పోలవరం అంశంపై ప్రతిపక్షాలు కేసీఆర్ కు సహకరిస్తాయా?
posted on Jun 16, 2014 9:25AM
.jpg)
తెలంగాణా ముఖ్యమంత్రి ఈరోజు అఖిలపక్షం సమావేశం నిర్వహించనున్నారు. పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలపడాన్ని వ్యతిరేఖిస్తున్న ఆయన అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకొన్న తరువాత వారితో కలిసి డిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి పోలవరంపై పునరాలోచించుకోవలసిందిగా కోరనున్నారు. ఒకవేళ మోడీ ప్రభుత్వం పోలవరంపై వెనక్కు తగ్గకపోతే, కేసీఆర్ కూడా తన పోరాటం ఉదృతం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
పోలవరం ముంపు గ్రామాల సమస్యపై ఆయన గత యూపీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నపుడు పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో కలిసిపనిచేయవలసి ఉంటుందనే ఉద్దేశ్యంతోనే అప్పుడు ఆయన గట్టిగా వ్యతిరేఖించలేదు. కానీ ఇప్పుడు దానిపై పోరాటానికి సిద్దం గమనిస్తే ముంపు గ్రామాల విషయంలో ఆయన ద్వంద వైఖరి అవలంభిస్తున్నారని అర్ధమవుతోంది. అందుకు ఆయన ప్రతిపక్షాల సహకారం కూడా కోరుతున్నారు.
కానీ ప్రతిపక్షంలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు-కాంగ్రెస్, బీజేపీ, తెదేపాలు ఆయనకు ఈవిషయంలో ఆయనకు సహకరించే అవకాశం లేదు. కాంగ్రెస్ అధిష్టానమే ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలుపుతూ నిర్ణయం తీసుకొంది గనుక టీ-కాంగ్రెస్ నేతలు కేసీఆర్ కు సహకరించలేరు. ఇక నరేంద్ర మోడీ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను తెలంగాణా బీజేపీ నేతలు వ్యతిరేఖిస్తారని భావించడం అవివేకమే. ఇక తెదేపా ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటమే కాకుండా సీమాంద్రాలో అధికారంలో ఉంది. అటువంటప్పుడు వారు కూడా పోలవరం విషయంలో కేసీఆర్ తో కలిసి ఉద్యమిస్తారని భావించలేము. పైగా ఈ అంశంలో వారి నుండి కేసీఆర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నా ఆశ్చర్యం లేదు. అందువల్ల పోలవరం అంశంపై కేవలం మజ్లిస్, సీపీఐ వంటి పార్టీలు మాత్రమే కేసీఆర్ తో కలిసి రావచ్చును.
కనుక పోలవరం ముంపు గ్రామాల గురించి ఆయన కేంద్రంతో యుద్ధం చేయడం కంటే, నిర్వాసితులకు మంచి ప్యాకేజీ కోసం పోరాటం చేసేందుకు అంగీకరిస్తే, బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు ఆయనతో కలిసి రావచ్చును. మోడీ ప్రభుత్వం అధికారం చేప్పట్టిన తరువాత తీసుకొన్న మొట్ట మొదటి నిర్ణయాన్ని అమలుచేయడం మోడీకి కూడా ప్రతిష్టాత్మకమే విషయమే అవుతుంది గనుక ఈ విషయంలో కేసీఆర్ ఆయనను సవాలు చేస్తూ ఒంటరి పోరాటం చేసి చివరికి అభాసుపాలవడం కంటే, నిర్వాసితులకు మంచి ప్యాకీజీ కోసం పట్టుబడితే అందరికీ ఆమోదయోగ్యంగానే ఉంటుంది. అందరూ ఆయనకు సహకరిస్తారు కూడా.