ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ ముందడుగు
posted on Jun 23, 2015 11:08AM
.jpg)
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తామేమీ ఆషామాషీగా ఆరోపణలు చేయలేదని నిరూపించేందుకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. హైదరాబాద్ పరిధిలో సేవలందిస్తున్న 9 టెలిఫోన్ సర్వీస్ ప్రొవైడర్లకు సిట్ నోటీసులు జారీ చేయడంతో వాటిలో యూనినార్, వొడాఫోన్, డొకొమో, రిలయన్స్, ఐడియా కంపెనీల ప్రతినిధులు విచారణ నిమిత్తం నిన్న భవానీపురం పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారుల ముందు హాజరయ్యారు.
సుమారు 11గంటల పాటు ఏకధాటిగా సాగిన నిన్నటి విచారణలో సిట్ అధికారులు “వారు ఎవరి ఆదేశాల మేరకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఫోన్లను ట్యాపింగ్ చేసారు? ఎందుకు చేసారు? ఎవరెవరి ఫోన్లను ఏఏ సమయాలలో ట్యాపింగ్ చేసారు? ట్యాప్ చేసిన ఫోన్ల డాటాను ఎవరికి అందించేరు?”వంటి వంద ప్రశ్నలను సందించి వారి నుండి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఫోన్ల ట్యాపింగ్ కి సంబంధించిన దేనినీ కూడా డిలీట్ చేయడం లేదా సాక్ష్యాలను నాశనం చేయడం వంటి పనులు చేయరాదని సిట్ అధికారులు వారిని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
సిట్ అధికారులు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్, కాకినాడ ఏఎస్పీ దామోదర్, ఏఎస్పీ నరసింహారావు మరియు విజయవాడ కౌంటర్ ఇంటెలిజెన్స్ సీఐ కాశీ విశ్వనాథ్ లు ఈ విచారణ చేసారు. ఈరోజు మిగిలిన సర్వీస్ ప్రొవైడర్లను కూడా విచారించిన తరువాత వారు అందజేసిన సమాచారాన్ని అంతా క్రోడీకరించి డిజిపి రాముడు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తారు.