మాగీ గీ ఎందరికో ఆదర్శం

యుద్ధ విమాన పైలట్ శిక్షకురాలు మాగీ గీ
(5ఆగష్టు, 1923  - 1 ఫిబ్రవరి, 2013 )

మహిళలు అంటే ఇంటికే పరిమితం అన్న పురుషాధికార భావజాలాన్ని తప్పని నిరూపించారు మాగీ గీ. యుద్ధ విమానాల పైలట్ గా గాలిలో చెక్కర్లు కొడుతూ తాము ఎందులోనూ తక్కువ కాదని స్పష్టం చేశారు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో పైలట్ గా , శిక్షకురాలిగా, ఆ తర్వాత భౌతిక శాస్త్రవేత్తగా మరణించేవరకు ప్రజాసేవలోనే జీవించారు. అమెరికాలోని  ఓక్లాండా అంతర్జాతీయ విమాశ్రయానికి  ఆమె పేరు పెట్టాలన్న డిమాండ్ కూడా ఉంది.

 

కాలిఫోర్నియాలో జన్మించారు మాగీ గీ. ఆమె తాతల కాలంలోనే వారి కుటుంబం చైనా నుంచి అమెరికా వలస వెళ్లారు. ఎగిరే విమానాలను ఎంతో ఆసక్తితో గమనించే మాగీ తాను పెద్దైన తర్వాత విమానాలు నడపాలని కలలు కన్నారు. ఆమె కుటుంబం ప్రతి ఆదివారం ఓక్లాండ్ విమానాశ్రయం వద్దకు వెళ్ళి అక్కడ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ చూస్తూ గడిపేవారు.  ఆ సమయంలో ఆసియా అమెరికన్లపై జాత్యహంకారం, లింగ వివక్ష ఎక్కువగా ఉండేవి. వాటన్నింటిని ఎదిరిస్తూ మాగీ విద్యాభ్యాసం కొనసాగించారు.

 

1941 లో గీ భౌతికశాస్త్రంలో ఉన్నత విద్య కోసం ఆమె బర్కిలీ విశ్వవిద్యాలయంలో చేరారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా ఆమె చదువు సాగలేదు. 

 

ఐలాండ్ నావల్ షిప్‌యార్డ్‌లో పని చేయడానికి సిద్ధమయ్యారు. అయితే యుద్ధంలో చేరాలన్న ఆమె ఆలోచనలు అక్కడ ఎక్కువ కాలం పనిచేయనివ్వలేదు. మరో ఉద్యోగితో కలిసి 25 డాలర్లకు ఒక కారు కొనుగోలు చేసి టెక్సాస్‌లోని స్వీట్‌వాటర్‌లోని అవెంజర్ ఫీల్డ్‌కు వెళ్లారు, యుద్ధంలో పాల్జొన్నాలన్న ఆమె కోరిక విమానాలు నడపాలన్న లక్ష్యాన్ని కూడా చేరుకునేలా చేసింది. ప్రైవేట్ పైలట్ లైసెన్స్ సాధించడంతో పాటు ఉమెన్ ఎయిర్ ఫోర్స్ సర్వీస్ పైలట్స్ (డబ్ల్యూఏఎస్ పి)చేరి ఆరునెలల కఠిన శిక్షణ పూర్తి చేశారు.

అమెరికా సైన్యంలోకి తీసుకున్న మొదటి మహిళా ఫోర్స్ లో మాగీ కూడా ఉన్నారు. 25 వేలకు పైగా  మహిళలు దరఖాస్తు చేసుకోగా కేవలం వెయ్యిమందికే అవకాశం వచ్చింది. అంతేకాదు మహిళా ఫోర్స్ లోని ఇద్దరు చైనీస్ అమెరికన్ ఏవియేటర్ మహిళలలో మాగీ గీ ఒకరు.మరోకరు పైలట్ హాజెల్ యంగీలీ. యుద్ధ విమానాల పైలట్ గా శిక్షణ పూర్తి చేసినా మాగీ కి యుద్ధంలో విమానాలు నడపడానికి మాత్రం అవకాశం ఇవ్వలేదు. దాంతో ఆమె జెంట్ పైలట్లకు శిక్షణ ఇచ్చేవారు. అయితే సైనిక విమానాలను యుద్ధ ప్రాంతానికి ఆమె తీసుకువెళ్లారు.

 

యుద్ధం తర్వాత ఆమె లారెన్స్ లివర్మోర్ నేషనల్ లాబోరేటరీలో పనిచేశారు. అనేక వర్క్ షాపులు నిర్వహిస్తూ డాక్యుమెంటరీల ద్వారా తన పరిశోధనాంశాలను ప్రపంచానికి తెలియచేశారు. యుద్ధ సమయంలో మాగీ అనుభవాలు జీవిత కథ గా  సై హై ది ట్రూ స్టోరీ ఆఫ్ మాగీ గే అన్న పుస్తకంగా ప్రముఖ రచయిత మారిస్మాన్ మోస్ 2009లో తీసుకువచ్చారు. ఈ పుస్తకంలో యుద్ధ సమయంలో విమానం నడపకుండా తనను అడ్డుకున్నందుకు ఆమె పడిన ఆవేదన కనిపిస్తుంది. 2010 లో ఇతర WASP పైలట్ల తో కలిసి బంగారు పతకాన్ని అందుకున్నారు.

 

మాగీ గీ చాలా దశాబ్దాలుగా అల్మెడ కౌంటీ డెమోక్రటిక్ సెంట్రల్ కమిటీలో సభ్యురాలిగా పనిచేశారు. బర్కిలీ డెమోక్రటిక్ క్లబ్ లో చాలాకాలం బోర్డు సభ్యురాలిగా, కోశాధికారిగా కూడా  పనిచేశారు. కాలిఫోర్నియా డెమోక్రటిక్ పార్టీ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ లో, ఆసియా పసిఫిక్ ఐలాండర్ డెమోక్రటిక్ కాకస్‌లలో పనిచేశారు. 2013లో ఆమె మరణించారు. చిన్నతనం లోనే తాను కన్న కలలను సాకారం చేసుకున్న మాగీ ఎందరికో ఆదర్శంగా నిలిచారు.