పిల్లవాడి కోసం ఓ పోలీస్‌ తపన

పోలీసులంటే మనకేమంత సదభిప్రాయం ఉండదు. సమయానికి స్పందిచరనో, స్పందించినా సమస్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారనో మన అనుమానం. అలాంటిది... ఒక బీట్‌ కాన్‌స్టేబుల్‌ దారిలో కనిపించిన పిల్లవాడి ఆచూకీ పట్టుకునేందుకు ఇల్లిల్లూ తిరిగాడంటే ఆశ్చర్యమే కదా! ధర్మేందర్‌ అనే పోలీస్, దిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో విధులను నిర్వర్తిస్తున్నాడు. ఒకరోజు ధర్మేందర్‌ డ్యూటీలో ఉండగా, ఒక ఆటోరిక్షా అతను ధర్మేందర్‌ దగ్గరకు వచ్చాడు. అక్కడ దగ్గర్లో ఏడుస్తూ తచ్చాడుతున్న ఓ బాబు కనిపించాడు. బాబుని కదిపితే అతను తప్పిపోయాడన్న విషయం అర్థమైంది. కానీ అతణ్ని ఇంటికి తిరిగిచేర్చడం ఎలా! బాబు తన ఇంటి చిరునామా కానీ ఇతరత్రా వివరాలు కానీ చెప్పలేకపోతున్నాడు. పై అధికారుల దగ్గరకు బాబుని తీసుకుపోవడమో, పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి అతని కోసం ఎవరన్నా వస్తారేమో ఎదురుచూడ్డం అందరూ చేసే పనే! కానీ ధర్మేందర్‌ మరోలా ఆలోచించాడు. ఓ ఆటో అతణ్ని వెంటపెట్టుకుని ఆ ప్రాంతంలోని ల్లిల్లూ తిరగడం మొదలుపెట్టాడు.

 

ధర్మేందర్‌ ఏ ఇంటి తలుపు తట్టినా కూడా ‘బాబుని ఎప్పుడూ చూడలేదు?’ అన్న సమాధానమే వినిపించసాగింది. ఒకటీ రెండు కాదు, పదీ ఇరవై కాదు, కనిపించిన ప్రతి ఇంటి తలుపూ తట్టడం మొదలుపెట్టాడు ధర్మేందర్‌. ఎక్కడో అక్కడ బాబుని గుర్తించేవారు కనిపించకపోతారా అన్నది అతని ఆశ. చాలా సేపటి తరువాత... ఓ ఇంటి తలుపు తెరుచుకుని వచ్చిన పెద్దాయన ఆ బాబుని గుర్తించాడు. ఆ పెద్దాయన అందించిన వివరాలతో బాబుని అతని ఇంటి దగ్గరకు చేర్చాడు ధర్మేందర్‌. ఇంతకీ ఆ బాబు పేరు పరుల్ అని తేలింది.

 

పరుల్‌ నాన్న రెండేళ్ల క్రితమే చనిపోయాడు. అతని తల్లి రెండో పెళ్లి చేసుకుని ఎటో వెళ్లిపోయింది. పరుల్‌కి ఉన్నదల్లా ఒక తాత మాత్రమే. అలాంటి స్థితిలో ఉన్న బాబు తప్పిపోతే తిరిగి ఇంటికి చేరుకోవడం ఎంత కష్టమో ఊహించవచ్చు. ఇంటికి చేరడం మాట అటుంచి పరుల్‌ లాంటి పిల్లల కోసం వల వేసి ఉండేవారిని తప్పించుకోవడం ఇంచుమించుగా అసాధ్యమవుతుంది. ధర్మేందర్ కనుక తనకెందుకులే అని ఊరుకుంటే పరుల్ పరిస్థితి ఏమయ్యేదో ఆలోచించేందుకే భయం వేస్తుంది.

 

ఒక పదిహేను రోజుల క్రితం టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో వచ్చిన ఈ వార్త పతాక శీర్షికలలో నిలిచింది. దానికి రెండు కారణాలు... పిల్లవాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ అతని ఇంటికి చేర్చాలని తపించిన ధర్మేందర్‌ అంకితభావం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పరుల్‌కి పట్టిన దుస్థితి మన ఇంట్లో ఎవరికైనా వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరిక. ధర్మేందర్‌లాంటి నిబద్ధత కలిగిన మనుషులు, అతనికి సాయపడిన ఆటోడ్రైవర్‌ లాంటి మంచివారూ అన్నిచోట్లా ఉంటామని చెప్పలేం కదా!

- నిర్జర.