టీటీడీ బోర్డు సభ్యుల నియామకాలపై హై కోర్టులో పిల్
posted on Aug 29, 2023 6:37AM
తిరుమల తిరుపతి దేవస్ధానం బోర్డు సభ్యుల నియామకాలను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. నేరచరిత్ర, లిక్కర్ వ్యాపారాలు చేస్తున్న వారిని టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించడం సరి కాదని చింతా వెంకటేశ్వర్లు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
టీటీడీ బోర్డు సభ్యులుగా ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డి నియామకాలను ఆయన సవాల్ చేశారు. ఈ ముగ్గురిరీ టీటీడీ సభ్యులుగా తొలగించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. టీటీడీ బోర్డు సభ్యుల నియామకం విషయం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉందని అటువంటి బోర్డులో నేర చరితులు, మద్యం వ్యాపారులకు స్థానం కల్పించడం సరికాదని ఆయనా పిటిషన్ లో పేర్కొన్నారు.
అసలు టీటీడీ బోర్డు చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకంపైనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తరువాత జగన్ సర్కార్ బోర్డు సభ్యులను నియమించింది. అలా నియమించిన వారిలో నేర చరితులు, అవినీతి, కుంభకోణం కేసుల్లో జైలుకు వెళ్లి అప్రూవర్ గా మారి బెయిలుపై బయటకు వచ్చిన వారి పేర్లు ఉండటంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు అదే సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది.