కొత్త సంవత్సరంలో ఏపీ ముఖచిత్రం మారిపోతుందా?
posted on Dec 28, 2022 5:22AM
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఆయనో విలక్షణ నాయకుడు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ఎంపీ. అయినా, ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడంలో ప్రతిపక్ష పార్టీలతో పోటీ పడతారు. నిజానికి, ప్రతిపక్ష పార్టీ నాయకులు అయినా, కొన్ని కొన్ని సందర్భాల్లో, కొన్ని కొన్ని విషయాల్లో ప్రభుత్వాన్ని విమర్శించేందుకు కొంచెం అటూ ఇటు అవుతారేమో కానీ, ఆయన మాత్రం తగ్గేదేలే అంటారు. పొద్దున్న లేచింది మొదలు సొంత పార్టీని, సొంత పార్టీ ప్రభుత్వాన్ని ప్రభుత్వ విధానాలను, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, మంత్రులు, వైసీపీ నాయకులను విమర్శించడంలో విపక్షాలతో పోటీ పడుతుంటారు.
ఇక ఇంత చెప్పిన తర్వాత ఆయన ఎవరో? ఏమిటో? చెప్పవలసిన అవసరం లేదు. అవును, మీ గెస్ కరెక్ట్. ఆయన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు. ట్రిపుల్ ఆర్ .. ఆయన రాజకీయ నాయకుడు, మాత్రమే కాదు. రాజకీయ విశ్లేషణలు కూడా చేస్తారు. రాజకీయ జోస్యం అదీ చెపుతుంటారు.ఎప్పుడూ వార్తల్లో వుండే రాజు గారు, తాజాగా మరో సంచలన వ్యాఖ్య చేశారు. కొత్త సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రం ఎలా ఉంటందో, ఏమి జరిగుతుందో... క్లియర్ కట్ గా చెప్పారు.
అంతేకాదు, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణలు, ఎత్తులు, పొత్తులపై సర్క్యులేషన్ లో ఉన్న సందేహాలు అన్నిటికీ రఘురామ కృష్ణం రాజు తెర దించారు. రానున్న ఎన్నికల్లో తాను మళ్ళీ నరసాపురం నియోజక వర్గం నుంచే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. సరే అది అయన వ్యక్తిగత విషయం. వ్యక్తిగత నిర్ణయం. అయితే, రఘురామ కృష్ణం రాజు అంత మాత్రమే చెప్పలేదు. అంతటితో ఆగలేదు. టీడీపీ, జనసేన పార్టీలతో కలిసే తాను పోటీ చేస్తానని.. అందులో ఎటువంటి సందేహం లేదని తేల్చి చెప్పారు. ఒక విధంగా సంచలం ప్రకటన చేశారు. అంటే, తెలుగు దేశం, జన సేన పార్టీల మధ్య పొత్తుఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. నిజానికి, టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఉంటుందని చాలా కాలంగా మీడియాలో చర్చ జరుగుతోంది.అయితే, ఇప్పటికే జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఒకవైపు, బీజేపీ, టీడీపీల మధ్య వైరం మరోవైపు కొనసాగుతున్న నేపధ్యంలో కొత్త పొత్తులు ఎలా సాధ్యం? అనే విషయంలో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, ఇప్పడు రఘురామ కృష్ణం రాజు, అలాంటి సందేహాలు, అనుమానాలు అన్నింటికీ సమాధానం ఇచ్చారు. నిజమే అయన చెప్పింది ఆయన పోటీకి సమబందించిన విషయమే అయినా, ఆయన తాను టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తానని చెప్పడం ద్వారా, భవిష్యత్ లో టీడీపీ, జనసేన పొత్తు ఖాయమని చెప్పకనే చెప్పారని పరిశీలకులు అంటున్నారు. నిజానికి, రఘురామ కృష్ణం రాజుకు, బీజేపీ నాయకులతో చాల దగ్గరి సంబంధాలే ఉన్నాయని అంటారు. అంతే కాదు బీజేపీ నాయకులతోనే కాకుండా, బీజేపీ బాస్ ఆర్ఎస్ఎస్ నాయకులతోనూ ఆయనకు సన్నిహత సంబంధాలున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. అందుకే, ఒక దశలో ఆయన బీజేపీలో చేరతారని చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వ్యవహారం ముహుర్తాల వరకు వెళ్ళింది. అయితే, ఎదుకనో ఆయన వెనకడుగు వేశారు.పీటల మీద పెళ్లి ఆగిపోయింది అనుకోండి అది వేరే విషయం.
సరే అదంతా గతం. ప్రస్తుతంలోకి వస్తే రఘురామ కృష్ణం రాజు తాను టీడీపీ, జనసేనతో కుమ్ముక్కయ్యానని వైసీపీ నాయకులు వంతుల వారీగా చేస్తున్న విమర్శలకు సమాధానంగా అవును, టీడీపీ, జనసేనతో కలిసే తాను మళ్ళీ అదే నరసాపురం నియోజక వర్గం నుంచి పోటీ చేస్తాని స్పష్టం చేశారు. అదే విషయాన్ని ఆయన దాపరికం లేకుండా ఓపెన్ గా కుండబద్దలు కొట్టారు. అయితే, రఘురామ కృష్ణం రాజు, ఎందుకోసం, ఎవరి కోసం ఈ వ్యాఖ్యలు చేసినా అంతర్లీనంగా ఆయన చెప్పలనుకున్నది చెప్పింది కూడా ఒక్కటే బీజేపీ కలిసొచ్చినా రాకున్నా టీడీపీ, జనసేన పొత్తు ఖాయం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు..కన్సాలిడేట్ కావడం ఖాయం. వైసీపీ ఓటమి ఖాయం. ఇదే రఘురామ కృష్ణం రాజు చెప్పిన భవిష్యవాణి సారాంశం .. అంటున్నారు.
నిజానికి రాష్ట్రంలో జరుగతున్న పరిణామాలను గమనించినా రాష్ట్రంలో అధికార వైసీపీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతున్నది. అది నిజం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటల్లో చేతల్లోనూ అదే బేలతనం కనిపిస్తోంది. ఎవరో ... ఓ దారిన పోయే దానయ్య, 175కు 175 స్థానాల్లో గెలిపించే ఫార్ముల తన వద్ద ఉందని ట్వీట్ చేయాగానే, ముఖ్యమంత్రి, అ దానయ్య అర్హతలు ఏమిటి? అతని ఏ ఉద్దేశంతో ఆ ట్వీట్ చేశారు అనేది చూసుకోకుండా స్వయంగా వేగులను పంపి ఆ పిల్ల మేథావి రప్పించుకుని ఆశగా చర్చలు జరపడం, ముఖ్యమంత్రి అమాయకత్వాన్నే కాదు..ఆయనను వెంటాడుతున్న ఓటమి భయానికి అద్దంపడుతోందని అంటున్నారు. అలాగే, గత ప్రభుత్వాని కంటే తమ ప్రభుత్వం తక్కువే అప్పులు చేశామని.. ఎక్కువ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పడం కూడా ఆయనలోని అభద్రతా భావానికి అద్దం పడుతోందని అంటున్నారు. మొత్తానికి కొత్త సంవత్సరంలో ఏపీ రాజకీయాలు కొత్తగా ఉంటాయి, అనేది రఘురామ కృష్ణం రాజు మాట, అంటున్నారు.