోంది. 

                        
గ్రేటర్ శివారు ప్రాంత డివిజన్లలో కాంగ్రెస్ ముందుండగా.. న్యూసిటీలో మాత్రం బీజేపీ జోరు కనిపించింది ప్రీపోల్ సర్వేలో. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ పూర్తి సత్తా చాటింది. ఈ నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో  క్యూ న్యూస్ ఇప్పటివరకు నిర్వహించిన ప్రీపోల్ సర్వే లో బీజేపీనే మెజార్టీ సీట్లలో ముందంజలో ఉంది. గత ఎన్నికల్లో ఘోరంగా చతికిలపడిన కాంగ్రెస్ కూడా అనూహ్యంగా  కొన్ని డివిజన్లలో లీడ్ సాధించింది.  హైదరాబాద్ లోక్ సభ పరిధిలోని గోషామహాల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజాసింగ్ పట్టు కనిపించింది. గోషామహాల్ పరిధిలోని అన్ని డివిజన్లలో బీజేపీ లీడ్ సాధించగా.. కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. 

 

ఇక గ్రేటర్ హైదరాబాద్ లో టీడీపీ కనుమరుగయ్యందని ప్రచారం చేసే వారి దిమ్మ తిరిగేలా క్యూ న్యూస్ సర్వే ఫలితాలు కనిపిస్తున్నాయి. కూకట్ పల్లి , కుత్బుల్లాపూర్ పరిధిలోని గ్రేటర్ డివిజన్లలో టీడీపీ బలంగానే ఉన్నట్లు తేలింది. కొన్ని డివిజన్లలో ముందుండగా.. మరికొన్ని డివిజన్లలో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇప్పటివరకు జరిగిన సర్వేలో ఓవరాల్ గా అధికార టీఆర్ఎస్  కంటే టీడీపీకే ఎక్కువ ఓట్లు రావడం ఆసక్తి కలిగిస్తోంది. ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని డివిజన్లలోనూ టీడీపీకి మంచిగానే ఓట్లు పడ్డాయి. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపితే టీడీపీకి గ్రేటర్ ఎన్నికల్లో మంచి ఫలితాలే వస్తాయని ప్రీ పోల్ సర్వేను విశ్లేషించిన పొలిటికల్ అలిస్టులు చెబుతున్నారు.