మణిపూర్ మహిళల అత్యాచారంలో పోలీసుల పాత్రః సీబీఐ

మణిపూర్ లో ఎంత మంది మహిళల మీద అత్యాచారాలు జరిగాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఓ వర్గం.. వారి పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించింది. అప్పుడు పోలీసులు ఎలా వ్య‌వ‌హ‌రించారు. బాధితుల్ని కాపాడాల్సిన పోలీసులే అల్ల‌రి మూక‌ల‌కు అప్ప‌గిస్తే ఫ‌లితం ఎలా వుంటుందో మ‌ణిపూర్ మ‌హిళ‌ల అత్యాచార సంఘ‌ట‌న అద్దం ప‌డుతుంది. ఈ కేసుకు సంబంధించిన ఛార్జి షీటులో సీబీఐ కొందరు పోలీసుల పేర్లను చేర్చింది. బాధిత మహిళలను పోలీసులే స్వయంగా నిందితుల ముందు వదిలిపెట్టారని సీబీఐ పేర్కొంది. గతేడాది మే 4న కుకీ, మెయితీల మధ్య జరిగిన గొడవల్లో ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ దాఖ‌లు చేసిన చార్జి షీట్‌లోని అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 

కార్గిల్‌ యుద్ధవీరుడి భార్య అయిన ఓ బాధితురాలు... తమను కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించాలని పోలీసులను వేడుకుంటే.. ‘జీపు తాళాలు లేవు’ అని పోలీసులు బుకాయించారని సీబీఐ ఛార్జిషీటు లో పేర్కొంది. చార్జిషీట్ వివరాల ప్రకారం, తమ గ్రామంపై జనాలు పలు బృందాలుగా విడిపోయి దాడి చేయడం ప్రారంభించగానే ముగ్గురు మహిళలు తమ కుటుంబాలతో కలిసి సమీపంలోని అడవిలోకి పారిపోయారు. కానీ, గ్రామంపై దాడి చేస్తున్న మూక వారిని గుర్తించి బయటకు తీసుకొచ్చింది. ఈలోపు గుంపులోని కొందరు బాధితులకు పోలీసులను ఆశ్రయించమని సూచించారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు మరో పురుషుడు సమీపంలోని పోలీసు జీపు వద్దకు వెళ్లి అందులోని ఇద్దరు పోలీసుల సాయం అర్థించారు. కానీ, పోలీసులు వారిని తీసుకెళ్లి దాడిచేస్తున్న గుంపు ముందు దిగబెట్టారు. ఈ క్రమంలో ఆ దుండగులు ఇద్దరు మహిళలతో పాటు ఉన్న పురుషుడిని చంపేశారు. దుండగుల దృష్టి ఇద్దరు మహిళపై ఉండగా మరో మహిళ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది. మరోవైపు, తమకు చిక్కిన ఇద్దరు మహిళలను.. దుండగులు నగ్నంగా ఊరేగించి చివరకు గ్యాంగ్ రేప్ చేశారు.   మైతీ మూకల చేతికి చిక్కిన ఇద్దరు కుకీ -జోమి వర్గానికి చెందిన మహిళల  సామూహిక అత్యాచార  ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత జులైలో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి దేశాన్ని కుదిపేసింది. ఈ అకృత్యాలపై ఆరుగురు నిందితులతోపాటు ఓ బాల నేరస్థుడిపై గువాహటిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట అక్టోబరు 16న ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ దాడుల్లో మృతిచెందిన కుకీ తెగ తండ్రీ కొడుకుల మృతదేహాలను గ్రామ సమీపంలోని నీరు లేని నదిలోకి విసిరేసినట్లు తెలియజేశారు. మైతీ మూకలు, పోలీసు జీపు వద్దకు చేరుకోగానే బాధితులను అక్కడే వదిలేసి పోలీసులు పరారైనట్టు సీబీఐ తన ఛార్జిషీటులో పేర్కొంది. పైగా సాయం చేయమని అర్థించిన ఓ మహిళను పోలీసులు కాపాడ‌కుండా, ఆ అల్ల‌రి మూక‌ల‌కే అప్ప‌గించిన విష‌యాన్ని సీబీసీ తెలిపింది.  ఈ దాడి మొత్తం ముందస్తు ప్రణాళికతో చేసిందని సీబీఐ పేర్కొంది. 

- ఎం.కె.ఫ‌జ‌ల్‌