రాజకీయ నాయకులు త్యాగాలకు సిద్దం కావాలి..!
posted on Jun 27, 2014 12:22PM

ఒకప్పుడు ప్రజలకి ప్రభుత్వంపై అపార నమ్మకం ఉండేది. ప్రభుత్వం తమ ధన, మాన, ప్రాణాలకు పూర్తి భద్రత ఇస్తుందని నమ్మేవారు. కారణం అప్పటి ప్రభుత్వాలను నడిపిన రాజకీయ నేతలు చాలా చిత్తశుద్దితో, నిస్వార్ధంగా పాలన సాగించేవారు. అటువంటి గొప్ప నేతలను స్పూర్తిగా తీసుకొని ప్రస్తుత నేతలు ముందుకు సాగాలి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు అనేక క్లిష్టమయిన సమస్యలున్నాయి. వాటిని అధిగమించాలంటే, నిబద్దత, దీక్ష దక్షతలతో పాటు ప్రజలలో ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడేలా చేయడం కూడా చాలా అవసరం. అప్పుడే వారి నుండి కూడా పూర్తి సహకారం దొరుకుతుంది. రాష్ట్ర ఆర్ధిక స్థితి గురించి నిత్యం ప్రజలకు వివరిస్తూ వారి నుండి సహాయ సహకారాలు అర్ధించడమే కాకుండా, కోట్లకు పడగలెత్తిన నేతలందరూ కూడా స్వయంగా భారీ విరాళాలు ఇచ్చి, తమకు ప్రభుత్వం కల్పిస్తున్న డజన్ల కొద్దీ కార్లతో కూడిన కాన్వాయిలను, బ్లాక్ క్యాట్ కమెండో సెక్యురిటీ వంటి కొన్ని సౌకర్యాలను వదులుకొని, ప్రభుత్వానికి చెల్లించవలసిన ఇంటిపన్నులు, నీటి పన్నులు, కరెంటు బిల్లులు, ఫోన్ బిల్లులు వంటి కోట్లాది రూపాయల బాకీలను వెంటనే చెల్లించి ప్రజలలో నమ్మకం కలిగించవచ్చును. కానీ వారు ఎటువంటి త్యాగాలు చేయకుండా ప్రజాధనంతో విలాసంగా జీవిస్తూ ప్రజలను త్యాగాలు చేయమని, విరాళాలు ఇమ్మని కోరడం సరికాదు.
ప్రజలు తమ నుండి ఏమి ఆశిస్తున్నారో చాలా స్పష్టంగా తెలుసు గనుక అధికారం చేప్పట్టిన నేతలందరూ, నిజాయితీగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం మొదలుపెడితే, ప్రజలందరూ కూడా తమ వంతు సహకారం అందించడానికి ఎన్నడూ వెనకాడరు. ప్రజలు, ప్రభుత్వము చేయిచేయి కలిపి నడిస్తే, రాజధాని నిర్మాణం, రాష్ట్ర పునర్నిర్మాణం పెద్ద అసాధ్యమేమీ కాదు.